iDreamPost
android-app
ios-app

టిడిపిని రాయలసీమ ఒక్కటేనా దెబ్బ కొట్టింది ?.. స్వయంకృతమేనా ?

  • Published May 29, 2020 | 8:22 AM Updated Updated May 29, 2020 | 8:22 AM
టిడిపిని రాయలసీమ ఒక్కటేనా దెబ్బ కొట్టింది ?.. స్వయంకృతమేనా ?

“మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం రాయలసీమే” .. ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. రెండు రోజుల డిజిటల్ మహనాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో పార్టీ పది శాతం తేడాతో ఓడిపోయిందన్నారు. ఇందులో రాయలసీమలోనే బాగా దెబ్బ పడిందని చెప్పారు. నిజమే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టిడిపి గెలిచింది కేవలం మూడంటే మూడు సీట్లు మాత్రమే. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 52 అసెంబ్లీ సీట్లలో టిడిపి గెలిచింది మూడు సీట్లు మాత్రమే అంటేనే దెబ్బ ఎంత గట్టిగా పడిందో అర్ధమైపోతోంది.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో 14 సీట్లుంటే గెలిచింది ఒక్క సీటు మాత్రమే. అదికూడా చంద్రబాబు పోటి చేసిన కుప్పం నియోకవర్గం. ఇక కడపలోని పది సీట్లలో ఒక్కసీటు కూడా గెలవలేదు. అలాగే కర్నూలు జిల్లాలోని 14 సీట్లలో కూడా టిడిపికి ఒక్కటీ దక్కలేదు. చివరగా అనంతపురం జిల్లాలోని 14 సీట్లలో టిడిపికి దక్కిం రెండు సీట్లు మాత్రమే. హిందుపురంలో బాలకృష్ణ, ఉరవకొండలో పయ్యావుల కేశవ్ మాత్రమే గెలిచారు. అసెంబ్లీ సీట్లలో ఫలితమే పార్లమెంటు సీట్లలో కూడా కనబడింది. మొత్తం ఎనిమిది సీట్లలో టిడిపికి ఒక్కసీటు కూడా రాలేదు.

అసలింత పరిస్ధితి టిడిపికి ఎందుకు ఎదురైంది ? ఎందుకంటే చంద్రబాబు మీద వ్యతిరేకతే ప్రధాన కారణమని చెప్పాలి. పేరుకు సొంత జిల్లానే అయినా చంద్రబాబు చిత్తూరుకు పెద్దగా చేసిందేమీ లేదు. అదే సమయంలో పార్టీలో పెరిగిపోయిన అసంతృప్తిని పట్టించుకోలేదు. దానికితోడు ఫిరాయింపు ఎంఎల్ఏ అమరనాధరెడ్డిని మంత్రిని చేసి మొత్తం పెత్తనమంతా ఆయన చేతిలో పెట్టడంతో జిల్లాలో గొడవలు పెరిగిపోయాయి. పార్టీ నేతలకు చంద్రబాబు, చినబాబు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో నేతల్లోని అసంతృప్తిని పట్టించుకునే వాళ్ళే లేకపోయారు. చివరకు కుప్పంలో కూడా చంద్రబాబు మెజారిటి 30 వేలకు పడిపోవటం గమనార్హం.

కడపలో ఎటూ వైఎస్ కుటుంబానిదే హవా అన్న విషయం తెలిసిందే. దానికితోడు ఇక్కడ కూడా ఫిరాయింపు ఎంఎల్ఏ ఆదినారాయణరెడ్డినే మంత్రిని చేయటంతో మిగిలిన వాళ్ళకు మండిపోయింది. అదే సమయంలో రాజ్యసభ ఎంపి సిఎం రమేష్ కు ఫిరాయింపు మంత్రితో ఏమాత్రం పడదు. దాంతో నేతలు వర్గాలుగా చీలిపోయారు. అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, కొడుకు శ్రీరామ్ దౌర్జన్యాలను పార్టీ నేతలే తట్టుకోలేకపోయారు. రెండోమంత్రి కాల్వ శ్రీనివాసులున్న జిల్లాలోని నేతలను శాసించే సీన్ లేదు కాబట్టి ఎవరూ మంత్రిని పట్టించుకోలేదు. అదే సమయంలో నేతల మధ్య గొడవలను పట్టించుకునే వాళ్ళే లేకపోయారు.

చివరగా కర్నూలులో కూడా పార్టీ ఒక్క సీటూ గెలవలేదు. ఇక్కడ కూడా ఫిరాయింపు ఎంఎల్ఏ భూమా అఖిలప్రియకు పెత్తనం ఇవ్వటం ప్రధాన కారణాల్లో ఒకటి. మొదటి నుండి టిడిపిలో సీనియర్ నేతలెవరికీ భూమా కుటుంబంతో పడదు. అలాంటిది వాళ్ళను బలవంతంగా టిడిపిలోకి లాక్కోవటంతో పాటు భూమా నాగిరెడ్ది హఠాన్మరణాన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చంద్రబాబు అనుకున్నాడు. ఇందులో భాగంగానే నాగిరెడ్డి కూతురు అఖిలప్రియను మంత్రిని చేశాడు. దీన్ని నేతలెవరూ జీర్ణించుకోలేకపోయారు. అసలే కేఇ, ఫరూఖ్ కుటుంబాలకు భూమా ఫ్యామిలీతో పడదు. దానికితోడు ఫిరాయింపు మంత్రి కూడా నోటికెంత వస్తే అంత మాట్లాడేది. కేఇ, ఫరూఖ్ లాంటి వాళ్ళను కూడా లెక్క చేయలేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒక్క రాయలసీమ అనే కాదు యావత్ రాష్ట్రంలోను పార్టీకి గట్టి దెబ్బే పడింది. ప్రధానంగా రాయలసీమలోనే అని ఎందుకంటే రాయలసీమ వాడయ్యుండి అనేక సందర్భాల్లో చంద్రబాబు ఈ ప్రాంతాన్ని దారుణంగా అవమానించాడు. తునిలో జరిగిన రైలు దహనం, అమరావతిలో పంటలు కాలిపోవటం లాంటి ఏ అంశం తీసుకున్నా రాయలసీమ గుండాలు, పులివెందుల రౌడీలు, పులివెందుల పంచాయితీలంటూ పదే పదే ప్రాంతాన్ని అవమానించటం జనాలకు నచ్చలేదు.

రాయలసీమకు నీళ్ళిచ్చామంటూ చేసుకున్న భూటకపు ప్రచారం కూడా జనాల్లో వ్యతిరేకత పెంచేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండానే అన్నీ చేసేసినట్లు ప్రచారం చేసుకున్నాడు. ఒకవైపు రాయలసీమ కరువు తాండవిస్తున్నా అన్నీ ప్రాంతాలకు తాను నీళ్ళిచ్చేశానని ప్రచారం చేసుకోవటంతో జనాలకు మండిపోయింది. ఇక టిడిపికి బాగా పట్టుండే ఉభయగోదావరి జిల్లాల్లోను ఇదే పరిస్ధితి. ఉభయగోదావరి జిల్లాల్లోని మొత్తం 34 సీట్లలో టిడిపికి దక్కింది ఆరు మాత్రమే. 15 సీట్లున్న పశ్చిమ గోదావరిలో రెండు, 19 సీట్లున్న తూర్పులో నాలుగు సీట్లు మాత్రమే గెలిచింది. చివరకు రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులో కూడా నాలుగు సీట్లే గెలిచింది.

విచిత్రమేమిటంటే రాజధాని అమరావతి ప్రాంతంలోని తాడికొండ నియోజకవర్గంలో కూడా టిడిపి ఓడిపోవటం. అలాగే ఉత్తరాంధ్రలోని 34 సీట్లలో కూడా టిడిపి గెలిచింది ఆరు నియోజకవర్గాల్లో మాత్రమే. మామూలుగా టిడిపికి ఉత్తరాంధ్రలో మంచి పట్టేఉంది. అయినా ఇక్కడ కూడా ఓడిపోయింది. హోలు మొత్తం మీద చూస్తే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో కారణం.

రాయలసీమలోనే కాదు పార్టీ ఎక్కడ ఓడిపోయినా కామన్ పాయింట్ ఒకటే ఉంది. అదేమిటంటే పార్టీని చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేయటం. మంత్రులకు, ఎంఎల్ఏలకు, నేతలకు మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. దాని ఫలితంగానే చంద్రబాబంటే పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయింది. దాని ఫలితంగానే ఎన్నికల ప్రచారంలో కానీ పోలింగ్ రోజు కానీ నేతలు, క్యాడర్ అభ్యర్ధులను పట్టించుకోలేదు. పోలింగ్ రోజు ఉదయం 11 గంటలకే చాలా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల నుండి టిడిపి ఏజెంట్లు బయటకు వెళ్ళిపోయారు. పార్టీని పట్టించుకోకపోతే ఏమి జరుగుతుందనేందుకు చంద్రబాబు వ్యవహారశైలే ఓ ఉదాహరణ.