iDreamPost
android-app
ios-app

ఈటల రాజేందర్‌ వెనుక మోదీ ఉన్నారట..!

ఈటల రాజేందర్‌ వెనుక మోదీ ఉన్నారట..!

ఈటల రాజేందర్‌ తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్థానం సంపాదించుకున్న నేత. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల.. ఆ తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వాలలో మంత్రిగా పని చేశారు. కారణాలేమైనా కేసీఆర్‌తో ఈటలకు చెడింది. అది కాస్త చినికి చినికి గాలి వానలా మారి.. మంత్రి పదవికే ఎసరు తెచ్చింది. అసైన్మెంట్‌ భుములు కొనుగోలు చేశారని, ప్రభుత్వ భూములు ఆక్రమించారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అవగా.. టీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవి ఈటల రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు.

బీజేపీలో చేరిన తర్వాత కూడా కేసీఆర్‌.. ఈటల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారనే భావన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈటల రాజేందర్‌ కుటుంబాన్ని ఏదో రకంగా జైలుకు పంపేందుకు కేసీఆర్‌ కుట్ర పన్నారంటూ కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ఈటల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని చెప్పారు. ఈటలను ఇబ్బంది పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని కేసీఆర్‌ను హెచ్చరించారు కిషన్‌ రెడ్డి.

Also Read : రాళ్లు, చెప్పుల రాజకీయం..!

కిషన్‌ రెడ్డి చెప్పినట్లు.. నిజంగా ఈటల రాజేందర్‌ వెనుక ప్రధాని మోదీ ఉన్నారా..? అనే సందేహం వస్తోంది. ఈటల బీజేపీలో చేరిక సందర్భం.. కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తెలంగాణలో బలమైన నేతగా. బీసీ సామాజిక వర్గంలో మంచి పట్టున్న ఈటల రాజేందర్‌ చేరిక.. అత్యంత సాదాసీదాగా సాగింది. బీజేపీలో చేరేందుకు తన వర్గంతో ప్రత్యేక విమానంలో వెళ్లిన ఈటలకు.. బీజేపీ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నది వాస్తవం. ఏ మాత్రం ప్రజా బలం లేని నేతలకు కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న ప్రధాని మోదీ, అమిత్‌ షాలు.. ఈటల రాజేందర్‌కు కండువా కప్పలేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఈటల రాజేందర్‌ కాషాయ కండువా కప్పుకోవాల్సి వచ్చింది.

ఏపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి నేతలకు ప్రజా బలం ఏ మాత్రం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో వారెప్పుడూ పోటీ చేయలేదు. ఇలాంటి వారికి మోదీ, అమిత్‌ షాలు కండువాలు కప్పారు. తెలంగాణకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణ చేరిక కూడా అమిత్‌ షా సమక్షంలో జరిగింది. కానీ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత, మాజీ మంత్రి అయిన ఈటల చేరిక సమయంలో.. మోదీ గానీ, అమిత్‌ షాగానీ కనిపించలేదు. కనీసం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. ఈటలకు కండువా కప్పలేదు. ఈ పరిణామం ఈటలకు బీజేపీ ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తోంది. ఇలాంటిది ఈటల వెనుక మోదీ ఉన్నారు.. ఆయన్ను ఇబ్బంది పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోబోదంటూ కిషన్‌ రెడ్డి చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత..? అనేది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

Also Read : కేసీఆర్‌ తీరు అంతేనట..! జల వివాదంపై కిషన్‌ రెడ్డి