Idream media
Idream media
ఏపీలో బలపడేందుకు, తన బలం ఏమిటో చూపించేందుకు తిరుపతి ఉప ఎన్నికను బీజేపీ ఒక అవకాశంగా భావిస్తోంది. అందుకే అన్ని పార్టీల కన్నా ముందే తిరుపతి ఉప ఎన్నిక రంగంలోకి దిగింది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. తిరుపతిలో బీజేపీ శోభా యాత్రను కూడా నిర్వహించింది. జనసేన, బీజేపీ.. ఎవరు పోటీ చేస్తారనేది కూడా తేలిపోయింది. బీజేపీయే పోటీ చేసేందుకు ఇరు పార్టీల నేతలు అంగీకారనికొచ్చారు.
అయితే అభ్యర్థి ఎవరు..? బీజేపీ ఎవరిని పోటీలో దింపుతుంది..? అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. ఈ రోజు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల స్వీకరణ కూడా ఈ రోజు నుంచి మొదలైంది. ఈ నెల 30వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఉంది. వైసీపీ తన అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తిని ప్రకటించింది. టీడీపీ తన అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీని అందరి కన్నా ముందుగానే ప్రకటించింది. ఈ నెల 24వ తేదీన పనబాక లక్ష్మీ నామినేషన్ వేస్తారని టీడీపీ నేత, ఉప ఎన్నిక ఇంఛార్జి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రకటించారు.
రెండు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ మాత్రం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు భిన్నమైన సమాధానం చెబుతోంది. ఇరత పార్టీల అభ్యర్థులు కూడా తమ పార్టీ టిక్కెట్ అడుగుతున్నారంటూ బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు విలేకర్ల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 15 మంది నేతలు తమ పార్టీ టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారని చెబుతున్నారు. బలమైన వారి ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఓ పార్టీకి చెందిన అభ్యర్థి సమావేశాలకు కూడా హాజరుకావడం లేదని, ఆ పార్టీ నేతలు బలవంతంగా తీసుకొచ్చి కూర్చొపెట్టాల్సి వస్తోందంటూ.. పరోక్షంగా టీడీపీని ఎద్దేవా చేశారు. పనబాక లక్ష్మీ టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదన్నది సోము వీర్రాజు ఊవాచ. ఇతర పార్టీల నేతలు తమ పార్టీ టిక్కెట్‌ను అడుగుతున్నారంటున్న సోము వీర్రాజు.. వారు ఎవరనేది ఆయన మాటల ద్వారా అంచనా వేయొచ్చా…?
తిరుపతి ఉప ఎన్నికలో ఎవరును బరిలో దించాలనే అంశంపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ ఎన్నిక ఆ పార్టీకి ఎంతో కీలకం కావడంతో ఆచితూచి అడుగుల వేస్తోంది. ఓటు బ్యాంకు పెంచుకోవడం ద్వారా తాను బలపడుతున్నాననే సందేశాన్ని ప్రజల్లోకి పంపాలని బీజేపీ భావిస్తోంది. రెండో స్థానంలో నిలిచినా.. బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరినట్లే. టీడీపీ స్థానంలోకి వస్తామని ఇప్పటికే ప్రకటించిన బీజేపీ నేతలు.. తిరుపతిలో టీడీపీని వెనక్కి నెడితే.. ఏపీలో బీజేపీ పయనం ఉత్సాహంగా సాగుతుంది. అందుకే బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తోంది. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభను బరిలో దించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Also Read : బాధ్యులు రె‘‘ఢీ’’ : తిరుపతి మీదా మాదా సై!