iDreamPost
android-app
ios-app

సహకార బ్యాంకుల్లో మోసాలను ఆర్డినెన్స్ అడ్డుకుంటుందా…?

సహకార బ్యాంకుల్లో మోసాలను ఆర్డినెన్స్ అడ్డుకుంటుందా…?

దేశంలో సహకార బ్యాంకులు వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తాయి. రైతులకు రుణాలు మంజూరు వంటి ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తోంది. గ్రామీణాభివృద్ధికి పట్టుకొమ్మల్లాంటి సహకార బ్యాంకులు సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఆయా బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు పెరగడంతో దివాలా తీసే పరిస్థితి నెలకొంది.
ఇటీవలే దేశంలో బ్యాంకులకు కోట్ల రూపాయలు రుణాలు తీసుకొని వాటిని చెల్లించకుండా ఎగ్గొట్టే ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. ఆర్థిక మోసాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.‌ గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ మొదలుకొని, ఐసిఐసి, ఇటీవలి యస్ బ్యాంక్ వరకు బ్యాంకుల్లో కుంభకోణాలు అన్ని ఇన్ని కాదు.

ఈ నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో మోసాలను మోడీ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అడ్డుకుంటుందా…? అంటే అందుకు ఆర్థిక, బ్యాంకింగ్ రంగ నిపుణులు పెద్దగా ఉపయోగం లేదని చెబుతున్నారు. సహకార బ్యాంకుల విషయంలో మోడీ సర్కార్‌ ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని అంటున్నారు.
బ్యాంకింగ్‌ రంగంపై ప్రజలకు నమ్మకం పోతున్నదనీ, ఖాతాదార్ల సొమ్ముకు భద్రత ఉండటం లేదని వారి వాదన. సహకార బ్యాంకుల్లో ఇటీవల బయటపడుతున్న ఆర్థిక మోసాలు అడ్డుకోవడానికి అనేక విధానాలున్నాయి. వాటిని వదిలేసి సర్వహక్కులూ ఆర్బీఐకి కట్టబెడుతూ ఆర్డినెన్స్‌ ఇస్తే సరిపోదు.

యస్‌ బ్యాంకు, పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంకు ఆర్థిక మోసాలు… మళ్లీ జరగకుండా ఆర్డినెన్స్‌ అడ్డుకుంటుందని భావించలేం. ఆర్బీఐ పర్యవేక్షణ ఉండి కూడా బ్యాంకు మోసాలు ఎందుకు జరుగుతున్నాయి..? బ్యాంకు కుంభకోణాల వెనుకున్న కుట్రదారుల్ని పట్టుకునే యం త్రాంగం, విధానాలు కీల కమని వారు అంటున్నారు.

సహకార బ్యాంకు అయినా, వాణిజ్య బ్యాంకు అయినా.. దేంట్లోనూ ఖాతాదార్ల సొమ్ముకు నేడు భరోసా లేకుండా పోయింది. ఆర్థిక మోసాల కారణంగా 2013-18 మధ్య కాలంలో దేశంలో 127 బ్యాంకులు మూతపడ్డాయి. ఇందులో అత్యధిక బ్యాంకులు…తమ ఖాతాదార్లకు చెల్లింపుల్లో విఫలమయ్యాయి.

”డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌” పథకం కింద 4 లక్షల ఖాతా దార్లకు సొమ్ములు చెల్లించాల్సి వచ్చింది. సహకార బ్యాంకుల కార్యకలాపాలన్నీ గ్రామీణ ప్రాంతాలతో ముడిపడి ఉన్నాయి. ఆ బ్యాంకులు సంక్షోభంలో కూరుకు పోతే, గ్రామాల్లో ఉండే పేదలు, రైతుల ఆర్థిక స్థితిగతులపై తీవ్ర ప్రభావం పడుతుంది.

పంజాబ్‌, మహారాష్ట్ర సహకార బ్యాంకు, యస్‌ బ్యాంకు కుంభకోణాలు, వాటి ఖాతాదార్ల అనుభవాలు ఎంతోమందిని భయపెడుతున్నాయి. సహకార బ్యాంకులపై జూన్‌ 27న మోడీ సర్కార్‌ ఆర్డినెన్స్‌ జారీచేసింది. సహకార బ్యాంకుల పాలన, పర్యవేక్షణ అంతా ఇప్పటివరకూ రాష్ట్రాల పరిధిలో ఉండగా, దానిని తొలగించి…ఆర్బీఐకి అప్పజెప్పారు. తద్వారా జరిగిన ముఖ్యమైన మార్పు, సంక్షోభంలో చిక్కుకున్న సహకార బ్యాంకును ఆర్బీఐ తన ఆధీనంలోకి తీసుకొని వేరే బ్యాంకులతో విలీనం చేస్తుంది. స్టేట్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్స్‌…అధికారం చెల్లదు.

ఈ విధంగా సహకార బ్యాంకుల విషయంలో రాష్ట్రాల కోరలు పీకేసింది. ఆర్బీఐ పెత్తనంతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపయోగమేమీ ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆర్బీఐ పరిధిలో ఉండే అనేక వాణిజ్య బ్యాంకుల్లో మోసాలు జరిగాయి. కాని వాటిని అడ్డుకోవడంలో ఆర్బీఐ విఫలం అయింది. అలాంటప్పుడు సహకార బ్యాంకుల్లో మోసాలకు ఆర్బీఐ ఎలా అడ్డుకట్ట వేయగలదని ప్రశ్నలు‌ వెల్లువెత్తుతున్నాయి.