iDreamPost
android-app
ios-app

ముద్రగడ వెనక్కి తగ్గుతారా..?

ముద్రగడ వెనక్కి తగ్గుతారా..?

కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.. ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఈ విషయంపై ఆయనే స్వయంగా రాతపూర్వంగా ప్రకటన చేశారు. ఉద్యమం నుంచి ఎందుకు తప్పుకుంటున్నది ఆ లేఖలో వివరించారు. మాట అంటే పడని ముద్రగడను.. కొంత మంది కాపు నేతలు టీవీ ఛానెళ్లలో దూషించడం, హేళనగా మాట్లాడడం ఆయన్ను బాధించింది. అందుకే ఉద్యమం నుంచి తప్పుకున్నారు. ఇకపై ఈ ఉద్యమాన్ని ఎవరు చేపట్టినా వారికి మద్ధతు ఇస్తానని తెలిపారు.

అయితే ముద్రగడ పద్మనాభమే.. తమ నాయకుడని ఏపీ కాపు జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయన నాయకత్వంలోనే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన నేతృత్వంలో పని చేయాలని వారందరూ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరిగి ఆయన్ను ఉద్యమం బాధ్యతలు చేపట్టేలా ఒప్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నిన్న ఆదివారం ద్వారకా తిరుమలలో సమావేశమైన 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు.. ఈ విషయంపై చర్చించారు. ఈ రోజు ముద్రగడను ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో కలవనున్నారు. మీరే మా నాయకుడుగా ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చనున్నారు.

ముద్రగడ పద్మనాభం ముక్కుసూటి మనిషి. పట్టింపులు గల నేత. ఏదైన ఒక అంశంపై నిర్ణయం తీసుకుంటే.. అందుకు కట్టుబడతారు. ఆయన వ్యవహార శైలి గురించి సన్నిహితులకు, ఆయన గురించి బాగా తెలిసిన వారికే ఎరుక. కొంచెం కోపం కూడా ఎక్కువే. మరి ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న ముద్రగడ పద్మనాభం.. కాపు జేఏసీ నేతల వినతిని సమ్మతిస్తారా..? అంటే సందేహమే. ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నెలల తిరగకముందే మళ్లీ ఉద్యమ సార«థ్య బాధ్యతలు ఆయన చేపట్టడం అనుమానమే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కాపు రిజర్వేషన్ల ఉద్యమం నడిపేందుకు ఏపీలో సానుకూల పరిస్థితులు లేవు. అధికారంలో ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. కాపు రిజర్వేషన్లపై తన వైఖరి ఏమిటో 2019 ఎన్నికల ప్రచారంలోనే స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో రిజర్వేషన్లు తమ పరిధిలోనివి కావని, కేంద్రం పరిధిలోనివంటూ చెప్పిన సీఎం జగన్‌… కాపుల సంక్షేమ కోసం ప్రతి ఏటా 2 వేల కోట్ల చొప్పన 10 వేల కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. సీఎం జగన్‌.. ఇంత స్పష్టంగా చెప్పాక కూడా కాపు ఉద్యమ నేతలు రిజర్వేషన్లు ఇవ్వాలని ఎవరిని..? ఎలా..? డిమాండ్‌ చేయగలరనేదే ప్రశ్న.

2014లో ఎన్నికల్లో కాపులు అడగకపోయినా.. రిజర్వేషన్లు ఇస్తానని బాబు చెప్పారు. ఆ హామీని అమలు చేయాలని ముద్రగడ పద్మనాభం డిమాండ్‌ చేస్తూ ఉద్యమం నడిపారు. అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. రిజర్వేషన్లపై సీఎం జగన్‌ను గిల్లేందుకు కూడా పవన్‌ కల్యాణ్‌ లాంటి నేతలు, ఓ వర్గం మీడియా ప్రయత్నాలు చేసింది. కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్‌ తన వైఖరిని మరో మారు చెప్పాలని మాట్లాడారు, రాశారు. ఎన్నికల్లో చెప్పిన విషయమే సీఎం జగన్‌ చెబుతారు కాబట్టి.. ఆ మాటలను పట్టుకుని కాపులను రెచ్చగొట్టేందుకు వేసిన ప్లాన్‌ ఫెయిల్‌ అయింది.