రాజధాని పై స్థానికపోరే రెఫరెండం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతోంది. స్వల్ప కాలంలోనే జగన్‌ సర్కార్‌ సంచలనమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసింది. జగన్‌ తీసుకున్న నిర్ణయాల్లో అతి ప్రధానమైనది మూడు రాజధానులు. అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధికి మూడు రాజధానులను ప్రతిపాదిస్తున్నామని జగన్‌ సర్కార్‌ వెల్లడించింది.

అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీ తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. అమరావతి రాజధానిలోని కొన్ని గ్రామాల రైతులు 79 రోజులుగా నిరసనలు చేస్తున్నారు. మూడు రాజధానులపై రెఫరెండం నిర్వహించాలని, ప్రజలు మూడు రాజధానుల కావాలంటే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మాజీ సీఎం చంద్రబాబు సవాల్‌ చేశారు. రెఫరెండం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు మూడు రాజధానులను కోరుకోవడంలేదన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి వైఎస్సార్‌సీపీ గెలిస్తే.. అప్పుడు మూడు రాజధానులు పెట్టుకోవాలన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. ఇది ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పోరుకు తెరలేవబోతోంది. రేపో, ఎళ్లుండో నోటిఫికేషన్‌ రాబోతోంది. ఈ నెలాఖరు లోపు మండల, జిల్లా, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలు పూర్తవుతాయి. సాధారణ ఎన్నికలు ముగిసిన 9 నెలలకే మరోమారు రాష్ట్ర ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయబోతున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కోరుకున్నట్లు ప్రభుత్వం రెఫరెండం పెట్టకపోయినా.. స్థానిక ఎన్నికల రూపంలో ఆ అవకాశం వచ్చింది.

ప్రతిపక్ష టీడీపీ మూడు రాజధానులను రెఫరెండంగా తీసుకుని స్థానిక ఎన్నికలకు వెళితే రాష్ట్ర ప్రజలు ఏ వైపు ఉన్నారో తెలిసిపోతుంది. మూడు రాజధానులు కావాలనుకుంటున్నారా..? లేదా అమరావతి ఒక్కటే రాజధానిగా కొనసాగాలనుకుంటున్నారా..? అనే విషయం స్థానిక ఫలితాల ఆధారంగా తీసుకుంటే రాజధాని అంశానికి అంతటితో ఫుల్‌స్టాఫ్‌ పెట్టుచ్చు. వైఎస్సార్‌సీపీ కూడా మూడు రాజధానులపై స్థానిక సంస్థల ఎన్నికలే రెఫరెండంగా తీసుకుంటున్నామని వెళితే వారి నిర్ణయం సరైనదేనని సమాజానికి చాటి చెప్పవచ్చు. ఆ తర్వాత మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్న వారి నోటికి తాళం వేయొచ్చు. రెండు పార్టీలు రెఫరెండంగా తీసుకుంటే.. దాదాపు మూడు నెలలుగా సాగుతున్న రాజధాని వివాదానికి రోజుల వ్యవధిలో పరిష్కారం చూపవచ్చు. ఆ తర్వాత ఎవరి రాజకీయాలు వారు చేసుకోవచ్చు. మరి ఈ దిశగా రెండు పార్టీలు ఆలోచిస్తాయా..? వేచి చూడాలి.

Show comments