iDreamPost
android-app
ios-app

హుజూరాబాద్ పై కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయా?

హుజూరాబాద్ పై కేసీఆర్ కు అనుమానాలు ఉన్నాయా?

ప్ర‌త్య‌ర్థుల‌ను కంగారు పెట్టించ‌డ‌మే కానీ.. తాను క‌ల‌వ‌ర‌ప‌డ‌డం క‌ల‌లో కూడా తెలియ‌ని కేసీఆర్.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో క‌ల‌త చెందుతున్నారా? రెండు ప‌ర్యాయాలు కూడా బంప‌ర్ మెజార్టీతో పార్టీని అధికారంలోకి తెచ్చిన ఆయ‌న‌కు ఉప ఎన్నిక కంటిమీద నిద్ర లేకుండా చేస్తోందా? ఇప్పుడు ఇటువంటే ప్ర‌శ్న‌లే.. ఆ త‌ర‌హా చ‌ర్చ‌లే తెలంగాణ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా సాగుతున్నాయి. ఆ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి వెనువెంట‌నే తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ఒక‌దాని త‌ర్వాత మ‌రొక‌టి వెలువ‌డుతున్న ప్ర‌క‌ట‌న‌లు ఇందుకు కార‌ణంగా నిలుస్తున్నాయి. ఉప ఎన్నిక గెలుపుపై ఆయ‌న‌కు అనుమానాలు ఉండ‌డంతోనే ఇదంతా చేస్తున్నార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎప్పుడైతే ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామా చేసి బీజేపీలో చేరారో, ఉప పోరు త‌ప్ప‌ద‌ని తేలిందో అప్ప‌టి నుంచీ.. పెండింగ్ లో ఉన్న సంక్షేమ పథకాలు మంజూరై పోతున్నాయి. అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదలైపోయి పనులు మొదలైపోయాయి. ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవిని బండ శ్రీనివాసరావును నియమించారు. టీఆర్ఎస్ అభ్యర్దిగా గెల్లు శ్రీనివాసయాదవ్ ను ఎంపిక చేశారు. ఇక కాంగ్రెస్ లో నుండి వచ్చి టీఆర్ఎస్ లో చేరిన పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే ఎంఎల్సీగా ప్రతిపాదించారు. ఇవన్నీ సరిపోవన్నట్లు దళిత బంధు పథకాన్ని ప్రకటించి నియోజకవర్గంలో లబ్ధిదారుల కోసం ఇప్పటికే సుమారు రు. 1200 కోట్లు విడుదల చేశారు. ఇది కూడా సరిపోదన్నట్లుగా నియోజకవర్గానికి చెందిన బీసీ నేత వకుళాభరణం కృష్ణమోహన్ రావును బీసీ కమిషన్ చైర్మన్ గా నియమించారు.

ఈ నిర్ణ‌యాలు, చ‌ర్య‌ల కార‌ణంగా గడచిన ఏడేళ్ళలో ఎప్పుడూ లేనట్లుగా ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గం మీదే కేసీఆర్ ఎందుకింతగా దృష్టి పెట్టారు ? ఎందుకంటే ఉపఎన్నికల్లో విజయం మీద బహుశా గ్యారెంటీ లేదేమో అని జనాల్లో చర్చ పెరిగిపోతోంది. నియోజకవర్గం మీద కేసీయార్ దృష్టిపెట్టిన కొద్దీ జనాల్లో పార్టీ గెలుపుపై నెగిటవ్ చర్చ పెరిగిపోతోందట. ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతోనే నియోజకవర్గానికి మహర్దశ వచ్చినట్లయ్యిందని జనాలు చర్చించుకుంటున్నారు. ఈటల గనుక ఎంఎల్ఏగా రాజీనామా చేయకుంటే నియోజకవర్గాన్ని కేసీఆర్ అసలు పట్టించుకునేవారేనా ? అనే డౌటు అందరిలోను పెరిగిపోతోంది. ప్ర‌జ‌ల‌కు ఇంత మేలు చేస్తున్నా.. మ‌రో ర‌కంగా నెగెటివ్ చ‌ర్చ కూడా జ‌రుగుతుండ‌డం గులాబీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది.