iDreamPost
android-app
ios-app

ఒకవైపు టీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ.. జానా ఎటువైపు..?

ఒకవైపు టీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ.. జానా ఎటువైపు..?

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ దృష్టి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి మీద పడింది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అంచనాలకు మించి సీట్లు సాధించిన ఉత్సాహంలో ఉన్న కమలం పార్టీకి నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక ఊరిస్తోంది. అదే సమయంలో మరో సిటింగ్‌ స్థానం జారిపోకుండా కాపాడుకోవాలని టీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో జానారెడ్డిని తమ పార్టీలోకి రమ్మంటూ టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు జానారెడ్డి స్టేచర్‌తో సాగర్‌ ఉపఎన్నికల్లో గెలిచి ప్రత్యామ్నాయ హోదాను నిలబెట్టుకుందామనుకుంటున్న కాంగ్రెస్‌కు ఈ ప్రచారం ఆందోళన కలిగిస్తోంది.

వరుసగా రెండు సార్లు విజయం..

2009లో నాగార్జున సాగర్‌ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత స్థానికంగా తనకు ఉన్న పట్టు, కింద స్థాయి నేతలతో ఉన్న సంబంధాలతో ఆ స్థానం నుంచి జానారెడ్డి వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో స్వల్ప తేడాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య చేతిలో ఓడిపోయారు. అయినా ఆ నియోజకవర్గ పార్టీ నేతలు, అనుచరులు, కార్యకర్తలతో ఆయన సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలకు నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కీలకంగా మారింది. దీంతో స్థానికంగా పట్టున్న జానారెడ్డి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మార్పునకు కేంద్ర బిందువుగా మారారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయాలు సాధించినా స్థానిక పరిస్థితుల కారణంగానే దక్కాయన్న ప్రచారం ఉంది. దుబ్బాకలో ఆ పార్టీ అభ్యర్థి పట్ల సానుభూతి వల్ల బీజేపీ గెలిచిందని, జీహెచ్‌ఎంసీలో మొదటి నుంచీ పార్టీకి ఉన్న ఓటుబ్యాంకుకు తోడు భావోద్వేగ ప్రచారం కారణంగా అన్ని సీట్లు వచ్చాయని పార్టీయేతర వర్గాలు విశ్లేషిస్తున్నారు.

బీజేపీ లేకుంటే టీఆర్‌ఎస్‌..?

బీజేపీ ఆలోచన వేరుగా ఉంది. పార్టీకి ఏ మాత్రం పట్టులేని నాగార్జున సాగర్‌లో కాషాయ జెండా ఎగరేస్తే, గ్రామీణ నియోజకవర్గాల్లోనూ 2023 ఎన్నికల నాటికి ప్రత్యామ్నాయ పార్టీగా మారొచ్చునని కమలనాథులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డికి బీజేపీ ముఖ్యులు వలవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటమిపాలు కావడం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భారీగా సీట్లు తగ్గిన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ వేగంగా పడిపోతుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో గెలిచి సిట్టింగ్‌ సీటును కాపాడుకోవడం ఆ పార్టీకి కీలకంగా మారింది. స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, జానారెడ్డికి ఉన్న పట్టు టీఆర్‌ఎస్‌ ఆందోళన కలిగిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో జానారెడ్డినే టీఆర్‌ఎస్‌లోకి లాగేసుకోవాలన్న ఆలోచనను ఆ పార్టీ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌ ముఖ్యులు ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ, లేకుంటే టీఆర్‌ఎస్‌లోకి జానారెడ్డి వెళ్లనునున్నట్లుగా ప్రచారం తీవ్రం కావడంతో కాంగ్రెస్‌ పార్టీ అప్రమత్తమైంది. కేరళ నుంచి తిరిగి వచ్చిన జానారెడ్డిని బుధవారం సాయంత్రం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలిశారు. పార్టీ మారుతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో గందరగోళం లేకుండా వివరణ ఇవ్వాల్సిందిగా జానారెడ్డిని ఉత్తమ్‌ కోరినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే జానారెడ్డి పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలను ఆయన కొడుకు రఘువీర్‌రెడ్డి మీడియా ముఖంగా ఇప్పటికే ఖండించారు. మొత్తంగా జరుగుతున్న ప్రచారంపైన జానారెడ్డి ఒక ప్రకటన చేస్తే కానీ ఈ వ్యవహారంపైన స్పష్టత వస్తుందని చెబుతున్నారు.

అది ప్రచారం మాత్రమే : జానా

పార్టీ మార్పునకు సంబంధించి తనను ఏ రాజకీయ పార్టీ కూడా సంప్రదించలేదని, అది మీడియా ప్రచారం మాత్రమేనని జానారెడ్డి అన్నారు. తన స్థాయి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం తగదన్నారు. గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వెల్లడించారు. నాగార్జున సాగర్‌లో ఎవరు పోటీ చేయాలన్నది పార్టీనే నిర్ణయిస్తుందని చెప్పారు. తనపై ఎందుకిలా ప్రచారం జరుగుతుందో తెలియడం లేదంటూనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేమన్నారు.