iDreamPost
iDreamPost
ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిన్న కాంగ్రెస్ ఈ ఏడాది చివరిలో జరగనున్న హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. సుమారు రెండున్నర దశాబ్దాలుగా దూరమైన అధికారాన్ని చేజిక్కించుకోవాలని తపిస్తోంది.
అయితే పార్టీ ముఖ్యనేతలను కాపాడుకోలేకపోవడం కాంగ్రెసుకు శాపంగా పరిణమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాంధీ కుటుంబానికి సన్నిహితుడు, ఒకప్పుడు జాతీయ కాంగ్రెసులో కీలక పాత్ర పోషించిన దివంగత అహ్మద్ పటేల్ తనయుడు ఫైజల్ పటేల్ పార్టీ నాయకత్వం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన దారి తాను చూసుకునే పరిస్థితిని పార్టీ నాయకత్వమే కల్పిస్తోందని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇప్పుడు అదే దారిలో ప్రముఖ పాటీదార్ ఉద్యమ నేత, గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హార్దిక్ పటేల్ పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్టీ రాష్ట్ర నాయకులు, అధిష్టానం తనను చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) హార్దిక్ పటేల్ ను తమ పార్టీలోకి ఆహ్వానించడంతో పటేల్ త్వరలో కాంగ్రెసును వీడతారన్న ప్రచారం జరుగుతోంది.
కష్ట సమయంలో కాంగ్రెసుకు అండగా
గుజరాత్ లో గణనీయ ఓటు బ్యాంకు కలిగి.. పార్టీల విజయావకాశాలను ప్రభావితం చేయగల పాటీదార్ సామాజికవర్గానికి చెందిన యువనేత హార్దిక్ పటేల్.. రిజర్వేషన్ల కోసం 2015, 2016 సంవత్సరాల్లో జరిగిన పాటీదార్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడం ద్వారా వెలుగులోకి వచ్చారు. గుజరాత్లో బీజేపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలో హార్దిక్ ను పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజనం పొందింది. 182 అసెంబ్లీ సీట్లున్న గుజరాత్ లో ఆనాటి ఎన్నికల్లో కాంగ్రెస్ 77 సీట్లు గెలుపొందడం వెనుక హార్దిక్ కృషి చాలా ఉంది. తర్వాత 2020లో పార్టీ అధిష్టానం హార్దిక్ పటేల్ ను గుజరాత్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించింది. అయితే ఆ తర్వాత నుంచి పార్టీ తనను పట్టించుకోకుండా చిన్నచూపు చూస్తోందని హార్దిక్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరో నేతపై కాంగ్రెస్ మోజే అసంతృప్తికి కారణం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు బ్యాంకును పటిష్టం చేసుకునే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం మరో పాటీదార్ నేతపై దృష్టి సారించింది. పాటీదార్ సామాజికవర్గ కులదేవత ఆలయానికి చెందిన ఖోడల్డమ్ ట్రస్ట్ చైర్మన్, లెవా పాటీదార్ నేత నరేష్ పటేల్ ను పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మంతనాలు జరుపుతోంది. ఇదే హార్దిక్ పటేల్ అసంతృప్తికి ప్రధాన కారణం. దీన్ని ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. తాను ఉండగా మరో పాటీదార్ నేత కోసం తాపత్రయం ఎందుకని ప్రశ్నించారు.