Idream media
Idream media
నిజం నిలకడమీద తెలుస్తుందనేది ఓ నానుడి. టీఆర్‌ఎస్ మాజీ, బీజేపీ తాజా నేత ఈటల రాజేందర్ వ్యవహారానికి ఈ నానుడికి అతికినట్లు సరిపోతోంది. టీఆర్‌ఎస్ ఉద్యమంలోనూ, ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరించిన ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. తాను కబ్జాలకు పాల్పడలేదని, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని ఈటల డిమాండ్ చేశారు. నిబంధనలను పాటించకుండా ఈటల భూములపై అధికారులు చేసిన సర్వేను తెలంగాణ హైకోర్టు తప్పుబట్టింది. నిబంధనల ప్రకారం సర్వే చేయాలని ఆదేశించడం ఈటల తప్పు చేయలేదనే భావన తెలంగాణ సమాజంలో ఏర్పడింది.
ఈటలను కావాలనే తప్పించారని ఆయన అనుచరులు, భూ కబ్జాలకు పాల్పడడంతోనే పదవి కోల్పోయారని టీఆర్‌ఎస్ మంత్రులు, నాయకులు వాదించారు. అయితే నిజాలు నిలకడమీద తెలుస్తాయన్న మాదిరిగా.. ఈటలకు ఎసరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో.. మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సీఎం కేసీఆర్.. ఈటల రాజేందర్‌ను తమ్మి అని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంటే సీఎం కుర్చికే ఎసరు పెట్టారంటూ మంత్రి గంగుల కమలాకర్ ఈటల పై ఫైర్ అయ్యారు. సీఎం పీఠంపై ఈటల కన్ను పడడంతోనే ఈటలను సాగనంపారని మంత్రి బహిరంగంగా చెప్పడంతో ఆది నుంచి ఈటల మద్ధతుదారులు చేసిన వాదన నిజమైంది.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తోపాటు అనేక మంది నడిచారు. కాలగమన ంలో వారందరూ దూరమయ్యారు. ఆలె నరేంద్ర, ప్రొఫెషర్ కోదండరాం లాంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. తాజాగా ఈటల రాజేందర్ కూడా ఇందులో చేరారు. గత ఏడాది టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెనుమార్పులు ఉంటాయనే చర్చలు నడిచాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని, ముఖ్యమంత్రి బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగిస్తారనే చర్చ జోరుగా సాగింది. సీఎం పదవికి కేటీఆర్ అర్హుడని, ఆయన పదవి చేపట్టాలనే డిమాండ్లను కొందరు మంత్రులు, టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు వినిపించారు. ఆ ప్రతిపాదనను ఈటల రాజేందర్ పరోక్షంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఈటలకు టీఆర్‌ఎస్ అధిష్టానానికి గ్యాప్ మొదలైందనేది రాజకీయవర్గాల్లో నడుస్తున్న టాక్. కేటీఆర్ నాయకత్వాన్ని వ్యతిరేకించడంతోనే ఈటలను సాగనంపారనేది మంత్రి గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
Also Read : కాషాయ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్