iDreamPost
android-app
ios-app

రాజీనామా ఈట‌ల‌కు ఇష్టం లేదా..?

రాజీనామా ఈట‌ల‌కు ఇష్టం లేదా..?

మంత్రి ప‌ద‌వి నుంచి సీఎం కేసీఆర్ భ‌ర్త‌ర‌ఫ్ చేసిన వెంట‌నే ఈట‌ల రాజేంద‌ర్ మీడియా స‌మావేశం పెట్టి ఆవేశంగా మాట్లాడారు. ఇన్నాళ్లూ త‌మ్ముడున్న తాను, ఇప్పుడు కానివాడిని అయ్యానా.. అని ప్ర‌శ్నించారు. అన్యాయంగా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, నేనే పార్టీకి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే, కారు గుర్తుతో గెలిచారు క‌దా.. మ‌రి ఎమ్మెల్యే ప‌ద‌విలో ఎలా కొన‌సాగుతారు అని అనుకుంటారు క‌దా అంటూ దానికి కూడా వివర‌ణ ఇచ్చారు. హుజూరాబాద్ ప్ర‌జ‌లు, కార్య‌క‌ర్త‌లు, మిత్రుల‌తో మాట్లాడి రెండు గంట్లోనే ఎమ్మెల్యే ప‌ద‌విపై నిర్ణ‌యం తీసుకుంటాన‌న్న ఆయ‌న రోజులు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ దానిపై ఎటువంటి నిర్ణ‌య‌మూ తీసుకోలేదు. తాజాగా ఓ వెబ్ చాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టారు.

ప్ర‌స్తుతం ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌డం లేద‌ని చెప్పారు.

మంత్రివర్గం నుంచి భ‌ర్త‌ర‌ప్ అయిన అనంత‌రం ఎమ్మెల్యే ప‌ద‌విపై త్వ‌ర‌లోనే ఓ నిర్ణ‌యం తీసుకుంటాన‌ని ఈట‌ల చెప్ప‌డం, వరుసగా తన మద్దతుదారులతో భేటీలు నిర్వహించటంతో ఆయ‌న ఆ పదవికి కూడా రాజీనామా చేసేయబోతున్నట్లు జోరుగా ప్ర‌చారం సాగింది. ఎంఎల్ఏ రాజీనామాతో తొందరలోనే హుజూరాబాద్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు వస్తాయనే అందరు అనుకున్నారు. కానీ, ప్ర‌స్తుతం ఆ విష‌యంలో ఈట‌ల వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ సమస్య తీవ్రత తగ్గిన తర్వాతే తన రాజీనామా గురించి ఆలోచిస్తానని తాజాగా ప్రకటించారు. నిజానికి కరోనా వైరస్ తీవ్రతకు రాజేందర్ రాజీనామాకు ఎలాంటి లింక్ లేక‌పోయిన‌ప్ప‌టికీ ఆయ‌న అలా చెప్ప‌డంపై విభిన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజీనామా చేయటం రాజేంద‌ర్ కు ఇష్టంలేదనే చర్చ మొదలైపోయింది.

తాను ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తే మ‌ళ్లీ ఉప ఎన్నిక పెట్టాల్సి వ‌స్తుంద‌ని, క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అది స‌రికాద‌నే త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసుకున్నాన‌ని ఈట‌ల అంటున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హించిన ఎన్నిక‌ల‌పై న్యాయ‌స్థానం కూడా విచారం వ్య‌క్తం చేసింద‌న్న విష‌యాన్ని లేవ‌నెత్తారు. కరోనా వైరస్ సమస్య తర్వాతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. కరోనా వైరస్ కు ఈటల రాజీనామాకు సంబంధం ఏంట‌నే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. ఈటల ఇప్పటికిప్పుడు రాజీనామా చేసినా క్షేత్రస్ధాయిలోని పరిస్ధితుల కారణంగా అర్జంటుగా కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక పెట్టే అవకాశం లేదు. కరోనా వైరస్ సమస్య తగ్గిన తర్వాత మాత్రమే ఉపఎన్నిక జరుపుతుంది. కడప జిల్లా బద్వేలు అసెంబ్లీకి జరపాల్సిన ఉపఎన్నిక విషయంలో కూడా ఎన్నికల కమీషన్ ఇదే నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఈటల రాజీనామా చేసినా వెంటనే ఉపఎన్నిక జరిగే అవకాశం లేదన్న విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ప‌లువురు గుర్తు చేస్తున్నారు.

ఈట‌ల కూడా ఈ స‌మీక‌ర‌ణాల కార‌ణంగానే రాజీనామా విష‌యాన్ని వాయిదా వేసుకున్నార‌న్న అభిప్రాయాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న రాజీనామా చేస్తే ఉప ఎన్నిక పెట్టే అవ‌కాశం ఉండ‌దు. నెల‌ల త‌ర‌బ‌డి జాప్యం జ‌రుగుతుంది. దీనికి తోడు ఇప్పుడంతా క‌రోనా క‌ల్లోల‌మే. ఈ ప‌రిస్థితుల్లో రాజీనామా చేసినా ఎన్నిక‌లు జ‌రిగే లోపు ఆ వేడి చ‌ల్లారిపోతుంద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు ఈట‌ల వ‌ద్ద వ్య‌క్త‌ప‌రిచార‌ట‌. అదే జ‌రిగితే న‌ష్ట‌మే త‌ప్పా, లాభం ఉండ‌ద‌ని చెప్పార‌ట‌. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, క‌రోనా వైర‌స్ కు ముడి పెట్టార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కూ వాస్త‌వ‌మో, మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.