Idream media
Idream media
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవికి ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. అయితే కొత్త అధ్యక్షుడుగా ఎవరు రాబోతున్నారు..? అధిష్టానం ఎవరిని ఎంపిక చేయబోతోంది..? వచ్చే నేత కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టగలడా..? అతనికి పార్టీలోని సీనియర్ నేతలు సహకరిస్తారా..? లాంటి అనేక సందేహాలు ఆ పార్టీ కార్యకర్తల్లో నెలకొన్నాయి.
టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ పదవిపై ఆయా నేతలు ఆసక్తిగా ఉన్నారనే టాక్ కూడా నడిచింది. ఈ నేపథ్యంలో పీసీపీ పదవి ఎవరికి వరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితిని మార్చి, తిరిగి పార్టీని గాడిలో పెట్టడం కత్తిమీద సాములాంటిదే. వలసలు, తలోదారిన నడిచే నేతలు, సీనియర్, జూనియర్ నేతల మధ్య సఖ్యత, గ్రూపుల ఆధిపత్యం.. ఇవన్నీ కొత్త అధ్యక్షుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సవాళ్లను ఎదుర్కొని పార్టీని సమర్థవంతంగా నడిపించాలంటే.. కొత్త అధ్యక్షుడుకి పార్టీ నేతలందరూ మద్ధతు తెలపాల్సి ఉంటుంది. పార్టీ నేతల మద్ధతు కావాలంటే.. అధ్యక్షుడి ఎంపికలో వారి పాత్ర కూడా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. సీల్ట్ కవర్‌లో కొత్త అధ్యక్షుడి పేరు వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం ఉన్న స్థితిలో మార్పులేకపోగా.. మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదనే వ్యాఖ్యలు ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
టీపీసీసీకి నూతన అధ్యక్షుడి ఎంపికకు ముందు.. పార్టీ నేతల అభిప్రాయం తీసుకోవడం లేదా.. అందరితో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలనే డిమాండ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్‌నేత జగ్గారెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. కొత్త అధ్యక్షుడి ఎంపికలో అందరి అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు బలపరుస్తున్నారు. అధ్యక్షుడి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ నేతలతో చర్చిస్తుందా..? లేక సీల్ట్ కవర్‌లోనే పేరును పంపిస్తుందా..? అనేది వేచి చూడాలి.
వైఎస్సార్ మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పరిస్థితి చుక్కానిలేని నావమాదిరిగా తయారైంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా… తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. అయితే తెలంగాణలోనూ పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకుడు లేకపోవడంతో అక్కడ కూడా పరిస్థితి చేజారింది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పోరాడినా ఫలితం లేకపోయింది. కొత్త సారధి కాంగ్రెస్ బండిని సజావుగా నడపాలంటే.. నేతల మద్ధతు తప్పనిసరి.