Idream media
Idream media
ఓ వైపు కరోనా బుస కొడుతున్నప్పటికీ భయపడుతూ కూర్చుంటే రాష్ట్ర పాలన పడకేస్తుందని భావించిన ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలను గురువారం ఒక్కరోజే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి వీలు పడకపోవడంతో మూడు నెలలు (ఏప్రిల్ నుంచి జూన్) ఓటాన్ అకౌంట్‌కు ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే.
అయితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో గురువారం సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు ఉభయసభల సభ్యులనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ రాజ్‌భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించనున్నారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఉభయ సభలు ఆమోదం తెలుపుతాయి. అనంతరం 2021–22 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీకి సమర్పిస్తారు. అయితే, ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కరోనా ఉన్న సమయంలో అసెంబ్లీ సమావేశాల్ని ఎలా నిర్వహిస్తారు? యాక్టివ్ కేసులు పెద్ద ఎత్తున ఉన్న వేళలో సభను నిర్వహించటం సరికాదని పేర్కొంటోంది. ఒకరోజులో సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్లు విపక్షం స్పందించాల్సి ఉన్నప్పటికీ.. సమావేశాల్ని తాము బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. దీని వెనుక అసలు కారణం వేరే ఉందన్న అభిప్రయాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా మొదటి దశలో చంద్రబాబునాయుడు హైదరాబాద్ కే పరిమితం అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన హైదరాబాద్ నుంచి బయటకు రావటానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకవేళ రాకుంటే ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు తప్పవు. అందుకే.. అసెంబ్లీ సమావేశాల్ని తమ పార్టీబహిష్కరిస్తుందన్న మాటతో హైదరాబాద్ నుంచి బయటకు రాకుండా ఉండటమే బాబు ఆలోచనగా చెబుతున్నారు. మరీ.. విమర్శకు బాబు అండ్ కో ఏమని బదులిస్తారో చూడాలి.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు మాత్రం ఆడలేక మద్దెల ఓడ అన్నట్లు ఉన్నాయి. మార్చిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌ను ఆమోదించడం ఆనవాయితీగా వస్తోందని, కేంద్రం కూడా ఇలాగే చేసిందని ఆయన చెప్పారు. ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఒక రోజు సమావేశం నిర్వహించి అన్ని తూతూ మంత్రంగా చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఆ ఒక్కరోజు కూడా వచ్చి సమావేశాల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేని టీడీపీ జగన్ ను మాత్రం విమర్శిస్తోంది. త్వరలో జూమ్ ద్వారా మాక్ అసెంబ్లీ నిర్వహించి ప్రభుత్వ తప్పులను ప్రజలకు తెలియజేస్తారంట.