iDreamPost
android-app
ios-app

YCP MP Reddappa Challenge – ఎంపీ రెడ్డప్ప సవాల్‌.. అద్భుతమైన అవకాశం.. బాబు అందిపుచ్చుకుంటారా..?

YCP MP Reddappa Challenge – ఎంపీ రెడ్డప్ప సవాల్‌.. అద్భుతమైన అవకాశం.. బాబు అందిపుచ్చుకుంటారా..?

కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మరోమారు మాటల యుద్ధానికి వేదికవుతోంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కావడంతో కుప్పం మున్సిపల్‌ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో మాదిరిగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీడీపీని మట్టికరిపించాలని వైసీపీ, పట్టుజారకుండా చూసుకోవాలని టీడీపీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి.

పార్టీల గుర్తులపై జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ఓడిపోతే.. టీడీపీ మనుగడకు, ఆ పార్టీలో చంద్రబాబు నాయకత్వానికి పెనుసవాళ్లు ఎదురవుతాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లో చంద్రబాబును కుప్పంలో ఓడిస్తామని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. ఈ దిశగా పంచాయతీ, పరిషత్‌ ఎన్నికల్లో వైసీపీ కదిపిన పావులు.. విజయవంతం అయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల కోసం చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు. నోటిఫికేషన్‌ వస్తుందనే సమాచారంతో.. గత నెలాఖరులో కుప్పంలో రెండు రోజులు పర్యటించారు. 25 వార్డుల్లోనూ అర్థరాత్రి వరకు తిరిగారు.

Also Read : Sujana Chowdary – ఆ ఎంపీ అజ్ఞాతవాసం ఎందుకు చేస్తున్నారు..?

అయినా గెలుపుపై చంద్రబాబుకు ఎక్కడో తేడా కొడుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలం, వ్యూహాలపై అవగాహన ఉన్న చంద్రబాబు దూకుడు పెంచారు. పెద్దిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికలకు ప్రత్యేక అధికారిగా.. పెద్దిరెడ్డి సన్నిహితుడును నియమించారంటూ ఆరోపణలు చేశారు. అనైతిక రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు, చరిత్రహీనులుగా నిరూపిస్తామని ఫైర్‌ అయ్యారు. పెద్దిరెడ్డికి పుట్టగతులు లేకుండా చేస్తానని హెచ్చరించారు. వదిలిపెట్టనని హూంకరించారు చంద్రబాబు.

ఈ తరహాలో పెద్దిరెడ్డిపై ఫైర్‌ అయిన చంద్రబాబుకు మంచి అవకాశం వచ్చింది. కుప్పం నుంచి పెద్దిరెడ్డితోపాటు నియోజకవర్గానికి బయట నుంచి వచ్చే వైసీపీ నేతలను శాశ్వతంగా రానీయకుండా చేసే అవకాశం వైసీపీనే కల్పించింది. వైసీపీ ఎంపీ రెడ్డప్ప ఈ రోజు చంద్రబాబుకు ఓ సవాల్‌ విసిరారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో ఓడిపోతే.. తాము నియోజవర్గం నుంచి వెళ్లిపోతామని, అదే టీడీపీ ఓడిపోతే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు వెళ్లిపోతారా..? అంటూ సవాల్‌ చేశారు.

ఈ సవాల్‌ చంద్రబాబు ఓ మంచి అవకాశంగా లభించింది. సవాల్‌ను స్వీకరించి.. టీడీపీని గెలిపిస్తే.. చాలు పెద్దిరెడ్డిని నియోజకవర్గం వైపు రానీయకుండా చేయొచ్చు. వచ్చే ఎన్నికలకు కుప్పంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటిలాగే రాష్ట్ర రాజకీయాలపై పూర్తిగా దృష్టిపెట్టవచ్చు. మునుపటిలా కుప్పంలో నామినేషన్‌ వేసేందుకు కూడా చంద్రబాబు రావాల్సిన అవసరం ఉండదు. మరి రెడ్డప్ప సవాల్‌ను స్వీకరించి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పుట్టగతులు లేకుండా చేసే పనిని చంద్రబాబు కుప్పం నుంచే ప్రారంభిస్తారా..? రెడ్డప్ప సవాల్‌పై చంద్రబాబు స్పందిస్తారా..? లేదా..? చూడాలి.

Also Read : Elections Incharges -ఇంఛార్జీలు వారే.. ఎన్నికల ఖర్చూ వారిదే! -టీడీపీ నేతల పీకలపై అధిష్టానం కత్తి