iDreamPost
android-app
ios-app

అమరావతిని ‘ఫిజికల్’‌గా పక్కనపెట్టేసినట్లేనా..?

అమరావతిని ‘ఫిజికల్’‌గా పక్కనపెట్టేసినట్లేనా..?

రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ఇకపై పరోక్షంగా సాగనుందా..? ప్రత్యక్ష పోరాటాలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వస్తి పలికారా..? ప్రత్యక్ష పోరాటం కేవలం అమరావతిలోని 29 గ్రామాలకే పరిమితం చేయదలుచుకున్నారా..? ఇతర ప్రాంతాలలోనూ పార్టీని బతికించుకోవాలనుకుంటున్నారా..? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాల ద్వారా అవుననే సమాధానం వస్తోంది. రైతులకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ నిన్న చేయదలుచుకున్న గుంటూరు జైల్‌ భరోను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఈ రోజు ఆదివారం అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ పాటించాలని అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ పిలుపు మేరకు 29 గ్రామాల్లో బంద్‌ సాగుతోంది.

ఈ బంద్‌తోనే పైన పేర్కొన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ అమరావతి అందరిదీ.. ప్రజలందరూ పోరాటం చేయాలని పదే పదే పిలుపునిచ్చిన చంద్రబాబు.. నేడు బంద్‌ను రాజధాని గ్రామాలకే పరిమతం చేయడం గమనార్హం. ఇటీవలే టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరిగాయి. పాత, కొత్తవారికి పదవులు దక్కాయి. పార్టీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. అయినా బంద్‌ను అమరావతి జేఏసీ ద్వారా ఆ గ్రామాలకే పరిమితం చేయడం చంద్రబాబు మార్క్‌ రాజకీయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడడంతో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో టీడీపీ డీలా పడింది. స్థానిక సంస్థల ఎన్నికల లోపు తిరిగి పార్టీని పట్టాలెక్కించేందుకు, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే బాబు.. అమరావతి ఉద్యమ బాధ్యతలను, ప్రత్యక్ష పోరాటాన్ని అమరావతి జేఏసీకి అప్పగించారనే టాక్‌ నడుస్తోంది.

అమరావతి కోసం చంద్రబాబు, ఆయన పార్టీ ఇకపై పరోక్షంగా పోరాటం చేస్తుందనే సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం అమరావతి అంశం న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. కోర్టుల్లో సాగే పోరాటంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని బాబు యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పరోక్ష పోరాటం ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించేందుకు ప్రయత్నం చేస్తూనే.. అదే సమయంలో పార్టీని బతికించుకునే దిశగా బాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా పరిణామాలు సాగుతున్నాయి.