iDreamPost
android-app
ios-app

అధినేత పరిస్థితి చూసి బావురుమంటున్న తమ్ముళ్లు

అధినేత పరిస్థితి చూసి బావురుమంటున్న తమ్ముళ్లు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తాజాగా హైదరాబాద్‌లో ఎదురైన పరిస్థితిని చూసి తమ్ముళ్లు బావురమంటున్నారు. తెలంగాణ రాజకీయ అంశాల్లో వేలుపెట్టే అవకాశం పోయినా.. కనీసం పార్టీ కార్యక్రమాలు కార్యాలయం వెలుపల నిర్వహించుకునే అవకాశం చంద్రబాబుకు లేని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు.మంగళవారం తెలుగుదేశం పార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. 40 కేజీల కేక్‌ను కట్‌ చేసి, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళి అర్పించే కార్యక్రమానికి రూపకల్పన చేశారు.

నేరుగా వాహనంలో కాకుండా.. ఎన్టీఆర్‌ ఘాట్‌కు ఒకటిన్నర కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి నడిచి వచ్చి ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళి అర్పించాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు కార్యక్రమాన్ని రూపొందించి, అనుమతి కోసం పోలీసులను టీడీపీ నేతలు సంప్రదించారు. అయితే పోలీసులు చంద్రబాబుకు కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదు. అయినా కిమ్మనని టీడీపీ నేతలు, చంద్రబాబు నడక కార్యక్రమం రద్దు చేసుకుని, వాహనంలో ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి ఎన్టీఆర్‌ ఘాట్‌కు చేరుకున్నారు.

ఎలా ఉండేవాడు.. ఎలా అయ్యాడు..

ఈ పరిణామాన్ని టీడీపీనేతలు మొదట బహిరంగ పరచలేదు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంపై కూడా చంద్రబాబుతో సహా ఎవరూ స్పందించకపోవడంతో తమ్ముళ్లకు మొదట తెలియరాలేదు. ఆ తర్వాత జరిగిన విషయం మీడియాలో రావడంతో తెలుగు రాష్ట్రాలలోని తమ్ముళ్లకు చంద్రబాబుకు జరిగిన అవమానం గురించి తెలిసింది. దీంతో తమ్ముళ్లు కేసీఆర్‌పై రగిలిపోతున్నారు. అదే సమయంలో చంద్రబాబుపై జాలిపడుతున్నారు. తమ అధినేత ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడని చెప్పుకుంటూ మథన పడుతున్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని, అభివృద్ధి చేశానని, ప్రపంచపటంలో పెట్టానని ఇప్పటికీ చంద్రబాబు చెప్పుకుంటుంటారు. ఇలాంటి చంద్రబాబుకు హైదరాబాద్‌లో నడిచే హక్కు కూడా లేకుండాపోయిందా..? అంటూ తమ్ముళ్లు ఆవేదన చెందుతున్నారు.

ఓటుకు నోటు తర్వాత మారిన పరిస్థితి..

రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలంగాణలో టీఆర్‌ఎస్, ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి. చంద్రబాబు, కేసీఆర్‌లు ముఖ్యమంత్రులు అయ్యారు. తెలంగాణలోని 119 సీట్లకు గాను టీఆర్‌ఎస్‌ 63 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 21, టీడీపీ 15 సీట్లు గెలుచుకున్నాయి. ఇతర పార్టీలు మరో 21 సీట్లలో నెగ్గాయి. అయితే కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ లాగేసుకోవడంతో చంద్రబాబు రగిలిపోయారు. ఈ నేపథ్యంలో 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ స్టీఫెన్‌సన్‌కు ఐదు కోట్ల రూపాయల లంచం ఆఫర్‌ చేసి, 50 లక్షలు ఇస్తూ ఆడియో, వీడియో ఆధారాలతో చంద్రబాబు, ఆ పార్టీ నేత రేవంత్‌ రెడ్డిలు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీనిపై తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్‌ రెడ్డి జైలుపాలయ్యారు. చంద్రబాబును దేవుడు కూడా కాపాడలేడంటూ కేసీఆర్‌ మాట్లాడారు.

ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పై ఉన్న హక్కును, ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో అక్కడ సచివాలయంలో వాస్తు ప్రకారం అధునాతన వసతులు కల్పించుకున్న కార్యాలయాలను ఉన్నఫళంగా వదిలేసి విజయవాడకు వచ్చారు. కొన్ని రోజులు బస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత గేట్‌ వే హోటల్‌ లో బస చేశారు. కేసీఆర్‌తో కుదిరిన రాజీతోనే చంద్రబాబు ఆ కేసు నుంచి తప్పించుకున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. ఆ కేసు తర్వాత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టలేదు. హైదరాబాద్‌లో కొత్త ఇళ్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పరుచుకున్నా.. ఏనాడు తెలంగాణ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. ఇప్పుడు హైదరాబాద్‌లో బహిరంగంగా రాజకీయ పరమైన కార్యక్రమం చేసే పరిస్థితి కూడా లేదని తెలియడంతో తమ్ముళ్ల బాధ వర్ణణాతీతంగా ఉంది.