Idream media
Idream media
ఏపీలో రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైతే ప్రతిపక్షం రోడ్డెక్కుతుంది. ధర్నాలు, ఆందోళనలతో హడావిడి చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా అదే జరిగేది. కానీ ఇక్కడ ప్రతిపక్షం పాత్ర.. పాత్రకు తగ్గట్లుగా ఉండడం లేదని విమర్శల పాలవుతోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే దాన్నో పాఠంగా ఎక్కడ సమావేశం జరిగినా వల్లె వేస్తుంటారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా తామే ప్రతిపక్షమని ధైర్యంగా ప్రకటిస్తారు కూడా. అందుకు కారణం టీడీపీ అనుసరిస్తున్న విధానాలే. ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా.. ఎప్పుడు చూసినా వ్యక్తుల ప్రయోజనాలే ధ్యేయంగా ఆందోళనలు కనిపిస్తున్నాయి. కేసుల్లో ఇరుక్కున్న టీడీపీ నేతలను అరెస్టు చేశారనో.. అక్రమ కట్టడాలు కూల్చివేశారనో… పోలీసులు అరెస్టు చేయడానికి వస్తున్నారనో.. ఎక్కువగా ఈ తరహా ఆందోళనలే కనిపిస్తున్నాయి. ఇటీవల విశాఖలో సత్య ప్రమాణాల సవాళ్లు బాగా చర్చనీయాంశం అయ్యాయి. ఆ ఎపిసోడ్ 2, 3 రోజులుపైబడే నడిచింది. ఆవేశంగా సవాల్ విసిరిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆదివారం నాడు ప్రమాణం చేయడానికి రాలేదు. మరి ఇంతటితో ఆ కథ ముగిసినట్లేనా..?!
ఆరోపణలు నిజమని నిర్దారణ అయినట్లే..
సవాళ్ల పర్వం ముగిసిపోయిందని తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయ్యిందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సాయిబాబా గుడిలో ప్రమాణానికి రావాలని అమర్నాథ్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆధారాలతో సత్య ప్రమాణానికి అమర్నాథ్ సిద్ధమయ్యారు. కానీ ఆదివారం ఆలయానికి టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ రాలేదు. వెలగపూడి కోసం గంట పాటు అమర్నాథ్, పార్టీ నేతలు వేచి చూశారు. వెలగపూడి రాకపోవడంతో ఎమ్మెల్యే అమర్నాథ్ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు వాస్తవం కాబట్టే వెలగపూడి మొహం చాటేశారని మండిపడ్డారు. సత్య ప్రమాణానికి గైర్హాజరైన వెలగపూడి తన తప్పులను ఒప్పుకున్నట్టే అన్నారు. రిషికొండలో వెలగపూడి రామకృష్ణ భూమి ఆక్రమించారని దుయ్యబట్టారు. ఇప్పటికే వెలగపూడి అక్రమాలపై సాక్ష్యాలు బయట పెట్టామని అన్నారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇకపై టీడీపీ నాయకులకు సవాలు విసిరే అర్హత లేదని తాము సవాళ్లకు రావాలంటే చంద్రబాబు, లోకేష్ రావాలని అమర్నాథ్ అన్నారు. ఇప్పటికైనా ఆక్రమణదారులు తమ భూములు వెనక్కి ఇస్తే మంచిదని, త్వరలో సిట్ నివేదికలో టీడీపీ బండారం బయటపడుతుందన్నారు. చంద్రబాబు నాయుడు రాజకీయ బిచ్చగాడని, ఇతరులకు ఆయన రాజకీయ భిక్ష పెట్టింది ఏంటనీ సూటిగా ప్రశ్నించారు. తన పేరిట అక్రమాస్తులు ఉన్నట్టు గుర్తిస్తే స్టాంప్ పేపర్‌పై అనాధ శరణాలయానికి రాసిస్తానని అన్నారు. నాటి నుంచీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆచూకీ లేకుండా పోయారు. ఈ ప్రమాణాల కథ ముగిసిందో.. లేదో తెలియదు కానీ.. పోలీసులు మాత్రం అక్కడ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.