iDreamPost
android-app
ios-app

ఆంధ్రాలో బీజేపీ రాజేస్తున్న “టిప్పు” నిప్పు

ఆంధ్రాలో  బీజేపీ రాజేస్తున్న   “టిప్పు” నిప్పు

హిందూ ముస్లింలు సఖ్యతతో,సోదరభావంగా మెలిగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కడప జిల్లా ప్రొద్దుటూరు లో టిపుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు అంశాన్ని అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది .

దేశ రాష్ట్రపతి ఒకవైపు టిప్పు సుల్తాన్ విగ్రహావిష్కరణ సమయంలో ఆయనను యోధుడు శూరుడిగా కొనియాడుతుంటే వీరు ఆయనను విధ్వంసకారుడు,కేవలం ముస్లిం మతానికి చెందినవారయినంత మాత్రాన మతోన్మాది అని విమర్శించడం రెండు నాలుకల ధోరణి కి నిదర్శనం ? రాజ్యాంగం మొదటిముద్రణలో ఝాన్సీ లక్ష్మీ బాయి పక్కన టిపుసుల్తాన్ చిత్రం ఉన్నపుడు ఆ రాజ్యాంగాన్నే ఆధారంగా చేసుకుని పాలన సాగించేటపుడు టిప్పు సుల్తాన్ మతద్వేషి అనటం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసరమే.

రెండవ మైసూరు గా పిలవబడే ప్రొద్దుటూరు కడప జిల్లాలో ముస్లింల జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఒకటి. టిప్పు సుల్తాన్ కడప ఆడపడచు కుమారుడు. టిప్పు తల్లి ఫాతిమా ఫక్రున్నీసా కడప నవాబు కొలువులో కడప కోటకు అధిపతిగా ఉన్న మీర్ మొయినుద్దీన్ కుమార్తె. టిప్పును కడప అల్లుడిగా భావించిన ఆ ప్రాంతప్రజలు ప్రొద్దుటూరు జిన్నానగర్ లో ఆయన విగ్రహం ఏర్పాటుచేసుకుని తమ వాత్సల్యాన్ని చాటాలనుకున్నారు. ఆరకంగా టిపుకు కడపతో అవినాభావ సంబందాలే ఉండేవని తెలుస్తోంది.

కోవిడ్ సమస్యలు,రాయలసీమ నీటి ఆవసరాలు,జల వివాదాలు,పెరిగుతున్న ఆయిల్,నిత్యావసర ధరల మీద స్పందించని స్థానిక బీజేపీ నాయకత్వం నేడు టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు రాష్ట్ర సమస్య అన్నట్లు మాట్లాడటం శోచనీయం. .

ఈ నేపథ్యంలో టిప్పు సుల్తాన్ హిందూ మత దేవాలయ అభివృద్ధికి చేసిన కొన్ని పనులను గమనిస్తే,
ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు స్థాపించిన కర్ణాటకలోని షిమోగాలోని శృంగేరీ పీఠంపై మరాఠాలు దాడి చేసి ధ్వంసం చేసి ఆభరణాలను,బంగారాన్ని,ధనాన్ని కొల్లగొట్టి విగ్రహాలకు నష్టం కలిగించినపుడు మఠాధిపతి సచ్చిదానంద విజ్ఞప్తి మేరకు అప్పటికి మూడో మైసూరు యుద్ధంలో తాను పరాజితుడై యున్నప్పటికీ పూజల పునరుద్ధరణకు,విగ్రహ పునఃప్రతిష్ఠాపనకై సరిపడినంత ధనాన్ని,రక్షణ నివ్వాల్సిందిగా ఆ ప్రాంతంలో ఉండే తన అధికారులకు తెలియచేశాడు.

మఠాధిపతిని జగద్గురువుగా సంబోధిస్తూ అనేక ఉత్తర ప్రత్యుత్తరాలను జరిపాడని తర్వాత జరిగిన పరిశోధనలలో వెల్లడైనట్లు మైసూరు రాజ్య పురావస్తు శాఖ డైరెక్టర్ రావుబహద్దూర్ నరసింహాచార్ వెల్లడించారు. తన రాజ్యంలోని ఆలయాల నిర్వహణకు,పాలనకు ప్రత్యేక శాఖను నియమించడం ఆయన మతసామరస్యానికి నిదర్శనం.

కడప జిల్లాలోని పులివెందులలోని ఆంజనేయ స్వామి దేవాలయం,వెంకటాచలపతి దేవాలయంలో ఆగిపోయిన పూజల పునరుద్ధరణకై ఆజ్ఞలు జారీ చేశాడు. బ్రాహ్మణులకు భృతిని ఏర్పాటు చేశాడు.ఇదే జిల్లాకు చెందిన గొల్లపల్లి,తొంగపల్లి కి చెందిన గ్రామశిస్తులను పుష్పగిరికి చెందేలా ఆజ్ఞాపత్రాలు జారీ చేశాడు.

తన రాజధాని శ్రీరంగపట్నం లోని రంగనాథాచార్యుల దేవాలయంలో వెండిగిన్నెలను,కర్పూరహారతినిచ్చే గిన్నెలను బహుకరించినట్లు శాసనాలు లభ్యమవుతున్నాయి. తన తండ్రి పునాది వేసిన కంచి గోపుర నిర్మాణాన్ని పూర్తి చేశాడు.మెల్కొటే దేవాలయంలో హిందూ తెగలైన వడగలై,తెంగలై శాఖల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించాడు.

నంజన్ గూడలోని నంజుండేశ్వర దేవాలయంలో పచ్చలతో పొదిగిన శివలింగానికి నేటికీ పూజలు జరుగుతూనే ఉన్నాయి. ఒడయారు రాజుల సంప్రదాయాలను గౌరవించడమే కాక వారు పాటించే పద్ధతులను ఈయన కూడా పాటించేందుకు ప్రయత్నించారు. దసరా ఉత్సవాలను ఘనంగా పదిరోజులు జరిపేవాడు. తన రాజ్యంలోని అత్యధికులైన హిందువుల మనోభావాలను గౌరవించి ,పాలకుడిగా మత పరిరక్షణకు,అభివృద్ధికి కృషి చేసినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నా బ్రిటీష్ రచయితలు,చరిత్రకారులు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా తమ సామ్రాజ్యకాంక్షతో ఆయనను మతోన్మాదిగా చిత్రీకరించారు.

టిప్పు గురించి వాస్తవ దృక్పథం తో కూడిన సమాచారం కావాలంటే 1967 లో సుబ్బరాయ గుప్తా రచించిన న్యూ లైట్ ఆన్ టిప్పు సుల్తాన్,కాశ్మీర్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ మోహిబ్బుల్ హసన్ 1951 లో రాసిన హిస్టరీ ఆఫ్ టిప్పు సుల్తాన్,1970 లో డెనిస్ ఫారెస్ట్ రాసిన టైగర్ ఆఫ్ మైసూర్ &ది లైఫ్ అండ్ డెత్ ఆఫ్ టిపు చదవగిగితే మరిన్ని అంశాలు బోధపడుతాయి.

టిప్పు సుల్తాన్ కూడా అనేక మంది భారతీయ సంస్థానాధిపతులవలె ఈస్ట్ ఇండియా కంపినీతో సైన్యసహకార ఒప్పందాన్ని కుదుర్చుకుని సామంతుడిగా ఉండటానికి అంగీకరించి ఉంటే ప్రాణాలు కోల్పోకుండా పాలన చేసుకునేవాడు. ఓడిపోతాను, మరణిస్తానని తెలిసీ కూడా సామంతుడిగా ఉండటానికి ఒప్పుకోలేదు. తన ఆత్మగౌరవాన్ని,స్వాతంత్రాన్ని తాకట్టు పెట్టలేదు.బలి అయినా మైసూరు పులిగా,ప్రజారంజక పాలకుడిగా కర్ణాటక జానపద లావణీలలో చిరంజీవిగా నిలిచిపోయారన్న వాస్తవాలను మరుగున పరిచి రాజకీయ లబ్ది కోసం టిప్పు పేరుతొ మతఘర్షణలు జరిగేలా వ్యవహరించటం బీజేపీకి తగదు.