Idream media
Idream media
ఈసారి మహానాడు లక్ష్యమే మారిపోయింది. మహానటుడు ఎన్టీఆర్ ఆశయాల సాధనకు కృషి, పార్టీ భవితకు చర్చించాల్సిన వేదిక పరనింద రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చింది. దానిలో భాగంగానే విపక్షాలతో కలిసి అధికార వైసీపీ పై పోరాటం చేయాలని మహానాడులో తెలుగుదేశం పార్టీ ఓ తీర్మానం చేసింది.
తీర్మానం చేయడం బాగానే ఉంది కానీ, అసలు ఆ పార్టీతో కలిసి పోరాడేది ఎవరనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇప్పటి వరకూ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తే, టీడీపీతో చేతులు కలిపేందుకు సీపీఐ తప్ప ఏ పార్టీ ముందుకు రాలేదు. ఇప్పుడు మరో విచిత్రం ఏంటంటే, మహానాడులో కేంద్రానికి మద్దతు తెలుపుతూ టీడీపీ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ కూడా వ్యతిరేకించింది. చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేత రామకృష్ణ కొత్త స్వరం అందుకున్నారు. ఇప్పుడు ఆ పార్టీ కూడా కలిసి వస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకమే.
గడచిన రెండేళ్ళను ప్రామాణికంగా తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడు చంద్రబాబు పిలుపిచ్చినా సీపీఐ మాత్రమే చేతులు కలిపింది. వామపక్షాల్లో మరో కీలకమైన సీపీఎం ఇప్పటివరకు టీడీపీతో కలవలేదు. అలాగే చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ ఉండనే ఉంది. కాబట్టి ప్రతిపక్షమే అయినా టీడీపీతో బీజేపీ కలిసే అవకాశంలేదు.
ఇక బీజేపీతో మిత్రపక్షం కాబట్టి జనసేన కూడా ఇప్పటివరకు టీడీపీతో కలవలేదు. చివరగా కాంగ్రెస్ పార్టీ కూడా చంద్రబాబుకు దూరమైపోయింది. కాంగ్రెస్సే టీడీపీని దూరంపెట్టిందా లేకపోతే చంద్రబాబే కాంగ్రెస్ కు దూరం జరిగారా అన్నది బ్రహ్మపదార్ధంగా తయారైంది. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగితే టీడీపీ పార్టిసిపేట్ చేయలేదు. మాజీ ఎంఎల్ఏ పల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో విడిగా నిరాహారదీక్ష చేసిందే కానీ కాంగ్రెస్ వామపక్షాలతో కలవలేదు.
ఏ సమావేశమైనా వామపక్షాలుంటే బీజేపీ ఉండదు. అలాగే బీజేపీ పాల్గొనే పోరాటాల్లో వామపక్షాలు ఉండవు. అందరినీ కలుపుకునే వెళ్ళేంత సీన్ ప్రస్తుతానికి చంద్రబాబుకు లేదు. కాబట్టి మహానాడులో చేసిన తీర్మానం తీర్మానంగా మిగిలిపోవటానికే అవకాశం ఎక్కువుంది. బీజేపీతో విడిపోతే కానీ చంద్రబాబుతో కలవటానికి జనసేనకు అవకాశం లేదు.ఇదే సమయంలో రాష్ట్రంలో ఓ విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో వైసీపీని బలంగా ఢీకొనేంత శక్తి ప్రతిపక్షాల్లో ఏపార్టీకి లేదన్నది వాస్తవం. మరి ఈ నేపథ్యంలో టీడీపీకి ఎవరు కలిసి వస్తారు? మహానాడులో చేసిన ఈ తీర్మానానికి ఆచరణలో భంగపాటు తప్పదా??