iDreamPost
android-app
ios-app

మనకి మనం చెప్పుకుంటే చరిత్రైపోదు

  • Published Oct 13, 2020 | 4:07 PM Updated Updated Oct 13, 2020 | 4:07 PM
మనకి మనం చెప్పుకుంటే చరిత్రైపోదు

ఏదైనా ఒక బలమైన కారణంతో ఏర్పడిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుంది. అంతే గానీ మనకి మనం ప్రారంభించేసి ఇదే గొప్ప.. చరిత్రలో నిలిచిపోతుందని అని చెబితే మాత్రం నిలిచిపోదు. ఇప్పటి వరకు ఎన్నో ఉద్యమాలు ఇదే విషయాన్ని స్పష్టం చేసాయి. రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌ వైపు జరిగిన ఉద్యమానికంటే తెలంగాణా వైపు జరిగిన ఉద్యమమే బలమైందని చెప్పకతప్పదు. దీనికి తోడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ రాష్ట్రానికి మద్దతుగా నిలవడంతో అది సక్సెస్‌ ఉద్యమంగా నిలిచిపోయింది. అన్ని రోజులు చేసినాగానీ సమైక్యాంధ్ర ఉద్యమం ఫలితమివ్వలేకపోయిందని ఒప్పుకోవాల్సిందే.

ఇప్పుడు రాష్ట్రంలో అమరావతి గురించి జరుగుతున్న ఉద్యమాన్ని గురించి కూడా కొందరు తమతమ రాజకీయ ప్రయోజనాల కోసం చరిత్రలో నిలిచిపోతుదంటూ దప్పాలు కొడుతున్నారన్న అభిప్రాయం సర్వత్రా విన్పిస్తోంది. చరిత్రలో నిలిచిపోవాలంటే ఒక బలమైన నేపథ్యం, కారణం ఆ ఉద్యమానికి ఉండాల్సిందే. అంతే గానీ మా ప్రయోజనాల కోసం మీరందరూ త్యాగం చెయ్యండి అన్నరీతిలో ఉంటే మాత్రం ఆ ఉద్యమం చరిత్రలో మాట అటుంచితే కనీసం అదే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజల మనస్సులో కూడా నిలవదనే చెప్పాలి. రోజుల తరబడి ఉద్యమిస్తున్నప్పటికీ ఈ ఉద్యమం గురించి ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలు కనీసం పట్టించుకుంటున్న దాఖలాల్లేవు. దీనిని ఏ విధంగా అర్ధం చేసుకోవాలన్న దానిపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి.

‘‘ఒకే చోట రాజధాని’’ అన్న నినాదానికంటే ‘‘అన్ని ప్రాంతాలకు సమన్యాయం’’ అన్న నినాదం ఎంతో బలమైనది. మా ప్రాంతానికి కూడా రాజధానిలో ప్రాధాన్యం లభిస్తోందన్న భావన ముందు అక్కడెక్కడి వాళ్ళో నష్టపోతున్నారన్న భావన సరితూగదు. సరిగ్గా అమరావతి ఉద్యమానికి ఇదే వర్తిస్తోందంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు ఒక వర్గం వారికే ఎక్కువ ప్రాధాన్యం ఉండడం, సామాన్యులెవ్వరికీ పెద్దగా అక్కడ భూముల్లేకపోవడం, మా భూముల ధరలు పడిపోతాయంటూ ఉద్యమకారులు బైటపడుతుండడం.. ఇలా విభిన్న కారణాలతో అమరావతి ఉద్యమం పట్ల ఇతర ప్రాంతాల వాసులు పెద్దగా ఆసక్తిచూపించడం లేదనే చెబుతున్నారు.

అయిదే వంద రోజులు, రెండొందలు, మూడొందల రోజుల ఫంక్షన్లు జరిపినప్పటికీ ఉధ్యమ ఉద్దేశంపై రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు సదభిప్రాయం లేకపోతే విజయవంతమయ్యేందుకు ఆస్కారం ఉండదని కుండబద్దలు కొట్టేస్తున్నారు. అంతే కాకుండా భూముల సేకరణ ద్వారా లబ్దిపొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఈ ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉండడం కూడా ప్రజల దృష్టికోణం ఈ ఉద్యమంపై వీక్‌గా ఉండడానికి ఆస్కారం ఏర్పడిందని వివరిస్తున్నారు. ఏది ఏమైనా ఉధ్యమ ఉద్దేశం ద్వారా మాత్రమే చరిత్రలో చోటు దక్కుతుందని ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుందంటున్నారు. అంతే గానీ మేం చేస్తున్నాం కాబట్టి చారిత్రక ఉద్యమం అంటే పెద్దగా చరిత్ర కూడా పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు.