డాక్టర్లను దేవుళ్ళతో పోలుస్తారు. ఒక ప్రాణాన్ని కాపాడగలిగే అవకాశం వాళ్ళకు ఉండటమే అందుకు కారణం. కానీ, ఎక్కడో కొంతమంది మాత్రం ఆ వృత్తికి, విలువకు మచ్చ తెస్తారు. అలాంటి సంఘటనే జరిగింది హైదరాబాద్ లో.
డాక్టర్ల నిర్లక్ష్యానికి ఇంకా ఈ ప్రపంచాన్ని కూడా చూడని ప్రాణం బలైంది. అంబర్ పేట్ గోల్నాకలో ఉండే ఫాతిమా, కాన్పు కోసం ఈ నెల 24న చాదర్ ఘాట్ దగ్గర ఉన్న ఇంతియాజ్ ఆసుపత్రిలో చేరింది. 26 సాయంత్రం ఆమెకు పురుటి నొప్పులు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని వైద్యులకు చెప్పేందుకు వెళ్ళగా, ఆసుపత్రిలో సిబ్బంది, వైద్యులు ఎవరూ కనపించలేదు. వారంతా ఆ సమయంలో బిల్డింగ్ టెర్రస్ పైన విందులో బిజీగా ఉన్నారు.
గంట తరువాత ఫాతిమా దగ్గరకు వచ్చి చూడగా, అప్పటికే కడుపులో బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం చనిపోయింది. ఇదే అంశంపై ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించినా ఎవరూ అందుబాటులోకి రాకపోవడం కొసమెరుపు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. మరే ఇతర పేషంట్లకు ఈ పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు, శిశివు పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.