Idream media
Idream media
ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు రోజుల క్రితం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గత వారం ప్రపంచవ్యాప్తంగా కోటిన్నర కేసులు, 43 వేల మరణాలు నమోదయ్యాయి. అందులో అత్యధికం అమెరికాలో వచ్చిన కేసులే. ఆఫ్రికా తప్ప ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ కేసులు పెరిగాయి. అయితే.. ఎంత వేగంగా పెరిగాయో.. అంతే వేగంగా తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.ఎందుకంటే.. దక్షిణాఫ్రికాలో నవంబరు 24న తొలిసారి ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తిస్తే.. డిసెంబరు ముగిసేసరికి అక్కడ కేసులు భారీగా పెరగడం, తగ్గడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికా, బ్రిటన్ దేశాల్లో కూడా కనిపిస్తోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు.
ఆ రెండు దేశాల్లో కేసుల సునామీకి కారణమైన ఒమిక్రాన్ వేవ్ త్వరలోనే ముగిసిపోయే సంకేతాలున్నాయని.. ఈ వారంలో కేసులు పతాకస్థాయికి చేరుతాయని, ఆ తర్వాత కేసుల తగ్గుదల మొదలవుతుందని వారు పేర్కొన్నారు. నెలన్నర వ్యవధిలోనే అత్యధికులకు సోకడంతో.. ఇక కొత్తగా ఆ వేరియంట్ బారిన పడేవారు లేకపోవడమే ఇందుకు కారణమని శాస్త్రజ్ఞులు వివరిస్తున్నారు. ‘‘ఈ వేవ్ ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా ముగిసిపోనుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌లోని హెల్త్‌మెట్రిక్స్ సైన్సెస్ ప్రొఫెసర్ అలీ మొక్‌దాద్ తెలిపారు.
ఆ వర్సిటీ అంచనాల ప్రకారం జనవరి 19 నాటికి అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య 12 లక్షలకు చేరుతుంది. ఆ సమయానికి దేశంలో దాదాపు అంతా ఒమిక్రాన్ ఇన్‌ఫెక్ట్ అయిపోతారని మొక్‌దాద్ పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే అమెరికాలో కేసుల సంఖ్య తగ్గుతుండడం గమనార్హం. ఇక బ్రిటన్‌లో ఈ నెల మొదట్లో 2 లక్షలకు చేరిన రోజువారీ కేసుల సంఖ్య ప్రస్తుతం 1.4 లక్షలకు తగ్గిపోయింది. మొత్తంగా చూస్తే కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. యూకేలోని కొన్ని ప్రాంతాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో కూడా మెజారిటీ ప్రజలు ఇన్ఫెక్ట్ అయ్యాక కేసులు పూర్తిగా తగ్గుముఖం పడతాయని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా మహమ్మారిని సాధారణ ఫ్లూ స్థాయికి తగ్గించే టర్నింగ్ పాయింట్ ఒమిక్రానే అనే అభిప్రాయాన్ని పలువురు శాస్త్రజ్ఞులు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : థర్ట్ వేవ్ మొదలైంది.. భారత్ సిద్ధమైందా..?