iDreamPost
android-app
ios-app

పోలవరం పూర్తిపై బుచ్చయ్య చేసిన రాజీనామా సవాళ్లు తెలుసా..?

పోలవరం పూర్తిపై బుచ్చయ్య చేసిన రాజీనామా సవాళ్లు తెలుసా..?

రాజకీయ నేతలు, ప్రజా ప్రతినిధులు రెండు సందర్భాల్లో రాజీనామా అస్త్రాన్ని ఉపయోగిస్తుంటారు. ఒకటి సొంత పార్టీలో ప్రాధాన్యత దక్కనప్పుడు, రెండోది ప్రత్యర్థి పార్టీ నేతలు లేదా తమ పార్టీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారితో మాటా మాటా పెరిగిన సమయంలో రాజీనామా సవాళ్లు విసురుతుంటారు. తమ వాదన నిజమని ప్రజలను నమ్మించేందుకు రాజీనామా అస్త్రం ఉపయోగిస్తుంటారు. టీడీపీ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈ రెండు సందర్భాల్లో రాజీనామా అస్త్రాలను సంధించారు. అయితే ఎప్పుడూ చేసిన సవాళ్లకు కట్టుబడి ఉండలేదు. తాజాగా ఆయన మరోమారు టీడీపీ అధినేత చంద్రబాబుపై అలకబూని పార్టీతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే లీకులు ఇచ్చారు. ఈ విషయం అలా ఉంచితే.. రాజకీయ ప్రత్యర్థులతోనూ గోరంట్ల రాజీనామా సవాళ్లు విసిరిన సందర్భాలు ఉన్నాయి. ఆ సవాళ్లపై కూడా ఆయన నిలబడలేదు. ఇంతకీ ఆ సవాళ్లు ఏమిటి..? దేని గురించి చేశారు..?

పోలవరంపై ఉండవల్లితో సవాల్‌..

పోలవరం పూర్తి కావడంపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో సవాల్‌ చేశారు. 2016లో ఈ ఘటన జరిగింది. టీడీపీ ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నిర్లక్ష్యం చూపుతోందని ఉండవల్లి విమర్శించారు. పట్టిసీమ వల్ల ఒరిగేది ఏమీ ఉండదని పేర్కొన్నారు. ఈ విషయంపై తాను ఎవరితోనైనా చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీనికి ప్రతిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. పట్టిసీమ బృహత్తర ప్రాజెక్టు అని ఉండవల్లికి కౌంటర్‌ ఇచ్చారు. బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. చర్చ నిర్వహించే ప్లేస్, సమయం చెప్పాలన్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీపై చర్చిద్దామని ఉండవల్లి చెప్పారు. తన అనుచరులతో కలసి ఉండవల్లి విజయవాడకు చేరుకున్నారు. గోరంట్ల కూడా తన అనుచరులతో కలసి 70 వాహనాలతో విజయవాడకు బయలుదేరారు. శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని పోలీసులు గోరంట్లను విజయవాడకు సమీపంలో నిలిపివేసి వెనక్కి పంపారు. ఉండవల్లిని చర్చ జరిగే ప్రకాశం బ్యారేజీకి రానివ్వలేదు.

ఈ ఘటన జరిగిన రోజునే.. ఓ న్యూస్‌ ఛానెల్‌ ఈ అంశంపై గోరంట్ల, ఉండవల్లితో లైవ్‌ చర్చా కార్యక్రమం నిర్వహించింది. ఈ చర్చలో ఇద్దరు నేతలు తమ వాదనలను వినిపించారు. పట్టిసీమ కడుతూనే 2018 వరదల సమయానికి (జూన్‌ నాటికి) పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. లేదంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. 2018 జూన్‌కు కాదు.. 2019కి పూర్తి చేసినా చాలంటూ ఉండవల్లి చెప్పినా.. వినని గోరంట్ల.. కాదు కాదంటూనే 2018 జూన్‌ నాటికి పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. బహుసా గోరంట్ల ఈ స్థాయిలో నమ్మకంగా చెప్పడానికి అంతకు కొన్ని నెలల ముందు అసెంబ్లీ సమావేశాల్లో.. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.. ‘‘రాసిపెట్టుకో జగన్‌.. 2018కి పోలవరం పూర్తి చేస్తాం’’ అన్న మాటలే కారణం కావొచ్చు. కాలం గిర్రున తిరిగింది. 2018 రానే వచ్చింది. వరదల సమయం దాటిపోయింది. పోలవరం స్పిల్‌ వే కూడా పూర్తి కాలేదు. అయినా గోరంట్ల చేసిన సవాల్‌ మాత్రం ఆచరణలోకి రాలేదు. ఈ విషయం మీడియా సమావేశంలో ఉండవల్లి గుర్తు చేసినా.. గోరంట్ల మాత్రం తనకు తెలియదన్నట్లుగా మౌనం వహించారు.

Also Read : ‘తూర్పు’ రాజకీయం – ఒకప్పటి మిత్రులు.. నేడు రాజకీయ ప్రత్యర్థులు

పోలవరం పర్యటనలో మరోసారి రాజీనామా సవాల్‌..

అది 2017, టీడీపీ ప్రభుత్వం ప్రజలను ప్రభుత్వ సొమ్ముతో పోలవరం ప్రాజెక్టు పర్యటనకు తీసుకెళుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా తన స్థాయికి తగినట్లుగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, నేతలు, మీడియా ప్రతినిధులను ప్రత్యేక బస్సులు, వాహనాలలో పోలవరం పర్యటనకు తీసుకెళ్లారు. నిర్మాణం జరుగుతున్న స్పిల్‌వే ప్రాంతాన్ని అందరూ చూశారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో అధికారులు ఏర్పాటు చేసిన గోదావరి నది మళ్లింపు, ప్రాజెక్టు నిర్మాణం సహా వివిధ అంశాలతో ఏర్పాటు చేసిన ఊహా చిత్రాన్ని చూశారు. అధికారులు పలు విషయాలను వారికి వివరించారు. మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నుంచి వెళ్లిన వారితోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సందర్శనకు వచ్చిన ప్రజలు బుచ్చయ్య మీడియా సమావేశంలో ఏం మాట్లాడతారనే ఆసక్తితో చూస్తున్నారు.

మీడియా సమావేశం ప్రారంభమైంది. ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని గోరంట్ల బుచ్చయ్య చౌదరి వివరించారు. 2018 జూన్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తామని, 2019 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని బలంగా చెప్పారు. ఈ అంశంపై విలేకర్లు పలు ప్రశ్నలు అడిగారు. ఇంత గట్టిగా చెబుతున్న బుచ్చయ్య చౌదరి.. 2019 జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఏం చేస్తారనే ప్రశ్న మీడియా ప్రతినిధులతోపాటు అక్కడున్న వివిధ ప్రాంతాల ప్రజల్లో మెదిలాయి. ఆ ప్రశ్నను విలేకర్లు బుచ్చయ్య చౌదరిని అడిగారు. 2019 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య సవాల్‌ చేశారు. 2019 ఏప్రిల్‌కే మీ పదవి కాలం ముగుస్తుంది కదా.. రాజీనామా ఎలా చేస్తారని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. 2019లో మళ్లీ పోటీ చేస్తానని, గెలిచిన తర్వాత ఆ ఏడాది జూన్‌ నాటికి ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని విశ్వాసంతో చెప్పారు.

బుచ్చయ్య చౌదరి విశ్వాసం నెగ్గింది. 2019 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 జూన్‌ నాటికి పోలవరం ప్రాజెక్టు ఏ దశలో ఉంది అందరికీ తెలిసిందే. రోజులు నెలలైనా, నెలలు సంవత్సరాలైనా.. చేసిన సవాళ్లు మాత్రం నిలిచే ఉంటాయి. విషయం ఏదైనా ఆచితూచి మాట్లాడే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పోలవరం ప్రాజెక్టుపై ఒకటికి రెండు సార్లు ఎందుకు అత్యుత్సాహంగా మాట్లాడారనేదే ఇప్పటికీ అర్థం కాని విషయం.

Also Read : మరోసారి అలిగిన బుచ్చయ్య.. ఈసారి నిజంగానే రాజీనామా చేస్తారా..?