Idream media
Idream media
అయితే.. అన్నాడీఎంకే.. లేదా డీఎంకే.. తమిళనాడులో ఆ రెండు పార్టీలదే పాలన. ముఖ్యమంత్రిగా జయలలిత లేదా కరుణానిధి అన్నట్లుగా ఉండేది. సుమారు 11 ఏళ్లు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నారు. కరుణానిధి కూడా తమిళనాడు రాష్ట్రానికి ఐదుసార్లు (1969-71, 1971-74, 1989-91, 1996-2001, 2006-2011) ముఖ్యమంత్రిగా పని చేశారు. జయలలిత, కరుణానిధి ఇద్దరు ఇద్దరూ.. వారున్నంత కాలం తమిళనాడులో మరో పార్టీకి చోటు లేదు. వారి మరణం అనంతరం.. బీజేపీ ఆ రాష్ట్రంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తలొచ్చాయి. జయలలిత మరణం అనంతరం ఏర్పడ్డ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని రాష్ట్రంలో విస్తరించేందుకు కృషి చేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్నఅసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
తొలుత డీఎంకే పై దృష్టి
తమిళనాట ఎలాగైనా చక్రం తిప్పాలని భావిస్తున్న బీజేపీ తొలుత డీఎంకే లోని ప్రముఖ నేతలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీపై అసంతృప్తి ఉన్న వారిని తమవైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత మురుగన్ ఇప్పటికే డీఎంకే కు చెందిన పలువురు నేతలతో చర్చించారు. ఈ క్రమంలోనే చెన్నై థౌజెండ్ లైట్స్ డీఎంకే శాసనసభ్యుడు సెల్వం మంగళవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకున్నారు. వారిద్దరి మధ్య తమిళ రాజకీయాలపై చర్చ జరుగుతున్నట్లు తెలిసింది. అనంతరం రామ జన్మభూమిలో భూమిపూజకు వెళ్తున్న నరేంద్ర మోదీకి మద్దతు తెలుపుతూ శుభాకాంక్షలు చెప్పారు. అలాగే బీజేపీ సినీ గ్లామర్ పై బాగా దృష్టి పెట్టింది. కాంగ్రెస్ నేత, సినీ నటి ఖుష్బూ కూడా బీజేపీ లో చేరతారని కొద్ది రోజులక్రితం ప్రచారం జరిగింది. కానీ రాముడి భూమి పూజ రోజున ఆమె మోదీపై విమర్శనాత్మక ట్వీట్ తో ఆ ఆలోచన లేదనే సంకేతాలు ఇచ్చింది.
డీఎంకే ఎమ్మెల్యే సస్పెన్షన్..
బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమైన డీఎంకే ఎమ్మెల్యే సెల్వంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఓ ప్రకటన జారీ చేశారు. ఎమ్మెల్యే సస్పెన్షన్ వెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా సెల్వం చెన్నై వెస్ట్ జిల్లా శాఖ కార్యదర్శిపై ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆ పదవిని స్టాలిన్ వేరొకరికి కేటాయించారు. దీంతో సెల్వం కినుక వహించారు. అనంతరం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు మురుగున్ తో సెల్వం చర్చలు జరిపారు. నాటి నుంచీ ఆయనతో సన్నిహితంగా ఉంటున్నారు. ఇరువురూ కలిసే జేపీ నడ్డాను కలిశారు. ఈ నేపథ్యంలో సెల్వం పార్టీ వీడే అవకాశాలు ఉండడంతో స్టాలిన్ ముందుగా ఆయననే పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.