Idream media
Idream media
సుమారు మూడున్నర నెలల నుంచి వాయిదా పడుతూ వస్తున్న కేపీసీసీ అధ్యక్షుడిగా ట్రబుల్ షూటర్ డికె శివకుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణకు రంగం సిద్ధమైంది. మాజీ మంత్రి డికె శివకుమార్ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గురువారం (జూలై 2) బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరులోని పార్టీ కొత్త భవనం యొక్క సమావేశ మందిరంలో శివకుమార్ ఆన్‌లైన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ‘ప్రతిజ్ఞ దిన’ ఏర్పాటు చేయబడింది.
గత మార్చి 11 న పార్టీ వర్గాలలో “బుల్డోజర్” గా పిలువబడే, ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన డికె శివకుమార్‌ను రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా పార్టీ అధిష్ఠానం నియమించింది. కాగా లాక్‌డౌన్ మార్గదర్శకాలను పేర్కొంటూ రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం డికె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మూడు సార్లు అనుమతి నిరాకరించింది. దీంతో బహిరంగ సభలో లక్షలాది మంది పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ ప్రమాణం చేయాలనే ఆయన ఆకాంక్ష సాధ్యపడలేదు. కరోనా నేపథ్యంలో బహిరంగ సభలపై నిషేధం ఉన్నందున తన కోరికను వదిలిపెట్టని శివకుమార్ మెగా వర్చువల్ బహిరంగ సభలో బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించారు.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలందరూ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనే ఏర్పాట్లు చేసినట్లు శివకుమార్ తెలిపారు. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలు, బ్లాకులు, మునిసిపాలిటీలు మరియు నగర సంస్థల వార్డులలో 7,800 కి పైగా భారీ టెలివిజన్ తెరలు ఏర్పాటు చెయ్యబడ్డాయి. అలాగే ఈ కార్యక్రమం టెలివిజన్ న్యూస్ ఛానెల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుందని ఆయన ప్రకటించారు. ఇక వర్చువల్ పబ్లిక్ ఈవెంట్‌లో సుమారు 10 లక్షల మంది పాల్గొంటారని, ఇది పార్టీ చరిత్రలో అతిపెద్ద రికార్డుగా నిలిచిపోతుందని ఆయన పేర్కొన్నారు.
కరోనా వైరస్ దృష్ట్యా ఈ కార్యక్రమానికి పార్టీకి చెందిన కొద్దిమంది సీనియర్ నాయకులను మాత్రమే ఆహ్వానించారు. ఇక కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న దినేష్ గుండు రావు బాధ్యతల అప్పగింతకు చిహ్నంగా లాఠీని శివకుమార్‌కు అందజేస్తారు. గత డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత గుండు రావు అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
‘ ప్రతిజ్ఞ దిన ‘ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు,నాయకులు,ఎమ్మెల్యేలు,ఎంపిలు అందరూ పాల్గొని ” రాజ్యాంగ పీఠిక ” ను చదవనుండడం గమనార్హం.
శక్తివంతమైన వోక్కలింగ నాయకుడైన శివకుమార్ ప్రమాణస్వీకారం సందర్భంగా వివిధ మఠాలు, దేవాలయాల అధిపతులు అతని ప్రయత్నంలో విజయం సాధించాలని ఆశీస్సులు అందజేశారు. ఇక అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత నాయకులందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని కాంగ్రెస్ నాయకుడు డీకే ప్రకటించాడు.