iDreamPost
android-app
ios-app

ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూసిన వాళ్లకు నిరాశే..

  • Published Feb 05, 2022 | 9:24 AM Updated Updated Feb 05, 2022 | 9:24 AM
ఉద్యోగులను రెచ్చగొట్టాలని చూసిన వాళ్లకు నిరాశే..

ఏపీ రాజకీయాల్లో విపక్షాలకు అవకాశం లేకుండా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. తాజాగా పీఆర్సీ విషయంలో కూడా ప్రతిపక్షాలకు మింగుడుపడని రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. 11 వ పీఆర్సీ విషయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ , పెన్షనర్లలో ఉన్న అసంతృప్తిని సీఎం గుర్తించారు. దానికి తగ్గట్టుగా చర్చలకు మంత్రుల బృందం ఏర్పాటు చేశారు. తాజాగా స్వయంగా ఆయనే జోక్యం చేసుకున్నారు. సీఎం మంత్రుల బృందం భేటీ తర్వాత పరిణామాలు మారిపోయాయి. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించేందుకు సిద్ధమయ్యింది. భారీగా ప్రయోజనాలు కల్పించే దిశలో నిర్ణయం తీసుకుంటోంది. ఇది ఉద్యోగ వర్గాలకు ఊరట కల్పించబోతోంది.

ఇప్పటి వరకూ విపక్షాలు ముఖ్యంగా టీడీపీ ఉద్యోగులను రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేశాయి. సోషల్ మీడియాలోనూ, బయటా కూడా ఆపార్టీ నేతల తీరు దానికి తగ్గట్టుగా ఉంది. చివరకు చంద్రబాబు కూడా ఉద్యోగులకు మద్ధతు పలకడం ఆశ్చర్యం అనిపించింది. నిజానికి ఉద్యోగ వ్యతిరేకిగా చంద్రబాబుని అత్యధికులు భావిస్తున్నారు .ఆయన పాలనలో ఉద్యోగులను వేధించిన తీరు దానికి కారణం. చివరకు ఉద్యోగుల వేతనాలు, ఇతర రాయితీలు కూడా తగ్గించాలని, నియామకాలు నిలిపివేయాలని తన పుస్తకంలో రాసిన ఘనత కూడా చంద్రబాబుది. ఆ తర్వాత ఏబీఎన్ రాధాకృష్ణ ఇంటర్య్వూలో ఉద్యోగులను కించపరిచిన వాస్తవం రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి చంద్రబాబు కూడా ఉద్యోగులకు అండగా ఉంటామని పేర్కొనడం విచిత్రంగా మారింది. చివరకు తన హయాంలో వేయాల్సిన పీఆర్సీ ఇవ్వకుండా, జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్న తీరుని విస్మరించడం ఉద్యోగులను సైతం విశ్వసించలేని రీతిలో ఉంది.

చంద్రబాబుకి ఉద్యోగ సంఘాల్లో కొందరు నేతలు వత్తాసు పలుకుతున్నప్పటికీ అత్యధికంగా ఉద్యోగులు మాత్రం చంద్రబాబుని సహించే పరిస్థితి లేదు. అనేక సందర్భాల్లో పోస్టల్ బ్యాలెట్లలో వచ్చిన ఫలితాలు దానికి అద్దంపడతాయి. అయినప్పటికీ విపక్షం తన రాజకీయాల కోసం ఉద్యోగులను ఉసిగొల్పే ప్రయత్నానికి పూనుకుంది. వీటన్నింటికీ చెక్ పెట్టే రీతిలో తాజాగా సీఎం అడుగులు వేయడం బాబు అండ్ బ్యాచ్ కి మింగుడుపడేలా లేదు. విజయవాడ ర్యాలీ తర్వాత ప్రభుత్వానికి ఏదో అవుతుందని ఆశిస్తే తాజాగా సీఎం చొరవతో మారిన పరిణామాలు చంద్రబాబు , ఆయన అనుచరులను నిరాశలో ముంచేలా ఉన్నాయి. పీఆర్సీ వ్యవహారంలో సమ్మెకి దిగితే దాని చుట్టూ రాజకీయాలు సాగించాలని ప్రతిపక్షం ఆశించింది. కానీ దానికి విరుద్ధంగా సమస్యను పరిష్కరించేందుకు సీఎం సిద్ధం కావడంతో టీడీపీ నేతలకు జీర్ణం చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు.

రాష్ట్రంలో అనేక అంశాల్లో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికే చంద్రబాబుకి ఆశనిపాతంగా మారాయి. అనేక అంశాల్లో టీడీపీ ఆశలకు గండికొట్టాయి. ఉద్యోగుల అంశంలో కూడా మరోసారి అది రుజువయ్యింది. దాంతో చంద్రబాబు ఎత్తులు వేస్తే జగన్ పై ఎత్తుల ముందు అవన్నీ చిత్తవుతున్నాయనే అభిప్రాయం మరోసారి బలపడుతోంది. ఏపీ రాజకీయాల్లో టీడీపీకి అవకాశం దొరకడం లేదనడానికి ఇదో తాజా ఉదాహరణగా కనిపిస్తోంది.

Also Read : రేపటిలోగా అన్ని సమస్యలు పరిష్కారమవుతాయ్ – సజ్జల