Idream media
Idream media
రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘దిశ’ చట్టం తీసుకురావడంతో పాటు ప్రత్యేకంగా 18 ‘దిశ’ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. వీటిల్లో తొలిగా రాజమహేంద్రవరం ‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ఆయన ప్రారంభించనున్నారు. రాజమహేంద్రవరం స్వామి థియేటర్ ఎదురుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ‘దిశ’ పోలీసు స్టేషనుగా అభివృద్ధి చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతి ‘దిశ’ పోలీసు స్టేషన్‌కు ఇద్దరు డీఎస్పీలతో పాటు ఐదుగురు ఎస్సైలు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లతో పాటు అవసరమైన వాహనాలను సమకూరుస్తూ జనవరి 31న జీఓ 18 జారీ చేసిన విషయం విదితమే.
7న ప్రారంభించనున్న సీఎం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 7న ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి ఆదికవి నన్నయ యూనివర్సిటీకి చేరుకుంటారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా రూపొంచిన ‘దిశ’ యాప్‌ను, ‘దిశ’ పోలీసు స్టేషన్ల పనితీరుకు సంబంధించిన బుక్‌లెట్‌ను ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని 18 ‘దిశ’ పోలీసు స్టేషన్లకు సంబంధించిన అధికారులతో నిర్వహించే వర్క్‌షాప్‌లో సీఎం ప్రసంగిస్తారు. ఇందులో 500 మంది అధికారులకు, సిబ్బందికి ‘దిశ’ చట్టం విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వర్క్‌షాప్ జరుగుతుంది. సీఎం ప్రసంగం రాష్ట్రంలోని 1,100 పోలీసు స్టేషన్లలో ఉన్న సిబ్బంది తిలకించేలా.. ఏర్పాట్లు చేస్తున్నారు.