iDreamPost
iDreamPost
మెల్లగా ఓటిటిలో వస్తున్న సినిమాలు గాలి బుడగలుగా తేలిపోతున్నాయి. ఇవాళ విడుదలైన కీర్తి సురేష్ పెంగ్విన్ సైతం నెగటివ్ రివ్యూలతో పాటు బ్యాడ్ టాక్ తెచ్చేసుకుంది. సోషల్ మీడియాలోనూ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో వదలకుండా మంచి పని చేశారనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆల్రెడీ ఎన్నోసార్లు చూసిన కథను తెలిసిన ట్విస్టుతోనే దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ చేసిన ప్రయోగం టేకింగ్ పరంగా బాగానే ఉన్నప్పటికీ కంటెంట్ విషయంలో తేడా కొట్టడంతో ఆశించిన ఫలితం దక్కేలా కనిపించడం లేదు. నిజానికి నేరుగా నట్టింట్లోకి సినిమాలు వస్తున్నాయని సంబరపడటమే కానీ ఇప్పటిదాకా వచ్చినవేవి కనీస స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన మాట వాస్తవం.
అమితాబ్ బచ్చన్ అంతటి స్టార్ నటించిన గులాబో సితాబో సైతం పల్టీ కొట్టేసింది. అంతకు ముందు వచ్చిన జ్యోత్యిక పొన్మగళ్ వందాల్ యావరేజ్ అనిపించుకుందే తప్ప అద్భుతాలు చేయలేకపోయింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రెయిట్ రిలీజ్ చేసుకున్న వైభవ్ ఆర్కె నగర్ ఫలితమూ ఇంతే. అందరూ తిరస్కరించారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటంటే థియేటర్లు తెరిచినా ఆడేందుకు ఆస్కారం లేని చిత్రాల నిర్మాతలే ఓటిటి వైపు వెళ్తున్నారు. అందులోనూ బడ్జెట్ పరంగా పెద్ద రిస్క్ చేయనివి, రెండు మూడు లొకేషన్లలో తీసినవి మాత్రమే ఆన్ లైన్ లో వచ్చాయి. పైన చెప్పిన ఏ సినిమాలకూ కోట్లలో ఖర్చు కాలేదు. సదరు డిజిటల్ సంస్థలు ఆఫర్ చేసిన మొత్తంతో ఈజీగా లాభాలు తెచ్చుకున్నారు ప్రొడ్యూసర్ల.
ఎటొచ్చి ఇవి హాళ్లకు వచ్చి ఉంటే ప్రేక్షకుల జేబుకే చిల్లు పడేది. ఆ రకంగా కొంత ఊరట చెందొచ్చు. అదనంగా ఎలాంటి ఖర్చు, రిస్కు లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసే వెసులుబాటు ఉండటంతో వీటిని జనం బాగానే చూస్తున్నారు కానీ లేదంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. సో ఓటిటిలో ఏదో ఒక అద్భుతమైన సినిమా వస్తే తప్ప ఉత్సాహం రాదు. ఇప్పుడు నెక్స్ట్ క్యూలో విద్యా బాలన్ శకుంతలా దేవి, సత్యదేవ్ రెండు సినిమాలు 47 డేస్-ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య, నవీన్ చంద్ర భానుమతి రామకృష్ణ ఉన్నాయి. వీటిలోనైనా ఒకటో రెండోనైనా మెప్పిస్తే బెటర్. లేదా మూవీ లవర్స్ థియేటర్లు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ధర్నా చేయాల్సిందే.