iDreamPost
iDreamPost
ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. హైటెక్కు బాబు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు విస్మరించిన అంశంలో జగన్ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. టెక్నాలజీ విషయంలో ప్రచారం లేకుండానే పలు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. అందులో భాగంగా డిజిటల్ ఎంప్లాయింట్ మెంట్ ఎక్చేంజీలు ప్రారంభిస్తోంది. ఆగష్టు 15నాటికి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాలతో వాటిని అనుసంధానం చేయబోతున్నారు. మెడల్ కెరీర్ సెంటర్లుగా అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సచివాలయాల ద్వారా నిరుద్యోగులు తమ పేర్లను ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో నమోదు చేసుకునే సదుపాయం కల్పిస్తారు. ఆ తర్వాత వివిధ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మెసేజ్ రూపంలో వారికి అందించబోతున్నారు. తద్వారా పలు నియామకాల్లో అవకాశాలను నిరుద్యోగుల చెంతకు చేర్చేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జాబ్ మేళాలకు సంబంధించిన సమాచారం కూడా నేరుగా నిరుద్యోగులకు చేరేందుకు ఇది మార్గం సుగమం చేస్తోందని భావిస్తున్నారు.
ప్రస్తుతం ఎంప్లాయింట్ ఎక్చేంజీలు జిల్లా కేంద్రాలలో ఉంటున్నాయి. గతంలో వాటికి చాలా ప్రాధాన్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టకపోవడంతో వాటిపై దృష్టి తగ్గింది. కానీ మళ్లీ డిజిటల్ యుగంలో ఆన్ లైన్ లోనే తమ పేర్లు నమోదు చేసుకునే అవకాశం అన్ ఎంప్లాయిస్ కి దక్కుతున్న తరుణంలో ఇది మరోసారి పూర్వవైభవం సంతరించుకునే అవకాశం ఉంది. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజీలలో పేర్లు నమోదు కోసం సచివాలయంలోనే ఏర్పాట్లు చేయడంతో నిరుద్యోగులకు మరింత అందుబాటులో ఉంటుంది. అత్యధికులకు నేరుగా సమాచారం అందుతుంది. దాంతో ఉద్యోగాల భర్తీకి సంబందించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుని, వాటిని ఉపయోగించుకునే వీలుపడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా వివిధ ప్రైవేటు సంస్థల్లో నియామకాలకు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వికాస వంటి సంస్థల ద్వారా నియామకాలు చేస్తున్నారు. దానికోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు వాటికి సంబంధించిన సమాచారం అంతా నేరుగా ఆశావాహులకు చేరేందుకు అవకాశం ఉండడంతో ఎక్కువ ఉపయోగం ఉంటుందనే అభిప్రాయం వినిపిస్తోంది. నిరుద్యోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందనే అంచనాలున్నాయి.
Also Read : జగన్ ఐడియాను అనుసరిస్తున్న మరో రాష్ట్రం