iDreamPost
iDreamPost
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారి పల్లెలో బాబు భూమి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న వార్తలు నిన్న మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో అందరి దృష్టి అటువైపు తిరిగింది . యథావిధిగా దీని వెనక వైసీపీ పెద్దలున్నారని కొన్ని చానెళ్లు నిర్విరామంగా కథనాలు ప్రసారం చేయగా , ప్రజల్లో సానుభూతి కోసం టీడీపీ , అనుకూల మీడియా కలిసి ఆడుతున్న మరో నాటకం అయ్యుండొచ్చని పలువురు విశ్లేషకులు ఈ వార్తని కొట్టిపారేశారు . ఈ అంశం పై చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు భార్య ఇందిరమ్మ చంద్రగిరి తహసీల్దార్ కు ఫిర్యాదు చేయగా సదరు భూమికి హద్దులు ఏర్పాటు చేస్తున్న రాజేంద్ర నాయుడు తల్లి సిద్దమ్మ పేరిట ఉందని రికార్డుల ప్రకారం ఈ భూమి వారిదేనని తేల్చి చెప్పారు .
వివరాల్లోకి వెళితే చంద్రబాబు నాయుడు 1989 లో తన సమీప బంధువు అయిన నారా కృష్ణమూర్తి నాయుడిని రాజకీయ అవసరాలకోసం భూమికావాలని కోరగా గ్రామంలో తనకున్న భూమిలో కొంత భాగాన్ని కృష్ణమూర్తి నాయుడు బాబు తండ్రి ఖర్జూరనాయుడు పేరిట బదలాయించడమూ సదరు భూమిని ఖర్జూరనాయుడు బాబు సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి , టీటీడీ కళ్యాణ మండపాల నిర్మాణానికి ఇచ్చి రిజిస్టర్ చేయడమూ జరిగింది . ఈ రెంటి నిర్మాణానికి అవసరమైన భూమి కృష్ణమూర్తి నాయుడి పొలం నుండి ఖర్జూర నాయుడి పేరిట బదలాయించిన తర్వాత ఇంకా ముప్పై ఎనిమిది సెంట్లు కృష్ణమూర్తి నాయుడి పేరిట మిగిలి ఉంది . ఆయన తదనంతరం ఆ భూమి ఆయన భార్య సిద్దమ్మ పేరిట రెవిన్యూ రికార్డుల్లో నమోదై ఉంది .
అయితే ఆ భూమిలో కొంతభాగం ఖర్జూరనాయుడు కొనుగోలు చేసిన నాటి నుండి మిగిలి ఉన్న ముప్పై ఎనిమిది సెంట్లని కూడా తమ అవసరాలకు వాడుకోనారంభించారు బాబు కుటుంబం . చంద్రబాబు ఎప్పుడు నారావారిపల్లె వెళ్లినా ఈ ఖాళీ స్థలంలోనే వాహనాలు పార్క్ చేస్తారని , విడి రోజుల్లో బాబు వర్గీయులు క్రీడాస్థలంగా వాడుకొంటారని గ్రామస్థులు చెబుతున్నారు .
గత రెండు రోజులుగా నారా కృష్ణమూర్తి నాయుడి తనయుడు రాజేంద్ర నాయుడు ఆ ముప్పై ఎనిమిది సెంట్ల భూమికి హద్దులు ఏర్పరచుకొని ఇంటి నిర్మాణానికి సంకల్పించడంతో చంద్రబాబు భూమి కబ్జాకు గురయ్యిందనే వార్తలు గుప్పుమన్నాయి . ఇదే అదనుగా ఏబీఎన్ , మరికొన్ని టీడీపి అనుకూలమీడియా వర్గాలు చంద్రబాబు భూమి కబ్జా వెనుక వైసీపీ గద్దల హస్తం అంటూ భారీ హెడ్డింగ్ లతో వార్తా ప్రసారాలు వెలువడ్డాయి .
తర్వాత మీడియాతో మాట్లాడిన కృష్ణమూర్తి నాయుడి కోడలు రాణి తన మామ భూమిని చంద్రబాబు తండ్రికి ఇచ్చిన మాట వాస్తవమే అని అలా ఇవ్వగా మిగిలిన భూమి ముప్పై ఎనిమిది సెంట్లు కూడా చంద్రబాబు కుటుంబం ఇన్నాళ్లు వాడుకొంటూ వచ్చిందని ఆ భూమితో తమకు అప్పుడు అవసరం లేనందున తన మామ కృష్ణమూర్తి , భర్త రాజేంద్ర నాయుడులు బంధువులే కదా అనే ఉద్దేశ్యంతో వాడుకోవటానికి అభ్యంతరం తెలపలేదని ఇప్పుడు తమ బిడ్డల కోసం ఇంటి నిర్మాణం చేయటానికి మా భూమి మేము స్వాధీనం చేసుకొంటుంటే ఇలా కబ్జా చేశారంటూ వార్తలు ప్రసారంచేయడం దారుణమని వాపోయారు . చంద్రబాబు నాయుడుతో తమకేమీ శత్రుత్వం లేదని ఈ విషయాలు వారికీ తెలుసని కానీ కొందరు వ్యక్తులు , మీడియా పనిగట్టుకుని ఇలా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారో తెలియడంలేదన్నారు .
కొసమెరుపు ఏంటంటే ఈ భూమి 1989 లో చంద్రబాబు కొనుగోలు చేేశాడు అని మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది కానీ , నిజానికి ఈ భూమి బాబు కొనుగోలు చేసి ఆయన పేరిట ఉండి ఉంటే నాటి నుండి నేటి వరకూ ఏ ఎన్నికల అఫిడవిట్ లోనూ బాబు ఈ ఆస్తి విషయం ప్రస్తావించలేదు . అంతేకాదు ప్రతి ఏటా పారదర్శకత పేరిట తమ కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే లోకేష్ ఎన్నికల అఫిడవిట్ లో కానీ , ప్రకటించిన కుటుంబ సభ్యుల ఆస్తులలో కానీ ఈ భూమి ప్రస్తావన లేదు . ప్రస్తుతం ఎల్లో మీడియా చెబుతున్నట్టు ఈ భూమి చంద్రబాబు కొనుగోలు చేసి ఉంటే ఆ విషయాన్ని 1989 నుండి దాచిపెట్టి ఎన్నికల కమిషన్ ని , ఆదాయ పన్ను శాఖని నిరంతరం వంచిస్తూ వచ్చారనుకోవాలి . దీనిపై బాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి .
మరోవైపు బాబు స్థలం కబ్జాకు గురైందంటూ తొలుత ఫిర్యాదు చేసిన నారా రామ్మూర్తి నాయుడి సతీమణి ఈ పరిణామాలన్నింటి తర్వాత సదరు భూమిని రాకేష్ నాయుడు అనే వ్యక్తి వద్ద నుండి తాను కొనుగోలు చేసినట్లు కొన్ని వ్యక్తిగత ఒప్పంద పత్రాలను చంద్రగిరి తహశీల్దార్ పరిశీలన నిమిత్తం పంపారని కొన్ని పత్రికల కథనం . దీన్ని బట్టి చూస్తే బాబు ఏ అఫిడవిట్ లోనూ తన ఆస్తిగా చూపకుండా స్థలం యజమానులకు ఏమీ చెల్లించకుండా ఉచితంగా ఆక్రమించిన స్థలం ఈ రోజు చేజారిపోతుండటం , నాది అనటానికి ఆధారాలు లేకపోగా , ఎన్నికల కమిషన్ ఎదురు దోషిగా నిలబడాల్సిన ప్రమాదం ఉండటంతో వ్యూహాత్మకంగా అప్పటికప్పుడు తమ్ముడి భార్య ఇందిరమ్మ , రాకేష్ నాయుడిల పేరిట నకిలీ ఒప్పంద పత్రాలు సృష్టించి ఉండవచ్చని పలువురు అనుభవజ్ఞులు అనుమాన పడుతున్నారు .
Also Read : ‘గంటా’పై ఆశలు వదులుకున్న చంద్రబాబు..!