కమెడియన్ గా టాప్ గేర్ లో హైవే మీద వెళుతూ సడన్ గా హీరో అవ్వాలనుకుని రూటు మార్చాడు. ఆ దారి ఎంత కష్టంగా ఉంటుందో అనుభవమైంది. బండి ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. అందుకే మళ్లీ కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. అందరూ సంతోషిస్తున్న ఈ తరుణంలో “డిస్కో రాజా”లో విలన్ పాత్ర ఒకటి చేసాడు మన సునీల్ బాబు. సెకండ్ ఇన్నింగ్సులో కమెడియన్ గా మళ్లీ నిలదొక్కుకుంటే బాగుండు అని కోరుకుంటున్న వాళ్లు కూడా ఈ విలనీ చూసి ఇదెక్కడి గొడవరా బాబు అనుకుంటున్నారు. దానికి పూర్తిగా సునీల్ ని బాధ్యుడిని చెయ్యలేం. దర్శకుడుకి కూడ పెద్ద పాత్రే ఉంది. అరకొరగా రాసుకున్న ఈ క్యారెక్టర్ తెర మీద రంజింపచేయడం సునీల్ వల్ల కాలేదు. విలన్ గా సునీల్ ప్రామిసింగ్ గా నిలబడతాడు అని ఏ కోసైనా అనిపించలేదు. ఇటువంటి వింతప్రయోగాలు చెయ్యకుండా చక్కగా దగ్గరుండి మంచి కామెడీ ట్రాకులు రాయించుకుని కమెడియన్ గా నిలబడడం మంచిదని అతని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కామెడీలో సునీల్ కి ఒక స్టార్ స్టాటస్ ఉంది. అది అంత ఈజీగా కూలిపోయేది కాదు. ఉన్న బలం మీద ఎదగాలి కానీ, పక్కనోడి బలాన్ని చూసి ఉన్న బలాన్ని పక్కనబెట్టడం సరైంది కాదు అని సునీల్ శ్రేయోభిలాషులు చెవులు కొరుక్కుంటున్నారు.