iDreamPost
iDreamPost
రాష్ట్రాల వారీగా ప్రాంతీయ పార్టీల చేతుల్లో గట్టి దెబ్బతింటున్న బీజేపీ, అదే జాతీయ స్థాయికొచ్చేసరికి, రాహూల్ గాంధిని, కాంగ్రెస్ పార్టీని పోటీదారునిగా చూపించి ఘన విజయాన్ని సాధిస్తోంది. అందుకే సోనియా, రాహూల్ గాంధికాకుండా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ పార్టీని 2024లో నడిపించడం కాంగ్రెస్ కు మంచిదేనా?
2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నాయకత్వం వహించి, సర్వసైన్యాధ్యక్షుడిగా కాంగ్రెస్ సైన్యాన్ని నడిపించాలన్నది కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరిక అన్నది, మీడియా నివేదికల సారాంశం.
ఒకవేళ సోనియాగాంధీ ఈ కోరిక కోరితే అశోక్ గెహ్లాట్ నో చెప్పలేరు. ఆయన రాజకీయ జీవితంలో ఇది ముఖ్యమైన ప్రమోషన్. నిజానికి ఏ కాంగ్రెస్ నాయకుడూ గాంధీకి నో చెప్పడు, అందులోనూ గాంధి కుటుంబ విధేయుడైన గెహ్లాట్ అస్సలు చెప్పకూడదు. అందుకే “ఇవన్నీ” తాను మీడియా నుండి మాత్రమే వింటున్నానని, తనకు అప్పగించిన విధులను నిర్వర్తిస్తున్నానని చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ సీనియర్ పరిశీలకుడిగా, మోదీ సొంత రాష్ట్రంలో మేజిక్ చేయాలనుకొంటున్నారు.
రాహుల్ గాంధీ పార్టీ ఏకగ్రీవ నాయకుడిగా కొనసాగుతున్నారని ఆయన చెప్పిన ఒక రోజు తర్వాత, గెహ్లాట్ ను సోనియా కలిశారు. ఇది అంతర్గత సమావేశం. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారో ఎవరూ చెప్పరు. రాహూల్ రాజకీయ గురుబృందంలో గెహ్లాట్ కూడా ఒకరు. అందవల్ల కాంగ్రెస్ అత్యున్నత పదవిమీద చాలా ఆసక్తి ఉన్నట్లు కనిపించాలని ఆయన కోరుకోరు.
సోనియా గాంధీకి ఆరోగ్యం బాగాలేదు. వైద్య పరీక్షల కోసం విదేశాల్లో ఉండాల్సివస్తోంది. అందుకే తనకు బదులుగా పూర్తిస్థాయి పార్టీ అధ్యక్షుడు కావాలని ఆమె కోరుకొంటున్నారు. పాతికేళ్లుగా కాంగ్రెస్‌ను సోనియా లేదంటే రాహుల్ గాంధీ నడిపిస్తున్నారు. అలాగని పాపువర్ లీడర్ అని చెప్పి ఎవరిని పడితే వాళ్లను అధ్యక్షులుగా చేయలేరు. కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాక గాంధీ విధేయులను ఎలా సీతారం కేసరీ పక్కనపెట్టారో సోనియాకు తెలుసుకదా!
రాహుల్ గాంధీ ఒకప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా, ఆయన పనితీరు పార్టీ కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇవ్వలేదు. ఆయన ట్రాక్ రికార్డు చాలా యావరేజ్. ఆయన ముందుండినడిపించిన ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడిపోయింది. పోనీ రాష్ట్రాల్లో గెల్చినా ఆ క్రెడిట్ ఆ రాష్ట్ర నాయకులది కాని, రాహూల్ దికాదు. పంజాబ్ లో అమరీందర్ సింగ్ , మధ్యప్రదేశ్‌కు దిగ్విజయ సింగ్ , ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్ బఘెల్ , రాజస్థాన్‌లో గెహ్లాట్ వంటి ప్రాంతీయ నాయకులకే క్రెడిట్ దక్కింది. నిజానికి అక్కడ వాళ్ల పలుకుబడే ఎక్కువ. రాహూల్ వాళ్లకు జూనియర్ కిందే లెక్క. మరి రాహూల్ సాధించింది ఏంటి? కనీసం పార్టీలో సంస్కరణలు తీసుకొస్తారని అనుకున్నా, అదికూడా సాధించలేకపోయారు.
తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తే ఎలా కసీఆర్ చెలరేగిపోతారో, జాతీయ రాజకీయాల్లో మోదీ అంతే. ఎదురుగా గాంధీ వారసులు కనిపిస్తే, మోదీ నిప్పులు చెరుగుతారు. ఎన్డీయే ప్రభుత్వం అవినీతిమయమని ముద్ర వేస్తే, మోదీ బోఫోర్స్ లేవనెత్తుతారు. మీరు నియంతలా పాలిస్తున్నారని ప్రధానమంత్రిని ఎద్దేవచేస్తే, ఎమర్జెన్సీ సంగతిని మోదీ ముందుకుతెస్తారు. విదేశాంగ విధానంలో మీరు విఫలమైయ్యారంటే అన్ని సమస్యలకు కారణం జవహర్ లాల్ నెహ్రూ చైనా పట్ల వ్యవహరించిన తీరేనంటూ సమస్యను దారిమళ్లిస్తారు. అందుకే గాంధి కుటుంబం మోదీని ఎదుర్కొనలేదని, వాళ్లకు వారసత్వ రాజకీయ సమస్యలున్నాయని నిపుణులు అనేది.
ఇప్పుడు గాంధికుటుంబం కనుక గెహ్లాట్ ను పార్టీ అధ్యక్షుడిని చేస్తే, ఉత్తరభారతంలో గట్టి వాయిస్ వినిపిస్తుంది. గాంధీ కుటుంబ సమస్యలను లేవనెత్తే అవకాశం బీజేపీకి ఉండదు. అప్పుడు కాంగ్రెస్ కనీసం పోటీ అయినా ఇవ్వగలదన్నది రాజకీయ నిపుణుల అంచనా.