iDreamPost
android-app
ios-app

కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేసేలా ఈనాడు యాజమాన్యం ప్రవర్తించిందా?

  • Published Sep 01, 2021 | 1:47 AM Updated Updated Sep 01, 2021 | 1:47 AM
కార్టూనిస్ట్ శ్రీధర్ రాజీనామా చేసేలా ఈనాడు యాజమాన్యం ప్రవర్తించిందా?

కార్టూనిస్ట్ శ్రీధర్ తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి 24గంటలు గడిచినా ఆయన చుట్టూ చర్చ మాత్రం చల్లారడం లేదు.. గతంలో ఆయన వేసిన కార్టూన్లను దృష్టిలో పెట్టుకుని కొందరు విమర్శలు చేస్తున్నారు. మరికొందరు శ్రీధర్ లేని ఈనాడు బోసిపోయినట్టేననే వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అదే సమయంలో శ్రీధర్ లాంటి వ్యక్తి ఈనాడు నుంచి బయటకు వస్తున్నప్పుడు బహిరంగంగా రాజీనామా నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఏముందంటూ కొందరు ఈనాడు సమర్థకులు వాదిస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు భిన్నవాదనలకు కారణమవుతోంది.

శ్రీధర్ నిజంగా ఈనాడు నుంచి బయటకు వచ్చేశారా లేదా ఆయనకు పొగబెట్టారా? అన్నది పెద్ద ప్రశ్న. గడిచిన కొన్ని రోజులుగా ఆయన విధులకు హాజరవుతూ, కార్టూన్లు సిద్ధం చేస్తున్నా వాటిని ముద్రించకపోవడంతో శ్రీధర్ మనసు నొచ్చుకున్నట్టు ప్రచారంలో ఉంది. దానిని శ్రీధర్ ఖండించలేదు. అదే సమయంలో శ్రీధర్ పట్ల ఈనాడు యాజమాన్యం వదిలించుకునే ధోరణిలో వ్యవహరించిన మూలంగానే ఆయన బయటకు వచ్చేశారనే కథనాలు కూడా వస్తున్నాయి. రామోజీరావు వ్యూహాత్మకంగా శ్రీధర్ ని సాగనంపేశారని అంటున్నారు. 40 ఏళ్ల పాటు పనిచేసిన ఉద్యోగి రిటైర్మెంట్ గానీ, ఇతర పద్ధతుల్లో బయటకు వెళితే చట్ట ప్రకారం ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ వేరుగా ఉండేవని, కానీ రామోజీరావు పాచిక పారడంతో శ్రీధర్ బయటకు రావడం ఈనాడు అధినేతకు కలిసివచ్చినట్టేనని కొందరి అంచనా.

శ్రీధర్ కుటుంబీకులు మాత్రం అంతర్గత విషయాలను వెల్లడించడానికి సిద్ధపడడం లేదు. కేవలం అందరి ఉద్యోగుల మాదిరిగానే ఆయన వయసు భారంతో బాధ్యతల నుంచి తప్పుకున్నారనే వాదన చేస్తున్నారు. అదే నిజమైతే ఆయన రాజీనామా చేశాననే విషయాన్ని బాహాటంగా ప్రదర్శించాల్సిన అవసరం ఉండేది కాదు అంతేగాకుండా గడిచిన రెండు వారాలుగా ఆయన కార్టూన్లు మాయమవ్వాల్సిన స్థితి ఉండేది కాదు. కానీ కేవలం శ్రీధర్ కార్టూన్ల జీవితానికి ఈనాడులో 40 ఏళ్లు నిండిన వెంటనే బయటకు రావాల్సిన పరిస్థితి ఎదురుకావడం మాత్రం విస్మయకరంగా కనిపిస్తోంది.

శ్రీధర్ ని సాగనంపేశారనే వాదన సాగుతుండగానే రామోజీరావు సంస్థల పట్ల అభిమానంతో ఉండే సెక్షన్ మరో వాదన చేస్తోంది. శ్రీధర్ అసలు తన రాజీనామా బహిరంగంగగా ప్రకటించడం ద్వారా రామోజీరావుని బద్నాం చేసే ప్రయత్నం చేశారన్నది వారి ఆరోపణ. అంతపెద్ద స్థాయి కల్పించి, అన్ని రకాలుగా అవకాశాలిచ్చిన సంస్థ మీద ఇలాంటి ప్రకటనలు సరికాదని వారు చెబుతున్నారు. ఉద్యోగం వదిలి వచ్చేస్తే అందరికీ క్రమంగా అర్థమయ్యేదని, కానీ శ్రీధర్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే రాజీనామా చేస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టు ద్వారా చర్చ పేరుతో రచ్చ చేయాలనే సంకల్పంంతో ఉన్నారని వారు సందేహిస్తున్నారు.

ఏమయినా శ్రీధర్ ఉద్దేశాలు, లక్ష్యాలు ఎలా ఉన్నప్పటికీ ఆయన రాజీనామా వ్యవహారం మాత్రం అందరి దృష్టిని ఈనాడు వ్యవహారాల చుట్టూ మళ్లించింది. రామోజీరావు ప్రస్థానంలో సాగిన అనేక తొలగింపులు, సాగనంపడాలు వంటివి ప్రస్తుతం చర్చల్లోకి వస్తున్నాయి