iDreamPost
android-app
ios-app

బుచ్చయ్య రాజీనామా ,దుర్గేష్ ఎమ్మెల్యే ఆశలు– పెద్ద ప్లానే ఉన్నదే…!

బుచ్చయ్య రాజీనామా ,దుర్గేష్ ఎమ్మెల్యే ఆశలు– పెద్ద ప్లానే ఉన్నదే…!

ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య కేంద్రం, తూర్పుగోదావరి జిల్లా రాజకీయ కేంద్రమైన రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల స్థానికంగా తెలుగుదేశం పార్టీలో జరిగిన వివాదమే ఈ చర్చకు మూల కారణం.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఆమె మామ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల మధ్య సిటీ నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం మొదలైన వివాదం తెలుగుదేశం పార్టీలో అలజడిని రేపింది.టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే.. తన సీటు గల్లంతవుతుందనే ఆందోళనతోనే సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సిటీపై ఆధిపత్యం కోసం ఇటీవల రాజీనామా ఎపిసోడ్‌ నడిపించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఈ విషయాన్ని ఆసక్తిగా గమనించారు.

ఈ వివాదం ప్రస్తుతానికి ముగిసింది. అయితే ఈ పరిణామం తర్వాత.. జనసేన పార్టీ నేత, గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కందుల దుర్గేష్‌ గురించి చర్చ మొదలైంది. కందుల దుర్గేష్‌కు అసెంబ్లీలో అడుగుపెట్టాలనేది చిరకాల ఆకాంక్ష. 2024లో దుర్గేష్‌ కోరిక ఫలిస్తుందనే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో క్రియాశీలకంగా పని చేస్తోంది. దుర్గేష్‌తో సహా నేతలందరూ ఉత్సాహంగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో పొత్తును టీడీపీ కోరుకుంటోందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్‌ సీటు జనసేనకు కేటాయిస్తారని, కాపులు అధికంగా ఉన్న రూరల్‌లో దుర్గేష్‌ గెలుస్తారనే లెక్కలు వేసుకుంటున్నారు.

Also Read : ‘మార్కాపురం’ భూముల స్కామ్ ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా..!

2019 ఎన్నికల్లో దుర్గేష్‌ జనసేన తరఫున రాజమహేంద్రవరం రూరల్‌ నుంచి పోటీ చేసి 42,695 ఓట్లు సంపాదించారు. టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన బుచ్చయ్య చౌదరికి 74,166 ఓట్లు, రెండో స్థానంలో నిలిచిన వైసీపీ అభ్యర్థి, ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్‌ ఆకుల వీర్రాజుకు 63,752 ఓట్లు లభించాయి. వైఎస్‌ జగన్‌ హవాలోనూ దుర్గేష్‌ జనసేన అభ్యర్థిగా 42,695 ఓట్లు సంపాధించి అందరి దృష్టి ఆకర్షించారు. టీడీపీ–జనసేన పొత్తుతో ఉమ్మడి అభ్యర్థిగా దుర్గేష్‌ పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని దుర్గేష్ వర్గం అంచనాలు వేస్తుంది .

మాజీ ఎంపీ ఉండవల్లి అనుచరుడుగా ఉన్న కందుల దుర్గేష్‌కు వైఎస్‌ హాయంలో ఎమ్మెల్సీ పదవికి దక్కింది. 2007–2013 వరకు ఎమ్మెల్సీగా పని చేశారు. దుర్గేష్‌ రాజమహేంద్రవరం సిటీలో నివాసం ఉంటున్నా.. ఆయన రాజమహేంద్రవరం రూరల్‌ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా దుర్గేష్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కొంతకాలం పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఆ పార్టీ గ్రేటర్‌ రాజమహేంద్రవరం అధ్యక్షుడుగా, రాజమహేంద్రవరం రూరల్‌ సంయుక్త కో ఆర్డినేటర్‌గా పనిచేశారు.

వైసీపీలో చేరేటప్పుడు తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టారు. రాజమహేంద్రవరం రూరల్‌ సీటు ఆశించే తాను వైసీపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. అయితే కొంత కాలానికే దుర్గేష్‌ వైసీపీని వీడాల్సి వచ్చింది. పార్టీలో స్థానికంగా ఉన్న నాయకత్వంతో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఉన్న వైరం.. ఆయన్ను వైసీపీలోనూ వెంటాడింది. వాళ్లతో వేగలేనంటూ అనునూయులు, మీడియా ప్రతినిధులతో చెప్పి వాపోయిన దుర్గేష్‌.. ఏడాది తిరగకముందే వైసీపీని వీడి జనసేనలో చేరారు. వైసీపీ అధిష్టానం బుజ్జగించినా స్థానిక పరిస్థితుల కారణంగా తాను కొనసాగలేనంటూ వైసీపీ పెద్దలకు దుర్గేష్‌ వివరించారు. ఎమ్మెల్యే కావాలనే దుర్గేష్‌ బలమైన ఆకాంక్ష ప్రస్తుతం రాజమహేంద్రవరంలో జరుగుతున్న చర్చ ప్రకారం 2024లోనైనా నెరవేరుతుందా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : నడిపించే నాయకుడు కావలెను!