iDreamPost
android-app
ios-app

రేవంత్ రెడ్డి కి ఎసరు పెడుతున్న బీజేపీ బర్నింగ్ స్టార్లు…

  • Published Nov 25, 2020 | 2:29 AM Updated Updated Nov 25, 2020 | 2:29 AM
రేవంత్ రెడ్డి కి ఎసరు పెడుతున్న బీజేపీ బర్నింగ్ స్టార్లు…

తెలంగాణా రాజకీయాల్లో రేవంత్ రెడ్డిది ప్రత్యేక స్థానం. వివిధ పార్టీలు మారుతూ ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. అక్కడ కూడా స్థిరంగా ఉంటారా అనే ప్రశ్నకు ప్రస్తుతానికి సమాధానం లేదు. అయితే ఆయన రాష్ట్ర స్థాయి రాజకీయ నేతగా ఎదగడానికి దోహదపడిన దూకుడు ఇప్పుడు చిన్నబోతోంది. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసినట్టుగా రేవంత్ రెడ్డిని మించి బీజేపీకి చెందిన బర్నింగ్ స్టార్లు తయారయ్యారు. ఇన్నాళ్లుగా రేవంత్ రెడ్డికి ఉన్న గుర్తింపునకు ఎసరు పెడుతున్నారు. అనుముల రేవంత్ రెడ్డి అనగానే మండిపడే కేసీఆర్ ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. అందుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి కన్నా మించి ధర్మపురి అరవింద్, బండి సంజయ్ వంటి నేతలు తయారుకావడమే. కేసీఆర్ కి వ్యతిరేకంగా వారు నోరు పారేసుకుంటున్న తీరు ఉండడమే.

రేవంత్ రెడ్డి కి సామాజిక అండదండలు, చంద్రబాబు వంటి వారి తోడ్పాటు అనేకం ఉన్నప్పటికీ అన్నింటికీ మించి ఆయన వాగ్దాటి పెద్ద వనరుగా చెప్పవచ్చు. ఆయన చేసిన కామెంట్స్ తోనే రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సెంటర్ పాయింట్ అయ్యేవారు. చాలామంది కేసీఆర్ ని విమర్శించేందుకు సతమతమయ్యే దశలో రేవంత్ రెడ్డి ఎదురొడ్డారు. అనేక ఆటంకాలు ఎదురయినా తన దూకుడు తగ్గకుండా చూసుకున్నారు. కేసీఆర్ కుటుంబం మీద ఎవరూ చేయలేనన్ని విమర్శలు చేశారు. అటు జూపల్లి రామేశ్వరరావు, ఇటు కేసీఆర్ ని ఢీకొట్టేందుకు వెనుకాడలేదు. సంచలన ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉండేవారు. అదే సమయంలో కేసీఆర్ వ్యతిరేకులందరికీ రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడిగా మారారు. కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డే అన్నట్టుగా తయారయ్యాడు. తద్వారా రాష్ట్ర రాజకీయాల్లోనే కీలక నేతగా ఎదిగేందుకు అలాంటి ఇమేజ్ రేవంత్ రెడ్డికి ఎంతో ఉపయోగపడింది.

తీరా తాజా రాజకీయాల్లో సీన్ మారిపోతోంది. రేవంత్ రెడ్డిని మించి బీజేపీ నేతలు నోటికి పనిచెబుతున్నారు. రేవంత్ రెడ్డి ఎన్నడూ సాహించని స్థాయిలో వారు చెలరేగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని అమిత్ షా వంటి నేతల అండదండలు పుష్కలంగా ఉండడంతో కేసీఆర్ ని ధీటుగా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారు. అదే సమయంలో మున్నూరు కాపు సామాజిక నేపథ్యం కూడా వారికి ఉపయోగపడబోతోంది. రెడ్డి, వెలమ రాజకీయాలకు భిన్నంగా బీసీ కార్డ్ తో ఈ నేతలు రెచ్చిపోతున్నట్టు కనిపిస్తోంది. ఓవైపు కులం, రెండో వైపు మతం కార్డు వారికి రెట్టించిన ఉత్సాహాన్నిస్తోంది. ఇదే ఇప్పుడు అరవింద్, బండి సంజయ్ ల నోటి దూకుడుకి దారితీస్తోంది. కేసీఆర్ ని, ఆయన కుటుంబ సభ్యులను చెడామెడా కామెంట్ చేసే స్థాయికి చేరింది.

ఈ పరిణామాలు బీజేపీ నేతలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నాయి. అదే సమయంలో రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నాయి. ఇన్నాళ్లుగా రేవంత్ కి దక్కిన ప్రత్యేక ఇమేజ్ కి దెబ్బ కొడుతున్నాయి. ముఖ్యంగా అరవింద్ వంటి నేతల మాట తీరు మూలంగా రేవంత్ రెడ్డి వాగ్దాటి తేలిపోతోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పు డు రేవంత్ రెడ్డి స్థానాన్ని వారు స్వాధీనం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఇది కూడా ఓ కీలకాంశంగా చెప్పవచ్చు. దాంతో రేవంత్ రెడ్డి ఇమేజ్ కుచించుకుపోయే ప్రమాదం ఉంది. ఒకనాడు కేసీఆర్ కి ప్రత్యామ్నాయం తానేనని భావించిన ఆయనకు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారే పరిణమించే అవకాశం ఉంది. ప్రజల్లో ఇన్నాళ్ళుగా ఉన్న ఇమేజ్ కి డ్యామేజ్ జరుగుతున్న తరుణంలో ఎలాంటి వ్యూహాలతో నెట్టుకు వస్తారో చూడాలి. లేదంటే బీజేపీ హవాలో కాంగ్రెస్ కొట్టుకుపోతున్నట్టుగానే ఆ ఇద్దరు ఎంపీల ఇమేజ్ తో కాంగ్రెస్ ఎంపీకి కష్టాలు అనివార్యంగా చెప్పవచ్చు.