iDreamPost
iDreamPost
ఊహించని కాంబినేషన్ తెరపైకొస్తోంది. సున్నితమైన కథాంశాలతో ఫ్యామిలీ అండ్ యూత్ ఆడియన్స్ ని మెప్పించే దర్శకుడు శేఖర్ కమ్ముల తమిళ స్టార్ హీరో ధనుష్ తో చేతులు కలపడం ఆసక్తి రేపుతోంది. ఇటీవలి కాలంలో ఎక్కువగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్న ధనుష్ ఇప్పుడు శేఖర్ కమ్ములకు ఎస్ చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీన్ని ఆసియన్ సంస్థ బ్యానర్ పై సునీల్ నారంగ్ తో పాటు పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మించబోతున్నారు. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియా సర్కిల్స్ లో ప్రచారంలో ఉన్నప్పటికీ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఇది పాన్ ఇండియా సినిమానే. తెలుగు తమిళం హిందీలో సమాంతరంగా రూపొందిస్తారు. ధనుష్ కాబట్టి మూడు చోట్లా మార్కెట్ ని వర్కౌట్ చేసుకోవచ్చు. గత కొంత కాలంగా కేవలం డబ్బింగులతోనే తెలుగు వాళ్ళను పలకరిస్తున్న ధనుష్ చేయబోతున్న మొదటి టాలీవుడ్ స్ట్రెయిట్ మూవీ ఇదే అవుతుంది. వంశీ పైడిపల్లితో దిల్ రాజు నిర్మించబోయే సినిమాతో విజయ్ తెలుగు రంగప్రవేశం చేస్తున్న తరుణంలోనే ఇప్పుడీ ప్రకటన రావడం విశేషం. చూస్తుంటే ఆరవ హీరోలు ఒక్కొక్కరుగా తెలుగు మార్కెట్ మీద గట్టి కన్నేసినట్టు కనిపిస్తోంది. జాతీయ స్థాయిలో మన సినిమాల స్థాయి పెరగడం దానికి కారణం కావొచ్చు.
శేఖర్ కమ్ముల కొత్త సినిమా లవ్ స్టోరీ విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు తెరుచుకున్నాక రిలీజ్ డేట్ ని ప్రకటించబోతున్నారు. ఇప్పటిదాకా ఈయన చేసినవన్నీ ఎమోషనల్ స్టోరీలే. మరి ధనుష్ తో కూడా అలాంటిదే చేయబోతున్నారా లేక డిఫరెంట్ గా ఏదైనా మాస్ సబ్జెక్టుని తీసుకున్నారా వేచి చూడాలి. హీరోయిన్ విలన్ సంగీత దర్శకుడు తదితర వివరాలు ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నాయి. మరోవైపు ధనుష్ ఇవాళ ఓటిటిలో రాబోతున్న జగమే తంత్రంతో పలకరింబోతున్నాడు. యాగానికి ఒక్కడు సీక్వెల్ కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. మొత్తానికి ఈ కాంబో మూవీ లవర్స్ కి స్వీట్ షాక్ అనే చెప్పాలి