Idream media
Idream media
భక్తికి మించిన వ్యాపారం లేదు. లాభాలే తప్ప నష్టాలుండవు. కొంచెం ఇంగ్లీష్, పురాణ జ్ఞానం వుంటే మంచిది. లేకపోతే మరీ మంచిది. మన అజ్ఞానానికి మించిన అజ్ఞానులే మన భక్తులే. విశ్వచైతన్య బాబా, ఈయన నాకు నచ్చాడు. సాప్ట్‌వేర్‌లో ఒత్తిళ్లు, మేనేజర్ వేధింపులు ఇవన్నీ భరించలేక బాబా అవతారమెత్తాడు. జనం ఎప్పుడూ ఒక బాబా కోసం వెతుకుతూ వుంటారు. దొరికాడు. నాలుగేళ్ల క్రితం నల్గొండకి వచ్చి కోట్లు సంపాదించాడు. 10 ఎకరాల ఆశ్రమం, యూట్యూబ్ చానల్, రోగాలు నయం చేస్తానని నమ్మించడం. భక్తిలో సేఫ్ పాయింట్ ఏమంటే మన ప్రాడెక్ట్ అమ్మడానికి కష్టముండదు. కస్టమర్లే పోలోమని వస్తారు. ఎవరో ఫిర్యాదు చేశారు. దొరికాడు కాబట్టి దొంగబాబా, లేదంటే చైతన్య బాబా.
ప్రతి బాబా చుట్టూ ఒక మాఫియా వుంటుంది. అందరికీ వాటాలుంటాయి. లోకల్ పోలీసులకి, లీడర్లకి తెలియకుండా బాబా ఎదగడు. అసలు వీళ్లే ప్రమోట్ చేస్తారు. ఆ ఏరియాకి జనం వస్తే వ్యాపారాలు పెరుగుతాయి. చాలా మంది బాబాలు, నాయకుల గుప్పిట్లోనే వుంటారు. ఇద్దరి మధ్య చెడితే బాబా దొంగబాబా అవుతాడు. మోసం కేసులో అరెస్ట్ అయితే ఏం కాదు. బాబా దగ్గర డబ్బులుంటాయి కాబట్టి ఎంత దూరమైనా పోతాడు. ఎన్నేళ్లైనా కేసు నడిపిస్తాడు.
నా చిన్నతనంలో రాయదుర్గంలో ఒక ఆశ్రమం వుండేది. ఆయన అసలు పేరు వేరే. హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఈ అవతారం ఎత్తాడు. చనిపోయిన తర్వాత సమాధిని యాత్రాస్థలం చేశారు. ఇపుడు ఇది వందల కోట్ల వ్యాపారం.
బాబాలు, అమ్మవార్లలో కూడా వర్గాలు, కులాలుంటాయి. కొన్నిసార్లు మత సామరస్యత కూడా నడుస్తుంది. రాయదుర్గంలో వులిగమ్మ అనే గుడి పూజారి వుండేది. పూనకంతో ఎగిరేది. ఆమె భక్తులంతా పల్లెటూరి దిగువ మధ్యతరగతి వాళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు.
హొస్పేట దగ్గర వులిగి అనే వూళ్లో వులిగమ్మ దేవత హెడ్ క్వార్టర్. ట్రాన్స్‌జెండర్స్ ఇష్టదేవత. వులిగిలో ఉత్సవం జరిగినప్పుడు కొన్ని వేల మంది ట్రాన్స్‌జెండర్స్ వస్తారు. కర్నాటక, అనంతపురం జిల్లాలో వులిగమ్మ గుడులుంటాయి.
మా ఇంట్లో కొంత కాలం వులిగమ్మ సేవ నడిచింది. వులిగమ్మ ఫుల్‌గా సారా తాగి , వాసన రాకుండా అమృతాంజనం పూసు కునేది. మా నాన్న దయ వల్ల పువ్వు పుట్టగానే పరిమళించినట్టు మందు వాసన ఎక్కడ ఉన్నా నా ముక్కు పట్టేస్తుంది.
నాకు భక్తి లేకపోయినా బాబాలు, వాళ్ల ఆశ్రమాలు పరిశీలించడం సరదా. ఒకసారి ఒకస్వామిని చూశాను. పెద్ద ఆశ్రమం. కొందరు విదేశీయులు ధ్యానం చేస్తున్నారు. కొందరు వెయిటింగ్. బాబా వచ్చాడు. చిన్న కుర్రాడు. థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్మేవాడిలా ఉన్నాడు. అందరూ కాళ్ల మీద పడ్డారు. నేను దూరంగా ఉన్నాను. దగ్గరికి పిలిచాడు. ఎందుకొచ్చావ్ అన్నాడు. మిమ్మిల్ని చూద్దామని అన్నాను. దండం పెట్టని నన్ను చూసి ఇగో దెబ్బతింది.
నువ్వు చాలా సమస్యల్లో వున్నావ్, ఒకసారి షిరిడీకి వెళ్లిరా అన్నాడు. నేను షిరిడీకి వెళ్లలేదు కానీ, ఆయనే తొందరపడి పైకి వెళ్లిపోయాడు. ఈయనపైన గుప్త నిధుల తవ్వకాల ఆరోపణలున్నాయి. కానీ ఎవరూ నెగెటివ్ వార్తలు రాయరు. ఎందుకంటే ప్రతి సందర్భానికి ఆయన దగ్గరి నుంచి లక్షల రూపాయల యాడ్స్ పత్రికలు గుంజేవి. యాడ్స్ ఇవ్వకపోతే ఒక నెగెటివ్ వార్త వదిలి దారికి తెచ్చుకునేవారు. మన మీడియా ఎంత గొప్పదంటే , దొంగ బాబాల్ని కూడా నమిలి జీర్ణం చేసుకుంటుంది. పులి తన వేటలో కొంత నక్కకి పెట్టినంత కాలం , అది వినయంగా ఉంటుంది. మాఫియా అది ఏదైనా కావచ్చు, భక్తి లేదా ల్యాండ్, పొలిటికల్ లేదా బ్యూరోక్రసీ యాడ్స్ రూపంలో మీడియాకి కొంత వాటా ఇస్తే నో ప్రాబ్లమ్. లేదంటే సత్యశోధన, జర్నలిజం విలువలు అన్నీ సడెన్‌గా గుర్తొస్తాయి.
బెంగళూరులో ఒక ఆశ్రమం చూశాను. ఇది హైఫై. వేల కోట్ల వ్యవహారం. ఇక్కడ భక్తులది కూడా ఒక రేంజ్. ఈ స్వామి ఏమంటా డంటే ప్రతి మంచివాడు నలుగురిని మంచివాళ్లుగా మారిస్తే సమాజం బాగుపడుతుందంటాడు. చెడ్డవాళ్లు ఊరికే వుంటారా? ప‌్రతివాడూ నలుగురిని చెడ్డవాళ్లుగా మారిస్తే? వీళ్లంతా ప్రవచనాల మాస్టర్లు. కరోనా కష్టంలో సోనూసూద్‌లో పదో వంతు కూడా సాయం చేయని ఆధ్మాత్మిక పురుషులు.
చిత్తూరు జిల్లాలో ఒక ఆశ్రమం వుంది. వీళ్లు మంచోళ్లు. మీడియాకి కావాల్సింది మీడియాకి, నాయకులకి కావాల్సింది నాయ కులకి ఇస్తారు. హేతువాదులు, నాస్తికులు తలకిందులు తపస్సు చేసినా ఈ వ్యాపారం ఆగదు. మనిషికి ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. వాడికి ఏదో ఒక శక్తి ఆసరా కావాలి. అందుకే నిరంతరం దుష్టశక్తులు పుడుతుంటాయి.