Idream media
Idream media
దేవీపట్నం జమిందారి ఎస్టేట్ వివాదానికి ముగింపు దొరకడం లేదు.. తూర్పుమన్యంలోని పురాతన కొవ్వాడ పరగణలోని మునుపటి రంపచోడవరం తాలుకాలో ఉన్న దేవీపట్నం భూముల్లో తమ హక్కుల కోసం గిరిజనులు పోరాటం సాగిస్తుంటే ఆ భూములు తమకే దక్కాలంటూ జమిందారి వారసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా ఆరు గిరిజన గ్రామాలు, 400 ఎకరాల బంజరభూమి, వందలాది ఎకరాల అటవీభూమి చుట్టూ ఈ వివాదం పెనవేసుకుంది. 1967లో మొదలైన ఈ వివాదం నేటికీ ఓ అంతులేని కథగానే మిగులుతోంది. దీనిపై రెవెన్యూ యంత్రాంగం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఏంటి ఈ మంటూరు ఎస్టేటు చరిత్ర..?
గతంలో కొవ్వాడ పరిగణనలోని మునపటి రంపచోడవరం తాలూకాలో దేవీపట్నం మండలం ఉండేది. ఆ మండల పరిధిలో ఉన్న మంటూరు ఎస్టేటులోని మంటూరు, పెనికలపాడు, మూలపాడు, మెట్టవీధి, మడిపల్లి, కచ్చులూరు గ్రామాలను తనకు అప్పగించాలంటూ 1967లో జమీందారు, కెప్టెన్ కత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ ఏజెంటుగా జిల్లా కలెక్టరుపై వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై 1972లో రాజమహేంద్రవరం జిల్లా న్యాయస్థానం తీర్పు అమలుకోసం నాలుగున్నర దశాబ్దాలుగా పోరు సాగుతోంది. ఈ తీర్పు చెల్లదంటూ హైకోర్టు మరో కేసులో ఇచ్చిన ఉత్తర్వులతో ఆయా గ్రామాలు, వాటిలోని వేలాది ఎకరాల భూములపై హక్కుదార్లు ఎవరన్నది అర్థం కాకుండా ఉంది. పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో ఈ వివాదం ప్రాధాన్యాంశంగా మారింది.
ఆంగ్లేయుల పాలనలో కొనసాగిన ఎస్టేట్లు, వాటి యాజమన్య నిర్వహణను స్వాతంత్య్రం తర్వాత 1948లో రద్దు చేశారు. దీంతో అవన్నీ ప్రభుత్వ పరమయ్యాయి. మంటూరు జమిందారు కెప్టెన్ పేర్రాజు పంతులు దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును, తర్వాత 1967లో రాజమహేందవ్రరం జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లదంటూ 1972లో జమిందారుకు అనుకూలంగా డిక్రీ జారీ చేసింది. దీనిపై ప్రభుత్వం చేసిన అప్పీల్‌ను 1977లో హైకోర్టు తిరస్కరించింది. తర్వాత కెప్టెన్ పేర్రాజు పంతులు మరణించారు. ఆయన తదనంతరం ఆయన వారసులు ఆ డిక్రీని అమలు చేయాలంటూ 1988లో అదే జిల్లా కోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణాంతరం ఆ భూములను జమిందారు కుటుంబానికి అప్పగించాలని 2007లో జిల్లాకోర్టు కలెక్టరుకు వారెంటును జారీ చేసింది. అయితే 400 ఎకరాల వ్యవసాయభూమిని, వందలాది ఎకరాల అటవీభూమిని, ఆరు గ్రామాలను సొంతం చేసుకోవాలని జమిందారి వారసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఎస్టేటు గ్రామాల పరిధిలో భూములను అనుభవిస్తున్న గిరిజనుల్లో 64మంది తమ సాగుబడిలో ఉన్న ఎస్టేటు భూములకు రైత్వారీ పట్టాలను మంజూరు చేయాలని కోరుతూ రాజమహేంద్రవరం జిల్లా కోర్టు జారీ చేసిన డిక్రీను వ్యతిరేకిస్తూ 1991లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జరిగిన విచారణ తర్వాత 2012లో జస్టిస్ రోహిణి గిరిజనులకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల సాగుబడిలో ఉన్న వందలాది ఎకరాలకు పట్టాలను మంజూరు చేయాలని జిల్లా కలెక్టరు, సెటిల్మెంట్ అధికారి, దేవీపట్నం తహసిల్దారు. జిల్లా కోర్టులను ఆదేశించారు. ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ వచ్చింది. జమీందారుకు అనుకూలంగా వచ్చిన డిక్రీ విషయంలో ప్రభుత్వం తరపున సరైన న్యాయపోరాటాన్ని సాగించి గిరిజనుల పక్షాన నిలవడంలో రెవెన్యూ, ఐటీడీఏ యంత్రాంగాలు విఫలమయ్యాయి. జమీందారు పొందిన డిక్రీ చెల్లుబాటు కాదంటూ తమ సాగుబడిలో ఉన్న భూములకు పట్టాలివ్వాలని 64 మంది గిరిజనులు హైకోర్టు ఉత్తర్వులను పొంది ఆరేళ్లు గడిచినా దాన్ని అమలులొను అధికారులు విఫలమయ్యారు.
పోలవరం ప్రాజెక్టుతో పెరిగిన ప్రాధాన్యం..
ఈ ఎస్టేటు వివాదం పోలవరం పాజెక్టు నేపథ్యంలో ప్రాధాన్యాంశంగా మారింది. ఆరు గ్రామాలకు సంబంధించి హక్కుదారులు ఎవరన్న వివాదం సాగుతుండగా ఇవేమీ పట్టనట్టుగా భూసేకరణ చర్యలు చేపట్టేశారు. కొందరు అనర్హులకు కూడా భూసేకరణ పరిహారాన్ని చెల్లించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై గత ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దినేష్‌కుమార్, రంపచోడవరం సబ్ కలెక్టర్ వినోద్‌కుమార్ ఈ అంశంపై దృష్టిసారించి ప్రత్యేక బాధ్యతలను దేవీపట్నం తహశీల్దారుకు అప్పగించారు. అనర్హులకు ఎలా చెల్లింపులు చేస్తారనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ ఎస్టేటు విషయంలో ఇప్పటికే సెటిల్‌మెంట్ రంపచోడవరం ఐటీడీఏ గత ప్రాజెక్టు అధికారి, సెటిల్‌మెంట్ కమిషనర్ స్థాయిలో పరస్పర సంప్రదింపులు కూడా కొనసాగుతున్నాయి.