iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణ రంగం కుదేలైందని, అందుకు 33 నెలల వైఎస్సార్ సీపీ పాలనే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఎప్పటిలాగే నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇనుము రూ.74 వేలకు చేరిందని, సిమెంటు, ఇటుక ధరలు రెట్టింపయ్యాయన్నారు. సర్కారు తీరుతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఉపాధినిచ్చే నిర్మాణ రంగం సంక్షోభంలో పడడానికి ప్రభుత్వ అసమర్థత, దోపిడీలు కారణం కాదా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.
అన్నింటికీ ప్రభుత్వానిదే బాధ్యతా?
కోవిడ్ కారణంగా ఒక్క నిర్మాణ రంగమే కాక దేశవ్యాప్తంగా అనేక రంగాలు కునారిల్లిపోయాయి. కరోనా దెబ్బకు దేశంలో 13 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని కేంద్ర ప్రభుత్వం చెబుతున్న లెక్క. ఈ విధంగా చాలామంది బతుకు బండి తలకిందులు కావడం వల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి కుంటుపడింది. నిర్మాణ రంగం కూడా కొంత మందగించింది. దీన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి లింకు పెట్టేయడం ఏమిటని వైఎస్సార్ సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రతిదానికి ప్రభుత్వ అసమర్థత, దోపిడీలే కారణం అంటూ నోరు పారేసుకొనే టీడీపీ నేతలు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కోవిడ్‌కు కూడా వైఎస్సార్ సీపీయే కారణం అనేలా ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు.
దోపిడీ జరిగింది మీ హయాంలోనే కదా..
సమర్థవంతమైన పాలన అందించామని గొప్పలు చెప్పుకొనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో నీరు – చెట్టు పథకం పేరిట విచ్చలవిడిగా నాయకులు దోచుకున్నారని అధికార పార్టీ నేతలు అంటున్నారు. మట్టిని, ఇసుకను అమ్ముకొని రూ.కోట్లు గడించింది కాక తమ ప్రభుత్వంపై దోపిడీ అంటూ నిందలు వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ దోపిడీ విధానాలకు, అసమర్థ పాలనకు విసిగిపోయారు కనుకనే ప్రజలు ఆ పార్టీని చిత్తుగా ఓడించారు. తమ పార్టీ పాలనలో ఇసుక అమ్మకాలు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని, దోపిడీకి అవకాశం లేదని చెబుతున్నారు.
కారణం ఇదే..
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది. ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా శంకుస్థాపనలు జరిగాయి. నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అవి పూర్తయితే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్ధేశంతో టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమో నిర్మాణం రంగం మందగించిందంటూ ఆరోపణలు చేయడం… మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టు ఉందని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి ఇన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం కావడంతో సహజంగానే ప్రైవేటు నిర్మాణ రంగంపై ప్రభావం చూపిందని వివరిస్తున్నారు. వాస్తవాలిలా ఉంటే ప్రభుత్వంపై అడ్డగోలుగా విరుచుకుపడడం రాజకీయం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు.