iDreamPost
iDreamPost
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరెస్టయ్యారు. గుంటూరులోని సీఐడీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న క్రమంలో పోలీసులు విధులకు అడ్డువస్తున్నారనే కారణంగా ఆయనను అరెస్టు చేసి గుంటూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వ ఉద్యోగసంఘం నేతగా సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో యాక్టివ్ గా ఉన్న పరుచూరి అశోక్ బాబు రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఆయన వాణిజ్య విభాగంలో పనిచేసిన క్రమంలో డిగ్రీ బీకాం చదవకుండానే సర్వీస్ రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.
విద్యార్హతలను తప్పుగా పేర్కొన్న కారణంగా 477A, 465 (ఫోర్జరీ), 420 (చీటింగ్) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి అశోక్ బాబును ఆయన ఇంటి వద్ద సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని అక్కడి నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ కార్యాలయం వద్దకు వెళ్లిన దేవినేని ఉమా అక్కడ నిరసనకు దిగారు. దీంతో ఉమాను గుంటూరు సీఐడీ కార్యాలయం వద్ద అరెస్టు చేశారు.
అయితే ఎమ్మెల్సీ అశోక్ బాబుని అరెస్ట్ చేసి రాత్రంతా థర్డ్ డిగ్రీ ఉపయోగించారని, అశోక్ బాబును కొట్టే అధికారం సీఐడీ పోలీసులకు ఎవరు ఇచ్చారని ఉమా ప్రశ్నించారు. ఉద్యోగుల పక్షాన నిలబడినందుకే అశోక్ బాబు పై అక్రమ కేసులు బనాయించారని, ఇటీవల కాలంలోనే అశోక్ బాబు సోదరుడు మృతి చెందాడని, అశోక్ బాబు ఫ్యామిలీ ఇబ్బందుల లో ఉందని ఉమా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అశోక్ బాబును మీడియాకి చూపించాలి లేదా కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : టీడీపీ ఎమ్మెల్సీ అరెస్ట్.. డీ కామో.. ఏ కామో.. తేల్చనున్న సీఐడీ..!