Idream media
Idream media
పా.రంజిత్ ఒక ప్రత్యేకమైన దర్శకుడు. సాధారణంగా మన సినిమాల్లో కనిపించని, డైరెక్టర్లకి కూడా అర్థం కాని క్యాస్ట్ డైనమిక్స్ అతని సినిమాల్లో వుంటాయి. దళితవాదాన్ని, అణచివేతని, వర్గాల పోరాటంలో బలవంతులు ఆడే ఆటని, బలహీనుల యుద్ధాన్ని సంఘర్షణని చూపిస్తాడు. సర్పాట పరంబరై అర్థం కావాలంటే పా.రంజిత్ అర్థం కావాలి. సర్పాటని రెండు రకాలుగా చూడచ్చు. స్పోర్ట్స్ డ్రామాగా చూస్తే మధ్యలో కొంచెం బోర్ కొట్టినా (నిడివి 2 గంటల 53 నిమిషాలు) బాగానే తీసాడు. ఫస్టాఫ్ అదుర్స్ అనిపిస్తుంది. ఇంకొంచెం జాగ్రత్తగా చూస్తే ఇది బాక్సింగ్ కథ మాత్రమే కాదు. వేరే చాలా వుంది. ఎందుకంటే ఈ కథని 8 ఏళ్లపాటు రంజిత్ రాసుకుని పనిచేశాడు.
2012లో ఆట్టకలి సినిమా షూటింగ్. అది రంజిత్ ఫస్ట్ సినిమా. ఇంటి గోడకి అంబేద్కర్ ఫొటో. నిర్మాత వచ్చి నాయకుల ఫోటోలు పోలీస్టేషన్లలో వుంటాయి కానీ ఇళ్లలో ఎందుకు అన్నాడు. ఫొటో తీసేశాడు రంజిత్. రాజీ అతనికి కొత్త కాదు. ఒకే గది ఇంట్లో జీవితం మొదలు పెట్టిన దగ్గరి నుంచి అది మామూలే.
కట్ చేస్తే 2021. ఎగ్మూర్‌లో విశాలమైన అపార్ట్‌మెంట్. మొదటి గదిలో కొంత మంది కుర్రాళ్లు క్యారమ్ ఆడుతుంటారు. బుక్ షెల్ప్‌లో వందల తమిళ పుస్తకాలు. అందులో వందకి పైగా అంబేద్కర్ గురించే. ప్రతి గదిలోనూ అంబేద్కర్ ఫొటో. అవి వద్దనే దమ్ములు ఎవరికీ లేవు. అది రంజిత్ ఆఫీస్.
సర్పాట రెండవ సినిమాగా తీయాలనుకున్నాడు. ఉత్తరమద్రాస్‌లోని బాక్సింగ్ మెయిన్ స్టోరీ. రెడ్‌హిల్స్, రాయపురం, మింజారు, ఎన్నూర్, కొరుక్కుపేట ఇంకా కొన్ని ఏరియాలు కలిస్తే నార్త్ మద్రాస్. ఎక్కువగా పోర్ట్ వర్కర్స్ , స్లమ్ ఉన్న ప్రాంతం. రంజిత్ ఇక్కడ నుంచే వచ్చాడు. దాని ప్రత్యేకతలు తెలుసు.
1639లో మద్రాస్ పట్నం అనే ప్రాంతంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అడుగు పెట్టింది. దామర వెంకటనాయకుడి అనుమతితో 1640లో కోట నిర్మాణం చేశారు. 1652లో సెంట్‌జార్జ్ కోట పూర్తయింది. తరువాతి రోజుల్లో అది మహానగరం మద్రాస్, తరువాత చెన్నై అవుతుందని బ్రిటీష్ వాళ్లు వూహించలేదు. వాళ్లు మన నెత్తిన కూచుంటారని మనమూ వూహించలేదు. నార్త్ మద్రాస్‌లో కుర్రాళ్లు వీధి యుద్ధాలు చేసేవాళ్లు. వాళ్ల మీద జనం పందెం కాసేవాళ్లు. బ్రిటిష్ వాళ్లు చూసి చేతులకి గ్లవ్స్ తొడిగి, బాక్సింగ్ నేర్పించారు. ఆ పరంపర ఇప్పటికీ వుంది. అదే సర్పాట పరంపర.
ఈ సినిమా కోసం 45 రోజుల వర్క్‌షాప్ నడిచింది. ప్రతి క్యారెక్టర్‌కి ఒక మాట, బాడీ లాంగ్వేజ్ వుంటాయి. సినిమా చూసిన తరువాత కూడా ఆ పాత్రలు వెంటాడుతాయి. రంజిత్ అలా మలుస్తాడు పాత్రల్ని. ఆర్య కొన్ని నెలల పాటు బాక్సింగ్ శిక్షణ తీసుకున్నాడు. నిజానికి ఇలాంటి కథల్లో కొత్త అంశాలుండవు. హీరో కష్టపడి ఒక ఆట నేర్చుకుని చివరికి గెలుస్తాడు. ఇది అందరూ వూహించేదే.
అయితే ఒక సినిమా కోసం ఆర్య తన శరీరాన్ని మలుచుకున్న తీరు, బాక్సింగ్‌ని నేర్చుకోవడంలో శ్రద్ధ ఆశ్చర్యపరుస్తాయి. సినిమాలో ప్రతిపాత్ర 1975 నాటి నార్త్ మద్రాస్ మనిషిలానే వుంటాడు. షూటింగ్ కోసం స్టూడియోలో సెట్ వేశారు. అడుగు పెట్టిన క్షణం నుంచే బయట వేరే చెన్నై వుందని మరిచిపోయేలా చేశారు. ఎమర్జెన్సీ రాజకీయ నేపథ్యం కూడా కథలో చెప్పడం వల్ల Weight పెరిగింది.
దీన్ని పొరపాటున కూడా తెలుగులో చూడకండి. బ్యూటీ పోతుంది. తమిళ వెర్షన్‌కి సబ్‌టైటిల్స్ వుంటాయి. అదే కరెక్ట్.
20 నిమిషాలు కత్తిరిస్తే బావుండేది. అయినా కూడా సర్పాట ఒక అద్భుతమైన అనుభూతి
సముద్రంలో ఉప్పు వుంటుంది, కనపడదు. బయటికి తీయాలంటే కష్టపడాలి. మనలో వున్న శక్తితో యుద్ధం చేయాలంటే , ముందు ఆ శక్తిని బయటికి తీయాలి. బాక్సింగ్ గెలిచినంత సులభం కాదు, నీ చుట్టూ వున్న వర్గాల్ని గెలవడం. కానీ గెలుస్తాం. వచ్చే రోజులన్నీ మన కాలమే.
ఇదే రంజిత్ చెప్పింది.
Also Read: సార్పట్ట పరంపర రివ్యూ