సార్పట్ట పరంపర రివ్యూ

By iDream Post Jul. 22, 2021, 11:08 am IST
సార్పట్ట పరంపర రివ్యూ

జూలైలో డైరెక్ట్ ఓటిటి రిలీజుల ప్రవాహం కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం విడుదలైన వెంకటేష్ నారప్ప మంచి స్పందన దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ మనకూ అంతో ఇంతో పరిచయమున్న ఆర్య నటించిన సార్పట్ట పరంపర అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కబాలి, కాలా రూపంలో రజినీకాంత్ తో ఏకంగా రెండు సినిమాలు చేసే అవకాశం దక్కించుకున్న రంజిత్ పా దర్శకుడు కావడంతో అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో ఇటీవలి కాలంలో ఎక్కువ చిత్రాలు వస్తున్న తరుణంలో ఈ ఎమోషనల్ డ్రామా ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం

కథ

ఇది దశాబ్దాల క్రితం ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో జరిగే కథ. తమిళనాడులోని కురుప్పర్ ప్రాంతంలో ఆంగ్లేయులు టైం పాస్ కోసం ఆడుకున్న బాక్సింగ్ ని కొన్ని వంశాలు తమ వారసులకు నేర్పించి అదో ప్రతిష్టగా మార్చి ఏడాదికోసారి పోటీలు పెట్టుకుంటూ ఉంటారు. సమర( ఆర్య)కు ఈ అట అంటే పిచ్చి ఉన్నా తల్లి(అనుపమ కుమార్)కి భయపడి ఫ్యాక్టరీలో లేబర్ గా పని చేస్తూ ఉంటాడు. సార్పట్ట తరఫున బరిలో దిగిన వ్యక్తి శత్రు వర్గమైన ఇడియప్ప మనిషి చేతిలో ఓడిపోవడంతో దీన్నో ఛాలెంజ్ గా తీసుకుంటాడు కోచ్ రంగయ్య(పశుపతి). తాను గెలుస్తానని ముందుకు వస్తాడు సమర. అయితే ఛాలెంజ్ చేసినంత ఈజీగా వ్యవహారం ఉండదు. అదేంటో సినిమాలో చూడాలి

నటీనటులు

హీరో ఆర్య దీని కోసం ప్రాణం పెట్టాడు. సమర పాత్రలో ఒదిగిపోయిన తీరు తనను తాను మలుచుకున్న విధానం ప్రతి ఫ్రేమ్ లో స్పష్టంగా కనిపిస్తుంది. దంగల్ లో అమీర్ ఖాన్ తరహా మోడల్ ని ఫాలో అయినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా నేటివిటీ వ్యత్యాసం వల్ల ఆర్య మేకోవర్ ప్రశంసలు దక్కించుకుంది. అతని భార్య పాత్ర పోషించిన దుశారా విజయన్ ఎక్స్ ప్రెషనల్ ఆర్టిస్ట్. మంచి హావభావాలు ఇచ్చింది. గ్లామర్ క్యారెక్టర్ కాదు కాబట్టి ఇంతకన్నా ఆశించలేం. హీరోతో సమానంగా హై లైట్ అయ్యింది మాత్రం పశుపతి. చాలా రోజుల తర్వాత తన స్థాయికి తగ్గ పాత్రలో చెలరేగిపోయారు. జాన్ కొక్కెన్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. సంచనా నటరాజన్, కలైరాసన్, సంతోష్ ప్రతాప్, జాన్ విజయ్ తదితరులు చాలా సహజంగా తమకిచ్చిన బాధ్యతను బాగా నెరవేర్చరు

డైరెక్టర్ అండ్ టీమ్

స్పోర్ట్స్ డ్రామాలు ఒకరకంగా మొనాటనీగా మారిపోతున్న తరుణంలో దర్శకుడు పా రంజిత్ ఇలాంటి కథను ఎంచుకోవడం సాహసమే. బహుశా ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీయాలని నిర్ణయించుకోవడం దీనికి ప్రేరేపించి ఉండవచ్చు. అయితే వీటిలో ఉన్న రిస్క్ వీలైనంత వరకు డ్రామాను హై మీటర్ లో నడిపించకుండా ప్రేక్షకులకు విసుగు రాకుండా చూసుకోవడం. ఫస్ట్ హాఫ్ వరకు ఇదంతా బ్యాలన్స్ గా నడిపించినా రెండో సగంలో సాగతీత వల్ల సార్పట్ట పరంపర ఒకదశలో ఓపికకు పరీక్ష పెడుతుంది. ఇన్ని సన్నివేశాలు అవసరమా అనిపించేలా చాలా ఎపిసోడ్స్ అలా సాగిపోతూ ఉంటాయి. ఇదే ప్రధాన మైనస్ గా చెప్పొచ్చు.

గతంలో చేసిన పొరపాట్లుకు ఎంత మూల్యం చెల్లించాల్సి వచ్చిందో గుర్తుంచుకున్న రంజిత్ పా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కాకపోతే ఈ కథకు 2 గంటల 54 నిమిషాల నిడివి చాలా ఎక్కువ. ఎందుకంటే ఒక బాక్సర్ జీవితం, అందులో ఒడిదుడుకులు, అతను ఒక దశలో వ్యసనపరుడిగా మారి ఆ తర్వాత మళ్ళీ కర్తవ్యం తెలుసుకోవడం గతంలో చాలా సార్లు చూసాం. అంతెందుకు ఇటీవలే వచ్చిన ఫర్హాన్ అక్తర్ తుఫాన్ లో కూడా ఇంచుమించు ఇదే తరహా సంఘర్షణ ఉంటుంది. కాకపోతే అందులో రిజిస్టర్ కానీ భావోద్వేగాలు సార్పట్ట పరంపరలో పండాయి. సినిమాను నిలబెట్టింది ఇదే.

రంజిత్ పా ఇందులోనూ తన భావజాలాన్ని విడిచిపెట్టలేదు. క్రీడా రాజకీయాలను, కుట్రలను కులాల వెనుకబడినతనానికి ఆపాదించే ప్రయత్నం చేశాడు కానీ మరీ కాలా స్థాయిలో లేకపోవడం ఊరట కలిగించే అంశం. హీరో తాగుడు తాలూకు సీన్స్ అన్ని ఎడిటింగ్ లో కత్తెర వేసేందుకు అర్హత ఉన్నవే. మరి ఓటిటి రిలీజ్ అనో ఏమో వాటిని అలాగే ఉంచేయడం ల్యాగ్ కు కారణం అయ్యింది. ఇంకో ముప్పాతిక గంట ఉందనంగా కథనం అప్పుడు పరుగులు పెట్టి కోరుకున్న వేగంతో ముగుస్తుంది. క్లైమాక్స్ తో సహా అంతా మనం ఊహించేదే అయినా కూడా రంజిత్ పా వాటిని డిజైన్ చేయడంలో చూపిన శ్రద్ధ వల్ల పండాయి

సంతోష్ నారాయణ్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా మంచి అవుట్ ఫుట్ ఇచ్చింది. రీ రికార్డింగ్ ని చాలా జాగ్రత్తగా ఎక్కువ సౌండ్ లేకుండా చేయడం మూడ్ ని పక్కకు వెళ్లకుండా కాపాడింది. పాటలు జస్ట్ ఓకే. డబ్బింగ్ కాబట్టి మనకు ఎక్కడం కష్టమే. మురళి జి ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ లో ఉంది. ఆర్ట్ డైరెక్టర్ రామలింగం ఎక్కువ మార్కులు కొట్టేశారు. అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించేలా తన అనుభవాన్ని వాడి సహజత్వం తీసుకొచ్చారు. సెల్వ ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఘనంగా ఉన్నాయి. ఇలాంటి కథను ఇంత బడ్జెట్ ని కేటాయించడం విశేషమే

ప్లస్ గా అనిపించేవి

ఆర్య నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
కెమెరా వర్క్
ఆర్ట్ డైరెక్షన్

మైనస్ గా తోచేవి

ల్యాగ్
సెకండ్ హాఫ్
రిపీట్ అనిపించే సీన్స్
నిడివి

కంక్లూజన్

ఇంట్లో కదలకుండా కూర్చుని హెవీ ఎమోషన్లతో కూడిన స్పోర్ట్స్ డ్రామా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్లకు సార్పట్ట పరంపర బ్యాడ్ ఛాయస్ కాదు. కాకపోతే ముందే ప్లాన్ చేసుకుని మూడు గంటల నిడివికి సిద్ధపడితే తప్ప చివరిదాకా భరించడం కష్టం. పా రంజిత్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా మెరుగ్గా అనిపించడం మాత్రం ఖాయం. ఫుల్ ఎంటర్ టైన్మెంట్, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఒక డిఫరెంట్ సబ్జెక్టుని కోరుకుంటే మాత్రం ఈ సార్పట్ట మీ ఆప్షన్ కాదు. దశాబ్దాల వెనక్కు తీసుకెళ్లి ఒక విభిన్నమైన వాతావరణంలో ప్రయాణం చేయడానికైతే ట్రై చేయొచ్చు. బోర్ కొడితే ఎలాగూ ఫార్వార్డ్ ఆప్షన్ ఉంటుందిగా

ఒక్కమాట - బరువైన ఎమోషన్ల బాక్సింగ్

Also Read: నారప్ప రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp