iDreamPost
android-app
ios-app

డేరాబాబాకు ఎన్నికల పెరోల్!

  • Published Feb 07, 2022 | 12:38 PM Updated Updated Mar 11, 2022 | 10:19 PM
డేరాబాబాకు ఎన్నికల పెరోల్!

హత్య, అత్యాచారం వంటి కేసుల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద డేరా సచ్చా సౌదా అధినేత గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరాబాబాకు పంజాబ్ ఎన్నికల ముంగిట పెరోల్ లభించడం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు 21 రోజుల పెరోల్ లభించినట్లు అధికారవర్గాలు ధృవీకరించాయి. హర్యానా, పంజాబ్ రాష్ట్రాల రాజకీయాల్లో డేరా సచ్చా సౌదా కీలక పాత్ర పోషిస్తుంటుంది. ఈ నేపథ్యంలో మరో రెండు వారాల్లో పంజాబులో ఎన్నికలు జరగనున్న తరుణంలో డేరాబాబాకు మూడు వారాల పెరోల్ లభించడం విశేషం.

ఇప్పటికే పలుమార్లు పెరోల్

హర్యానాలోని పంచకులలో ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ డేరాబాబా హత్య, అత్యాచారం సహా పలు కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇద్దరు సాద్వీలపై అత్యాచారం కేసులో 20 ఏళ్లు, మేనేజర్ సహా ఓ జర్నలిస్టు హత్య కేసులో జీవిత ఖైదు విధిస్తూ పంచకుల సీబీఐ కోర్టు తీర్పు చెప్పగా రోహతక్ లోని సునారియా జైలులో 2017 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఇప్పటికే తల్లి అనారోగ్యం, తన అనారోగ్యం పేరుతో పలుమార్లు అత్యవసర పెరోల్ పొందారు. తాజాగా 21 రోజుల పెరోల్ మంజూరైందని జైలు అధికారవర్గాలు పేర్కొన్నాయి. పెరోల్ పొందడం ఖైదీల హక్కు అని హర్యానా జైళ్ల శాఖ మంత్రి రంజిత్ సింగ్ చౌతాల వ్యాఖ్యానించిన రెండు రోజులకే డేరాబాబాకు పెరోల్ లభించడం విశేషం. దీనిపై హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందిస్తూ పంజాబ్ ఎన్నికలకు డేరాబాబా పెరోల్ కు సంబంధం లేదన్నారు. ఇప్పటికే మూడేళ్ల శిక్ష అనుభవించిన ఆయనకు పెరోల్ పొందే హక్కు ఉందన్నారు.

69 నియోజకవర్గాలపై ప్రభావం

పంజాబ్ రాజకీయాలపై డేరా సచ్చా సౌదా ప్రభావం మొదటి నుంచి ఉంది. రాష్ట్రంలో దీనికి అనుబంధంగా 300 డేరాలు ఉన్నాయి. మాల్వా, మజా, డోబా రీజయన్ల పరిధిలోని 69 నియోజకవర్గాల్లో వీటి ఆధిపత్యం ఉంది. డేరాల మద్దతు ఉన్న పార్టీలు విజయం సాధిస్తుంటాయి. డేరాబాబా జైల్లో ఉన్నా కూడా ఆయన శిష్యులు, భక్తులు రాష్ట్రంలో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల తరుణంలో డేరాబాబా బయటకు వస్తే మరింత ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. హర్యానాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం ఉంది. పంజాబులో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. డేరాబాబా సహకారం ఉంటే ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చన్న ఉద్దేశంతో ఆ పార్టీయే ఆయన పెరోల్ కు సహకరించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.