ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మతి తప్పిందని పేర్కొన్న డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తన తండ్రి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో ఉంటున్న బాలకృష్ణ గురించి తానేమి మాట్లాడబోనని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు మత, కుల ద్వేషాలను రెచ్చగొట్టి పరిపాలించాల్సిన అవసరం లేదని, అధికారం కోసం పాకులాడే వారే రాష్ట్రంలో కుల,మతాలను రెచ్చగొట్టేందుకు ఆలయాలపై దాడులు పేరుతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూల్చిన దేవాలయాల పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేపడుతున్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. కాగా హిందూపురం పర్యటనలో భాగంగా జగన్ ప్రభుత్వంపై హిందూపురం ఎమ్మెల్యే విమర్శలు గుప్పించారు. హిందూపురాన్ని జిల్లాగా ప్రకటించాలని ఆలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని బాలకృష్ణ విమర్శించారు. కాగా ఈరోజు దేవాలయాల పునర్నిర్మాణంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేశారు.