Idream media
Idream media
రాష్ట్రంలో మరోసారి స్థానిక సమరానికి నగారా మోగింది. నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే అందరి దృష్టి కుప్పం మున్సిపాలిటీపైనే ఉంది. ఇక్కడ ఫలితం ఎలా వస్తుందనే ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలోనే కుప్పం మున్సిపాలిటీ ఉండడమే ఇందుకు కారణం. పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ కుప్పం నియోజకవర్గంలో ఘన విజయం సాధించడంతో.. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఆ జోరు కొనసాగిస్తుందా..? లేదా టీడీపీ పట్టు జారలేదని నిరూపించుకుంటుందా..? అనే ఆంశాలపై తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి నెలకొంది.
కుప్పం స్వరూపం ఇదీ..
నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కానిది.. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాతే కుప్పం మేజర్ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కుప్పం టౌన్ చుట్టుపక్కల ఉన్న 8 పంచాయతీలను కలిపి మున్సిపాలిటీని చేశారు. 52 వేల జనాభా కలిగిన కుప్పం మున్సిపాలిటీలో 39,261 ఓటర్లు ఉన్నారు. ఇందులో 19,358 మంది పురుష ఓటర్లు కాగా, 19,897 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
కుప్పం మున్సిపాలిటీలో మొత్తం 25 వార్డులు ఉన్నాయి. మొత్తం 50 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 25 వార్డుల్లో బీసీలకు ఆరు వార్డులు, ఎస్సీలకు ఐదు, ఎస్టీలకు 1 వార్డును రిజర్వ్ చేశారు. జనరల్ మహిళలకు ఏడు వార్డులు, ఆన్ రిజర్డ్వ్‌లో ఆరు వార్డులను ఉంచారు. మొత్తంగా 12 వార్డులను మహిళలకు కేటాయించారు.
ముందుగానే సన్నద్ధం..
మొన్న పరిషత్ ఎన్నికలను, నిన్న జరిగిన బద్వేల్ ఉప ఎన్నికకు దూరంగా ఉన్న టీడీపీ.. కుప్పంలో మాత్రం పోటీ చేసేందుకే సిద్ధమైంది. అందుకే ఆ పార్టీ ఎన్నికలకు ముందు నుంచే సన్నద్ధం అయింది. వైసీపీ కూడా మున్సిపాలిటీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ పార్టీ ముఖ్యనేత, మంత్రి పెద్దిరెడ్డి రాచంద్రారెడ్డి కుప్పం మున్సిపాలిటీపై కూడా వైసీపీ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కొన్నాళ్లుగా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలు చైర్మన్ అభ్యర్థులను కూడా ఖరారు చేసుకున్నాయి. వైసీపీ తరఫున బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సుధీర్‌ని చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ తరఫున బలిజ సామాజికవర్గానికి చెందిన త్రిలోక్‌ను నిర్ణయించారు.
ఈ రోజే నామినేషన్లు మొదలు..
ఈ రోజు నామినేషన్లు మొదలు కానున్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 6వ తేదీన నామినేషన్ల పరిశీలన చేస్తారు. 8వ తేదీన నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. 15వ తేదీన పోలింగ్ జరగనుంది. 17వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తం మీద రెండు వారాల్లోనే ఈ తంతు ముగియనుంది. బాబు కోటలో వైసీపీ జెండా ఎగురుతుందా..? లేదా..? చూడాలి.
Also Read : Kuppam Municipal Elections – చంద్రబాబుకి కఠిన పరీక్షగా మారిన మునిసిపల్ ఎన్నికలు, కుప్పంలో గట్టెక్కేదెలా