Idream media
Idream media
వరుసగా రెండో ఏడాది కరోనా మహమ్మారి వణికించింది. ఏప్రిల్ నుంచి దాదాపు మూడు నెలల పాటు కరోనా సెకండ్ వేవ్ కకావికలం చేసింది. ప్రతి రోజు నాలుగు లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. వేలాది మంది చనిపోయారు. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుండడంతో ఉపసమనం లభిస్తోంది. మరో నెలాఖరు లేదా జూలై మధ్య నాటికి వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వస్తుందని భావిస్తున్నారు. రోజు వారీ కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ఇలాంటి సమయంలో.. అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్.. డెల్టా ప్లస్ దేశంలో వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలోనూ తొలి కేసు నమోదైంది.
మహారాష్ట్రలో అధికం..
డెల్టా ప్లస్ వేరియంట్ యూరప్ దేశాలలో పంజా విసురుతోంది. అక్కడ ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దాని ప్రభావం ఎక్కువగా ఉంది. నూతన వేరియంట్ మన దేశంలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు దేశంలో 40 కేసులు వెలుగుచూశాయి. కరోనా వైరస్ వ్యాప్తి, మరణాలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలోనే.. డెల్టా ప్లస్ కేసులు ఎక్కువగా వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల్లో 21 మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లో ఆరు, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మూడు చొప్పన. కర్ణాటకలో రెండు, పంజాబ్, జమ్మూ కశ్మీర్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్కటి చొప్పన డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.
ఏపీ అప్రమత్తం..
రాష్ట్రంలో తొలి డెల్టా ప్లస్ కేసు వెలుగుచూడడంతో కేంద్రం సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ అప్రమత్తమైంది. వైరస్ కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఏపీలో కరోనా రెండో వేవ్ తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో 80,712 మంది పరీక్షలు నిర్వహించగా.. 4,684 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఏపీలో రోజుకు గరీష్టంగా 20 వేల కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి ప్రస్తుతం నాలుగు వేల కేసులు నమోదవుతున్నాయి. ఈ సంఖ్య రోజు రోజుకూ తగ్గుతున్న తరుణంలో డెల్టా ప్లస్ కేసు వెలుగుచూడడం ప్రభుత్వాన్ని, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.