Idream media
Idream media
ఎన్నికల్లో గెలవాలంటే.. గెలిస్తే ఏం చేస్తారో ముందే చెప్పాలి. చెప్పింది చేస్తామని హామీ ఇవ్వాలి. ప్రతి పార్టీ రాజకీయనాయకుడూ అదే చేస్తారు. అయితే, ఇటీవలి కాలంలో రాష్ట్రంలో అధికారమే ధ్యేయంగా.. హామీలు ఇవ్వడం పరిపాటిగా మారింది. ఏదోలా గెలిస్తే చాలు.. చెప్పింది చేసినా, చేయకపోయికా మనకు ఐదేళ్లు ఢోకాలేదు.. ఇచ్చేయ్ హామీ.. గెలిచేయ్ ఓటు.. అన్న చందంగా కొందరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఊహకందని ప్రకటనలు గుప్పిస్తుంటారు. వేదిక ఎక్కారంటే వాస్తవాలను మరిచి నేల విడిచి సాము చేస్తుంటారు. ఎడాపెడా హామీలు ఇవ్వడం, వాటిని గాలికి వదిలేయడం చాలా మందికి పరిపాటిగా మారింది. కొత్త తరం ముఖ్యమంత్రుల్లో ఇచ్చిన హామీల్లో రెండేళ్లకే 94.5 స్థానం అమలుపరిచిన పేరు ఏపీ సీఎం జగన్ కు ఉంది. కానీ, చాలా మంది 20 శాతం కూడా అమలు చేయని ముఖ్యమంత్రులు చాలా మందే ఉన్నారు. ఇకపై అలాంటి పప్పులుడకవు అన్నట్లుగా ఢిల్లీ హైకోర్టు తీర్పు ఉంది.
హామీలు ఇచ్చే ముందే, అమలు సాధ్యమో లేదో ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తన నిర్ణయానికి సహేతుకమైన కారణాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎటూ తేల్చకుండా దాటేస్తే వాటిని అమలు చేయదగ్గ హామీలుగానే భావించాల్సి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పులో స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి నోటి నుంచి వెలువడిన వరాల అమలు కోసం వాటి నుంచి లబ్ధి పొందాల్సిన వర్గాల ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని చెప్పింది. మఖ్యమంత్రి స్థాయి వ్యక్తి విలేకరుల సమావేశంలోనో మరో బహిరంగ వేదికపైనో ఇచ్చే హామీల అమలుకు ప్రజలు న్యాయస్థానాల ద్వారా పట్టుబట్టవచ్చని ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
కొవిడ్ కష్టకాలంలో ఇంటి అద్దె కట్టలేని వలస కార్మికుల అద్దె బకాయిలను తాము చెల్లిస్తామని గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన హామీపై రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్బుబట్టింది. కేజ్రీవాల్ ఎవర్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రకటన చేశారో వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ హామీ అమలుపై 6 వారాల్లో విధాన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రతిభా ఎం.సింగ్ గురువారం తీర్పు వెలువరించారు.
సీఎం హామీ ఇచ్చిన సంక్షోభ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఆ హామీఅమలుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏకపక్షం కిందకు రాదని, ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండటం చట్ట వ్యతిరేకం అవుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఒకసారి హామీ ఇచ్చాక ఆ హామీని అమలు చేయాలా వద్దా అనే విధాన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు. నాటి హామీని లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఇంటి యజమానులు, కిరాయిదారుల వర్గాల గాయాలకు ఉపశమన లేపనంగా సీఎం ప్రకటించారని, అలాంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందో తెలియడం లేదని వ్యాఖ్యానించారు.
లాక్‌డౌన్‌తో మొదలైన భారీ వలసల నేపథ్యంలో ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేసిన ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ప్రభుత్వం తేలిగ్గా పక్కన పెట్టడం కుదరదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై నిర్ణయం తీసుకున్నపుడే సరైన పాలన అనిపించుకుంటుందని తేల్చిచెప్పారు. ఏమీ తేల్చకుండా నాన్చడం సమస్యకు సమాధానం కాదని 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. గత ఏడాది మార్చి 29న కేజ్రీవాల్ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ కిరాయిదారులు, ఇంటి యజమానులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ ప్రతిభ ఈ తీర్పునిచ్చారు.
ఒట్టు వేసేదే గట్టున పెట్టేందుకనేది సామాజిక అంశాలకే పరిమితమయ్యే పాత నానుడి అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలన విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం, అధికారులు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే మాట తప్పడం కుదరని హామీలు(ప్రామిసరీ ఎస్టోపెల్), చట్టబద్ధ ఆకాంక్షల(లెజిటిమేట్ ఎక్స్‌పెక్టేషన్స్) సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఎలాంటి సంశయం లేకుండా అంగీకరిస్తున్నపుడు దానిపై ఎలాంటి చర్యా లేకపోవడాన్ని ఏ మాత్రం అనుమతించరాదని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాధినేతలుగా ఎన్నికైన వ్యక్తులు, బాధ్యతాయుత హోదాల్లో ఉన్నవారు సంక్షోభ సమయాల్లో తమ పౌరులకు బాధ్యతాయుత హామీలను ఇవ్వాలని ప్రజలు ఆశిస్తారని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి రాజ్యాంగ హోదాలో చెప్పిన మాటలు అమలవుతాయని ప్రజలు భావిస్తారన్నారు. కేజ్రీవాల్ మాటలను ఏ ఇంటి యజమాని కానీ, కిరాయిదారు కానీ నమ్మి ఉండరని చెప్పడం కుదరదని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ పాలన మొత్తం రాష్ట్ర లెఫ్ట్‌నెంట్ గవర్నర్ పేరిట జరుగుతుందని, ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు చట్టబద్ధత లేదని ప్రభుత్వం చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. ఆ కారణం చూపి
ముఖ్యమంత్రి బాధ్యతల నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రభావం ఇతర రాష్ట్రాలలోనూ పడే అవకాశం కనిపిస్తోంది. అన్ని రాష్ట్రాలలోనూ ఈ తరహా డిమాండ్ పెరిగే చాన్స్ ఉంది.