iDreamPost
android-app
ios-app

మ‌రో”సారీ”..!: పట్టు వీడని ప్ర‌భుత్వం.. మెట్టు దిగని రైతులు..!

మ‌రో”సారీ”..!:  పట్టు వీడని ప్ర‌భుత్వం..  మెట్టు దిగని రైతులు..!

కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటికి ఏడు సార్లు చర్చలు జరిగినా.. ఫలవంతం కాకపోవడంతో.. మరోసారి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చ‌ర్చ‌లు జ‌రిపింది. శుక్ర‌వారం ఎనిమిదో సారి కూడా చ‌ర్చ‌లు జ‌రిగాయి. వివాదాస్పద సాగు చట్టాలపై కేంద్ర మంత్రులు, రైతు సంఘాల ప్రతినిధుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు ఎలాంటి పరిష్కారానికి నోచుకోలేదు. రైతులు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వెన‌క్కి త‌గ్గేందుకు ఒప్పుకోవ‌డం లేదు. ప్ర‌భుత్వం స‌వ‌ర‌ణ‌లు మిన‌హా.. చ‌ట్టాల ర‌ద్దుకు స‌సేమిరా అంటోంది. ఎనిమిదో సారి జ‌రిగిన చ‌ర్చ‌లు కూడా కొలిక్కి రాలేదు. ఈనెల 15న మరోసారి సమావేశం కావాలని మాత్రం నిర్ణయించారు. విజ్ఞాన్ భవన్‌లో సుమారు గంటసేపు చర్చలు జరిగినప్పటికీ ఇరువర్గాలు తమ వాదనకే కట్టుబడ్డాయి. సాగు చట్టాలను రద్దు చేయాలని రైతు ప్రతినిధులు ప్రభుత్వానికి మరోసారి విజ్ఞప్తి చేశారు. చట్టాలను వెనక్కితీసుకుంటేనే తాము నిరసనలకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్తామని చెప్పారు. మరోవైపు, ప్రభుత్వం కూడా తమ వైఖరి మరోమారు స్పష్టం చేసింది. వివాదాస్పద క్లాజులకే చర్చలు పరిమితం చేద్దామని, చట్టాలను పూర్తిగా వెనక్కి తీసుకునేది లేదని తెగేసి చెప్పింది.

ఎనిమిదో సారి..

ఎనిమిదో రౌండు చర్చల్లో 41 మంది సభ్యుల రైతుల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే మంత్రి పీయూష్ గోయెల్, వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్‌ ప్రభుత్వం తరఫున హాజరయ్యారు. చర్చల్లో ప్రభుత్వం తమ వాదన వినిపిస్తూ, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు పెద్దఎత్తున రైతు సంస్కరణ చట్టాలను స్వాగతిస్తున్నారని, యావత్ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే యూనియన్లు ఆలోచించాలని కోరింది. గంటసేపు సమావేశానంతరం తమలో తాము సంప్రదించుకున్న ముగ్గురు మంత్రులు సమావేశ హాలు నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇందుకు ప్రతిగా ‘జీతేంగే యా మరేంగే’ నినాదాలున్న పేపర్లు పట్టుకుని రైతు నేతలు మౌనం పాటించారు. కాగా, చర్చలు అసంపూర్తిగా ముగిసినప్పటికీ జనవరి 15న జరిగే తదుపరి చర్చలకు హాజరవుతాయని రైతు నేతలు ప్రకటించారు.