iDreamPost
android-app
ios-app

మోదీని విమ‌ర్శిస్తూ.. ఫేస్ బుక్ లైవ్ లో యూపీ వ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

మోదీని విమ‌ర్శిస్తూ.. ఫేస్ బుక్ లైవ్ లో యూపీ వ్యాపారి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం..

”నేనేమీ జాతి వ్యతిరేకిని కాదు. దేశంపై నాకు నమ్మకం ఉంది. నేను మోదీజీకి ఒకటి చెప్పదలచుకున్నాను.” అంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓ వ్యాపారి ఫేస్ బుక్ లైవ్ లో ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ‌డం, అత‌డి భార్య మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వ్యాపారంలో తీవ్రంగా న‌ష్ట‌పోయాన‌ని, అందుకు జీఎస్టీయే కార‌ణ‌మ‌ని ఆయ‌న పేర్కొన‌డం చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయిన యూపీలోని రాజీవ్ తోమర్ (40) అనే వ్యాపారి తన భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వ్యాపారి భార్య చనిపోగా, ఆయన ఆసుపత్రిపాలయ్యాడు. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆయన ఆత్మహత్యా యత్నానికి పాల్పడటంతో సోషల్ మీడియాలో ఈ వీడియో సంచలనమవుతోంది. మోదీ విధానాల వల్ల చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారంటూ రెండు నిమిషాల వీడియోలో రాజీవ్ తోమర్ ఆరోపించడం, ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో రాజకీయ వర్గాల్లోనూ ఇది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వీడియోలో రాజీవ్ తోమర్ (40) ఒక చిన్న సంచీ (సాచెట్)లోని పదార్ధాన్ని మింగుతుండగా ఆయన భార్య అడ్డుపడింది. అతన్ని ఉమ్మేయమని శతవిధాలా నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ”నాకు మాట్లాడే హక్కు ఉంది. చేసిన రుణాలు చెల్లించాల్సి ఉంది. నేను చనిపోయినా రుణాలు తీరుతాయి. అయితే నా విజ్ఞప్తి ఒక్కటే. ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మందికి ఈ వీడియోను షేర్ చేయండి. నేనేమీ జాతి వ్యతిరేకిని కాదు. దేశంపై నాకు నమ్మకం ఉంది. నేను మోదీజీ (ప్రధానమంత్రి నరేంద్ర మోదీ)కి ఒకటి చెప్పదలచుకున్నాను. మీరు చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషి కాదు. మీరు మీ విధానాలు మార్చుకోండి” అని తోమర్  కన్నీటి పర్యంతమయ్యాడు. తన వ్యాపారాన్ని వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) దెబ్బతీసిందని అన్నారు.కాగా, ఫేస్‌బుక్‌ను చూస్తున్న కొందరు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ దంపతులిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. వీడియోలో వ్యాపారి ఏదో మింగుతుండ‌గా.. అడ్డుకున్న అత‌డి భార్య పూనమ్ తోమర్ (38) చికిత్సపొందుతూ కన్నుమూసింది. భ‌ర్త తిన్న ప‌దార్థాన్ని ఆమె కూడా తిన్నాదా అనేది తెలియాల్సి ఉంది. 

యూపీలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. వ్యాపారి, ఆయన భార్య ఆత్మహత్యాయత్నం చేయడం, ఆ ఘటనలో వ్యాపారి భార్య చనిపోవ‌డంపై విచారం వ్యక్తం చేశారు. వ్యాపారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. రాజీవ్ తోమర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ”ఉత్తరప్రదేశ్‌లోని చిన్న వ్యాపారులు, వాణిజ్యవేత్తలు ఎంతటి నిరాశానిస్పృహలతో ఉన్నారో చూడండి. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ, లాక్‌డౌన్‌లు వారిని బాగా దెబ్బతీశాయి” అని యూపీలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ ఆమె వ్యాఖ్యానించారు.