iDreamPost
android-app
ios-app

జలీల్ ఖాన్ బి.కాం ,ఈ ఎమ్మెల్సీ “డి.కాం”

జలీల్ ఖాన్ బి.కాం ,ఈ ఎమ్మెల్సీ  “డి.కాం”

బిఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్సీ.. ఇవి మనకు తెలిసిన డిగ్రీలు. పీజీలోకి వెళితే ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంఎస్సీ తదితర కోర్సులు ఉంటాయి. ఈ డిగ్రీలే కాదు.. మరో కొత్త డిగ్రీ కూడా ఉందని ఇటీవల తెలుగు ప్రజలకు తెలిసింది. అదే డి.కామ్‌. ఇంతకు మునుపెన్నడూ వినని ఈ డిగ్రీ.. ఇప్పుడు ఎలా వచ్చిందని సందేహిస్తున్నారా..? ఆ సందేహం ఏ మాత్రం అవసరం లేదు. డి.కామ్‌ చదివింది ఎవరో ఆషామాషీ వ్యక్తి కాదు. ఆయనో ప్రజా ప్రతినిధి. పెద్దల సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయనే పి.అశోక్‌బాబు. ఈ టీడీపీ ఎమ్మెల్సీ.. తాను డి.కామ్‌ చదివానని చెబుతున్నారు. కాబట్టి ఇది నవ్వులాట కోసం చేసిన ప్రచారం అని అనుకోవడానికి లేదు. సీరియస్‌ మ్యాటర్‌.

బిఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీలలో ఏఏ సబ్జెక్టులు ఉంటాయో చదువుకున్న వారికి తెలుసు. ఆ మధ్య.. బీకామ్‌లో సబ్జెక్టులు మార్చారేమోనన్న సందేహం ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జలీల్‌ఖాన్‌ చెప్పడం వల్ల తెలుగు ప్రజలకు కలిగింది. తెలుగు వారికే కాదు.. యావత్‌ దేశ ప్రజలకు ఆ సందేహం వచ్చింది. బీకామ్‌లో ఫిజిక్స్‌ చదివానంటూ ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పడం వైరల్‌ అయింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. తాను బీకామ్‌ చదివానని, ఫిజిక్స్‌ అందులో ఉండదని చెబుతున్నా.. వినకుండా.. ఉంటదుంటది.. బీకామ్‌లో ఫిజిక్స్‌ ఎందుకు ఉండదు..? అంటూ ప్రశ్నించి దేశ వ్యాప్తంగా జలీల్‌ఖాన్‌ ప్రాచుర్యం పొందారు.

ఇప్పుడు మళ్లీ టీడీపీకి చెందిన మరో ప్రజా ప్రతినిధి.. తన విద్యార్హతను కొంగొత్తగా చెప్పి వార్తల్లో నిలిచారు. తాను చదివింది డి.కామ్‌ అని చెప్పడమే కాదు.. అందులో ఏముంటుందో కూడా అశోక్‌బాబు వివరిస్తున్నారు. డి.కామ్‌ అంటే డిప్లమో ఇన్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అంటూ విద్యార్హతల విషయంలో చేసిన మోసంపై నమోదైన సీఐడీ కేసు నుంచి తప్పించుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్సీ కాక ముందు అశోక్‌బాబు ప్రభుత్వ ఉద్యోగి. ఎన్జీవో సంఘం అధ్యక్షుడుగా రాష్ట్ర విభజన సమయంలో ఓ వెలుగు వెలిగారు. ఎన్నికల్లో ఇతోదికంగా సాయం అందించిన అశోక్‌బాబుకు టీడీపీ ఎమ్మెల్సీని బహుమతిగా ఇచ్చింది. 2019 జవవరిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అశోక్‌బాబును చంద్రబాబు పెద్దల సభకు పంపారు.

పదవి ఇచ్చిన పార్టీకి న్యాయం చేసేందుకు అశోక్‌బాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. అందులో భాగంగా పీఆర్‌సీ విషయంలో ఉద్యోగులను రెచ్చగొట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే ఆయన నోరు జారారు. ఒకప్పుడు ఉద్యోగ సంఘం నేత అయిన అశోక్‌బాబు.. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు అక్కా, బావ కబుర్లు చెబుతున్నారంటూ వారిని ఆడ, మగ కాని వారితో పోల్చారు. దీంతో కొంత మంది నేతలకు చిర్రెత్తుకొచ్చి.. అశోక్‌బాబు బండారాన్ని బయటపెట్టారు. దొంగ సర్టిఫికెట్‌ పెట్టి.. ఉద్యోగంలో ప్రమోషన్‌ పొందారని ఫిర్యాదు చేయడంతో సీఐడీ రంగంలోకి దిగింది. దీంతో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు డి.కామ్‌ డిగ్రీని తెరపైకి తెచ్చారు. తాను డి.కామ్‌ అని చెప్పానని అయితే టైపోగ్రాఫిక్‌ తప్పిదంతో బి.కామ్‌గా పడిందని చేసిన తప్పును సమర్థించుకుంటున్నారు.

బి.కామ్‌లో ఫిజిక్స్‌ అంటూ చెప్పిన జలీల్‌ఖాన్‌.. ఆ తర్వాత నాలుకకరుచుకుని వివరణ ఇచ్చినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అది ఆయన రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టింది. సినిమాల్లో స్నూప్‌లు చేసుకునేందుకు, ఆ అంశం ఆధారంగా విజయవంతమైన సినిమా కథలు రాసుకునేందుకు జలీల్‌ ఖాన్‌ ఉదంతం తోడ్పడింది. మరి ఇప్పుడు డి.కామ్‌ డిగ్రీ చదివానని చెబుతున్న అశోక్‌బాబు కూడా మరో జలీల్‌ఖాన్‌ కాబోతున్నారా..? చూడాలి.